Sat Jul 12 2025 12:35:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలో పట్టాలపై కారు నడిపిన మహిళ ముస్లిం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
తెలంగాణలో పట్టాలపై కారు నడిపిన మహిళ

Claim :
తెలంగాణలో పట్టాలపై కారు నడిపిన మహిళ ఓ ముస్లింFact :
ఆ అమ్మాయి ముస్లిం కాదు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు
భారతదేశంలో రైల్వేల కారణంగా రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా భారత్ ఉంది. కార్యాచరణ సామర్థ్యం, భద్రతను మెరుగుపరిచే ప్రయత్నం రైల్వే మంత్రిత్వ శాఖ చేస్తూనే ఉంది. భారతీయ రైల్వే విభాగం 100 సంవత్సరాలకు పైగా ఉన్న రైలు నియంత్రణ వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నాయి.
కార్యకలాపాలు, ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, రైళ్లను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఆధునిక, సాంకేతికత ఆధారిత వ్యవస్థ కోసం రైల్వే బోర్డు త్వరలో వివరణాత్మక బ్లూప్రింట్‌ను రూపొందిస్తుందని అధికారులు తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, జాప్యాలు, ప్రమాదాల నివారణకు సంబంధించిన ఆవశ్యకత గురించి పలు సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రణాళికాబద్ధమైన సమగ్ర పరిశీలన, సరుకు రవాణా-భారీ కారిడార్లతో పాటు హై-స్పీడ్, మిశ్రమ-ట్రాఫిక్ మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. రైలు కార్యకలాపాలకు సంబంధించి అన్ని విభాగాలను ఒకచోట చేర్చే ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఈ కొత్త వ్యవస్థలో కేంద్రంగా ఉంటుంది. రైలు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా సంస్కరణల అవసరం కూడా ఉందని తెలుస్తోంది. రైల్వే బోర్డు ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో మార్పులను సిఫార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఇంతలో ఓ మహిళ రైలు పట్టాలపై కారులో కూర్చుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వైరల్ వీడియోలో ఉన్న మహిళ ముస్లిం అంటూ పోస్టులు పెట్టారు.
కారు చుట్టూ పలువురు వ్యక్తులు ఉండడం కూడా మనం వీడియోలో చూడొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మహిళ ముస్లిం కాదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఈ ఘటనకు సంబంధించి పలు నివేదికలు లభించాయి. ఈ ఘటన జూన్ 26, 2025న చోటు చేసుకుంది.
జూన్ 25 ఉదయం హైదరాబాద్ శివార్లలో ఒక మహిళ రైల్వే ట్రాక్‌లపై కారు నడపడంతో రైలు సేవలకు అంతరాయం కలిగిందని పోలీసులను ఉటంకిస్తూ పిటిఐ నివేదించింది. ఆ మహిళ శంకర్పల్లి నుండి హైదరాబాద్ వైపు రైల్వే ట్రాక్‌లపై దాదాపు ఎనిమిది కిలోమీటర్లు కారు నడిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు గూడ్స్ రైళ్లు, రెండు ప్యాసింజర్ రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ శంకర్పల్లి నుండి హైదరాబాద్ వైపు నేరుగా పట్టాలపై కారు నడుపుతూ కనిపించింది. రైల్వే సిబ్బంది ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె అధిక వేగంతో వెళ్ళిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఎదురుగా వస్తున్న రైళ్లను ఆపారు. వాహనాన్ని ఆపి పట్టాల నుండి కారును తొలగించడానికి దాదాపు 30 నిమిషాలు పట్టిందని, ఆ తర్వాత రైలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులను సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
మా తదుపరి పరిశోధనలో ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు లభించాయి. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి సమీపంలో గురువారం ఉదయం రైల్వే పట్టాలపై తన కారును నడిపి, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు 34 ఏళ్ల మహిళను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన వోమికా సోనీ అనే మహిళ అకస్మాత్తుగా శంకర్పల్లి-నాగులపల్లి స్టేషన్ల మధ్య లెవల్-క్రాసింగ్ గేటు వద్ద రైల్వే పట్టాలపైకి ప్రవేశించింది. రైల్వే సిబ్బంది ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, తన కారు, కియా సోనెట్‌ను నడుపుతూనే ఉందని రైల్వే అధికారి తెలిపారు.
ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉందని మీడియా కథనాలు కూడా తెలిపాయి. రెండు నెలల క్రితం గచ్చిబౌలిలోని ఒక MNC లో ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉందని విచారణలో తేలింది. ఆ మహిళ తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురైనట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఎస్పీ చందన దీప్తి సూచనల మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు ఆమెను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి, ఆపై ఎర్రగడ్డలోని ఐఎంహెచ్కు తరలించారు. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక ఆ మహిళను జూన్ 28న మెంటల్ హాస్పిటల్ కు తరలించినట్లు మీడియా కథనాలు తెలిపాయి. సోనీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సంప్రదించినప్పుడు, ఆమె అధికారులపై దాడి చేసింది. దీంతో అధికారులు ఆమె మానసిక అస్థిరతపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను వెంటనే చేవెళ్లకు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు, అక్కడ ఆమె మానసికంగా స్థిరంగా లేదని వైద్యులు నిర్ధారించారు. తదుపరి చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి.
పోలీసులు ఈ ఘటన గురించి స్పందిస్తూ ఎక్కడా కూడా ఆ మహిళ మతం గురించి ప్రస్తావించలేదు. ఈ ఘటనలో మతపరమైన కోణం కూడా లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : తెలంగాణలో పట్టాలపై కారు నడిపిన మహిళ
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story