Sat Dec 07 2024 14:44:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ను సమర్ధిస్తూ చూపుతున్న వీడియో ఎడిట్ చేసింది
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతపై చర్చ జోరందుకుంది. ఇటీవలి మహారాష్ట్ర
Claim :
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ను సమర్థిసస్తూ మాట్లాడిన పాత వీడియోFact :
తప్పుదారి పట్టించేలా పాత వీడియోను ఎడిట్ చేశారు. భారతదేశంలో EVMలకు మద్దతు ఇస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతపై చర్చ జోరందుకుంది. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మహా వికాస్ అఘాడీ అభ్యర్థులు తమ సెగ్మెంట్లలోని ఈవీఎం-ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (VVPAT) యూనిట్‌ను ధృవీకరించాలని కోరారు. శరద్ పవార్ వంటి నేతలు ఈవీఎంలపై వ్యాఖ్యానించారు. టెస్లా CEOఎలోన్ మస్క్ కూడా ఈవీఎం మెషీన్లను తొలగించాలని, అవి మానవులు లేదా కృత్రిమ మేధస్సు ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని తాను విశ్వసిస్తున్నానంటూ కామెంట్లు చేసి అగ్ని కి ఆజ్యం పోసారు.
288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి 230 సీట్లు, మహా వికాస్ అఘాడీ 46 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని, బీజేపీ చీఫ్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ని సమర్ధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.
వీడియోలో, “మన దేశం పేదది, ప్రజలకు ఏమీ అర్థం కాదు. ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలోనైనా ఎన్నికలు జరిగినప్పుడు బ్యాలెట్ పేపర్‌నే వాడతారు. వారు పేర్లను చదివి, ఎన్నుకోబడే వ్యక్తిపై ముద్ర వేస్తారు." అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను "మోదీ పాత వీడియో దొరికింది” వంటి విభిన్న శీర్షికలతో ప్రచారంలో ఉంది. "2014కు ముందు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని మోదీ అన్నారు. మరి ఇప్పుడు ఈవీఎంలను బీజేపీ ఎందుకు సమర్థిస్తోంది? ఈ వీడియోను ప్రతిఒక్కరికీ చేరవేయండి. ” అంటూ చెప్పడం చూడొచ్చు.
“ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి. అమెరికా ప్రజలు కూడా ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగిస్తున్నారు. - 2014కి ముందు నరేంద్ర మోదీ” అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వీడియోను ఎడిట్ చేసి, తప్పుదారి పట్టించే విధంగా పోస్టులు పెడుతున్నారు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతకగా, ఆ వీడియో 2016 సంవత్సరం నుండి ఆన్ లైన్ లో ఉందని, చాలా పాతదని మేము కనుగొన్నాము.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతకగా, ఆ వీడియో 2016 సంవత్సరం నుండి ఆన్ లైన్ లో ఉందని, చాలా పాతదని మేము కనుగొన్నాము.
డిసెంబరు 3, 2016న భారతీయ జనతా పార్టీ యూట్యూబ్ ఛానెల్ లో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను గుర్తించాం. పరివర్తన్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. వైరల్ భాగం 37.20 నిమిషాల వద్ద చూడవచ్చు. దేశంలో జరిగిన డిజిటలైజేషన్ ప్రయోజనాల గురించి భారత ప్రధాని మాట్లాడటం వినవచ్చు. ATM మెషీన్ల నుండి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు పొడవాటి క్యూలలో ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఫోన్లలోనే అన్ని కొనుక్కునే సదుపాయం వచ్చింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించి ఓటు వేస్తారని, అక్కడ పేరు కోసం వెతకాలి, ఆపై అవసరమైన పేరుపై ముద్ర వేయాలి. భారతదేశంలో మనం బటన్‌ను నొక్కడం ద్వారా ఓటు వేస్తాం అని చెప్పారు.
నరేంద్ర మోదీ ఛానెల్ ప్రచురించిన అదే యూట్యూబ్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. డిసెంబర్ 3, 2016న వీడియోను అప్లోడ్ చేశారు.
ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు న్యూస్ వెబ్సైట్ NDTVలో ప్రచురించారు, ర్యాలీలో ఆయన చేసిన ప్రకటనలను మనం చూడవచ్చు. "భారతీయులు నిరక్షరాస్యులని కొందరు చెబుతూ ఉంటారని. కానీ ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తారు. భారతదేశం ఒక బటన్ ద్వారా ఓటు వేస్తుంది. నా దేశం మార్పును అంగీకరిస్తుంది. నా దేశంలోని పేదలు దీనిని అంగీకరిస్తారు." అని మోదీ చెప్పినట్లుగా కథనంలో ఉంది.
వైరల్ వీడియోలో బ్యాలెట్ పేపర్ ఆధారిత ఓటింగ్ సిస్టమ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఇవ్వలేదని స్పష్టంగా అర్థం అవుతోంది. కానీ దీనికి విరుద్ధంగా, ప్రపంచం మొత్తం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తుండగా, భారతదేశం ఈవీఎం యంత్రాలను ఉపయోగిస్తుందని ఆయన చెప్పారు.
తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేయడానికి అసలు వీడియోను ఎడిట్ చేశారు. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేదిగా గుర్తించాం.
Claim : భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ను సమర్థిసస్తూ మాట్లాడిన పాత వీడియో
Claimed By : X (Twitter) users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story