ఫ్యాక్ట్ చెక్: వైరల్ పోస్టుల్లో ఉన్నది న్యూక్లియర్ వార్ హెడ్ కాదు శివలింగం
ఒక పెద్ద రాతి లాంటి నిర్మాణం చుట్టూ దండలు వేసి, భారీ ట్రక్కులో రవాణా చేస్తున్నట్లు

Claim :
న్యూక్లియర్ వార్ హెడ్ కు భారతదేశ ప్రజలు పూజలు చేస్తున్నారుFact :
అది శివలింగం. ఆలయంలో ప్రతిష్టించడానికి తీసుకుని వెళుతూ ఉండగా ప్రజలు పూజలు నిర్వహించారు
2026 జనవరి 11 సాయంత్రం, జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైపు నుండి భారత గగనతలంలోకి ప్రవేశించిన అనేక అనుమానిత డ్రోన్లను గుర్తించాయి. సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో డ్రోన్లను భారత సైన్యం గుర్తించింది.ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని గనియా-కల్సియన్ గ్రామంపై జనవరి 11 సాయంత్రం 6:35 గంటలకు డ్రోన్లను మొదట గుర్తించారు, అక్కడ ఆర్మీ దళాలు తేలికపాటి, మధ్యస్థ మెషిన్ గన్లను ఉపయోగించి కాల్పులు జరిపాయి. రాజౌరిలోని ఖబ్బర్ గ్రామం, సాంబాలోని చక్ బార్బల్ గ్రామం, పూంచ్ జిల్లాలోని మంకోట్ సెక్టార్లలో కూడా డ్రోన్స్ ను గుర్తించారు. ఈ డ్రోన్స్ ఆయుధాలు లేదా డ్రగ్స్ వంటి వాటిని విడిచేసి వెళ్లిపోయాయా అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అయితే ఒక పెద్ద రాతి లాంటి నిర్మాణం చుట్టూ దండలు వేసి, భారీ ట్రక్కులో రవాణా చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. భారతీయులు న్యూక్లియర్ వార్‌హెడ్‌ను పూజిస్తున్నట్లుగా పోస్టులు పెట్టారు కొందరు.
వైరల్ పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఆర్కైవ్ చేసిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి
ఇక వైరల్ అవుతున్న వాదనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు. పొరుగు దేశాలు, చైనా, పాకిస్తాన్లను ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసిన అణ్వాయుధ క్షిపణిని భారతీయులు పూజిస్తున్నారనే వాదనతో ఈ దృశ్యాలను పోస్టు చేశారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఈ వీడియో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని తమిళనాడు నుండి బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు తరలిస్తున్న ఘటనకు సంబంధించింది అని తేలింది.
వీడియోలోని కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జనవరి, 2026లో అప్లోడ్ చేసిన పలు మీడియా కథనాలు లభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా మీడియా సంస్థలు అభివర్ణించాయి.
జనవరి 4న వార్తా సంస్థ ANI చేసిన X పోస్ట్ కూడా మాకు లభించింది.
ANI పోస్ట్ లో “గోపాల్‌గంజ్, బీహార్: తమిళనాడు నుండి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం గోపాల్‌గంజ్ చేరుకుంది. మోతీహరిలోని విరాట్ రామాయణ ఆలయానికి వెళుతోంది.” అని వివరించింది.
NDTV మీడియా సంస్థకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్టులో కూడా వైరల్ వీడియోను పోలిన పోస్టు మాకు లభించింది.
ఈ శివలింగం 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బీహార్‌లోని తూర్పు చంపారణ్లో త్వరలో ప్రారంభించనున్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్టించనున్నట్లు కథనాలు తెలిపాయి. మహాబలిపురం నుండి శివలింగం ప్రయాణం మొదలైంది. మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ఒకే రాయిపై ఈ శివలింగాన్ని చెక్కారు.
ఈ శివలింగానికి సంబంధించిన వివరాలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
భారతీయులు అణ్వాయుధాలను పూజిస్తున్నట్లు తప్పుగా ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టారు. శివలింగాన్ని రవాణా చేస్తున్న వీడియోను షేర్ చేశారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
విరాట్ రామాయణ ఆలయం:
జనవరి 17న జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమం వేద ఆచారాలు, పండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహించనున్నారు. పవిత్ర మండలాల సమ్మేళనాన్ని సూచించే ఈ వేడుకలో ఐదు పవిత్ర స్థలాలు: కైలాష్ మానసరోవర్, గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, సోనేపూర్ నుండి నీటిని అందిస్తారు. అరుదైన సందర్భంలో గ్రహాల కలయిక కారణంగా వేడుక తేదీని ఎంపిక చేశారు, ఇది మహా శివరాత్రికి సమానమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఆచారాలు ప్రారంభమయ్యే సమయంలో హెలికాప్టర్ నుండి పూల వర్షం కురుస్తుంది. 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విరాట్ రామాయణ మందిరం, అప్పటి మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి దివంగత ఆచార్య కిషోర్ కునాల్ ఆలోచన నుండి పుట్టుకొచ్చింది. భారత దేశం ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణం ఉంది.

