Fri Dec 05 2025 12:21:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ నేతలను కారులో ఈడ్చుకుంటూ వెళ్లారని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్న పోలీసులు
బీఆర్ఎస్ కార్యకర్త పోలీసు వాహనానికి వేలాడారు

Claim :
బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారుFact :
నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్త పోలీసు వాహనానికి వేలాడారు
ఓ వ్యక్తికి పోలీసు కారుకు వేళాడుతూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ కారు వెనుక ఓ పోలీసు కూడా పరిగెత్తుతూ ఉండడం ఆ క్లిప్ లో ఉంది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుందని, తెలంగాణ పోలీసులు ఆ వ్యక్తిని ఈడ్చుకెళ్లారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
"పోలీసులా లేక వీధి రౌడీలా!
కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు
ఓ వైపు నిందితులకు రాచ మర్యాదలు.. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కారులో రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వైనం
భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడికి నిరసనగా వినాయక చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న వల్లపు విజయ్ ముదిరాజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు
దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు: అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ పోలీసులు వీడియోను విడుదల చేశారు.
వైరల్ పోస్టుల ఆధారంగా 'వల్లపు విజయ్ ముదిరాజ్' అనే వ్యక్తిని పోలీసులు లాక్కుని వెళ్లారని మేము తెలుసుకున్నాం. సంబంధిత కీవర్డ్స్ తో మేము గూగుల్ సెర్చ్ చేశాం.
'భువనగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం' అంటూ నమస్తే తెలంగాణలో ఓ కథనాన్ని మేము చూశాం.
"అందులో.. భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడికి నిరసనగా వినాయక చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో వల్లపు విజయ్ ముదిరాజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు" అని ఉంది. ఆ కథనానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది.
వైరల్ ఫోటోను మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. రాచకొండ పోలీసులు ఎక్కువ నిడివి ఉన్న వీడియోను పోస్టు చేశారు. వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు కొందరు నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, ఆందోళనకారులలో ఒకరు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము ఇచ్చిన వీడియో ఫుటేజీలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఫోటో ఒక నిర్దిష్ట కోణం నుండి తీశారు, ఇది తప్పుదారి పట్టించేలా వదంతులను సృష్టిస్తున్నాయని పోలీసులు తెలిపారు. వాస్తవాలను ధృవీకరించకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నామన్నారు. రాచకొండ పోలీసు విభాగం శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆ పోస్టులో తెలిపారు.
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదంటూ మీడియా కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
వల్లపు విజయ్ ముదిరాజ్‌ను పోలీసులు లాక్కుని వెళ్లారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఫోటోను సర్క్యులేట్ చేస్తున్నారని వీడియో ఆధారాలతో పోలీసులు వివరణ ఇచ్చారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది.
Claim : బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost
Claim Source : Social Media
Fact Check : False
Next Story

