Sat Dec 13 2025 22:32:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెకింగ్: మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్నదిగా ప్రచారం చేస్తున్నారు
ఒక మహిళ తన ఇంటి బయట చిమ్ముతూ ఉండగా దొంగలు ఆమె మెడలోని గొలుసును దొంగిలించిన సీసీటీవీ విజువల్ వైరల్

Claim :
వైరల్ వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుందిFact :
ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ కు ఎలాంటి సంబంధం లేదు
రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతూ ఉంది. సామాన్య ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడే స్థాయికి చేరింది. ఇక ఈజీ మనీకి అలవాటు పడిన వ్యక్తులు మహిళల మెడలోని చైన్లను దొంగతనం చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రాలతోనూ, ప్రాంతాలతోనూ సంబంధం లేకుండా చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంతో కష్టపడి కొనుక్కున్న బంగారు గొలుసులను ఇలా దొంగలు దోచుకుని వెళుతూ ఉంటే బాధితుల బాధ వర్ణనాతీతం. అయితే చాలా దొంగతనాల కేసుల్లో దొంగిలించిన బంగారం తిరిగి బాధితుల వద్దకు చేరుకోవడం కష్టమే.
ఒక మహిళ తన ఇంటి బయట చిమ్ముతూ ఉండగా దొంగలు ఆమె మెడలోని గొలుసును దొంగిలించిన సీసీటీవీ విజువల్ వైరల్ అవుతూ ఉంది. ఆ తర్వాత పోలీసులు వాహనంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె గొలుసు ఆమెకు తిరిగి ఇచ్చివేయడం చూడొచ్చు. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నదిగా సోషల్ మీడియా పోస్టుల్లో చెబుతున్నారు.
"ఉత్తర ప్రదేశ్ లో యోగీ జీ పాలన రామరాజ్యాన్ని తలపిస్తుంది....
తప్పు చేసిన వాడికి గంటల వ్యవధిలో గతం గుర్తొచ్చేలా చర్యలు ఉంటున్నాయి....
ఇది ఇక్కడ సన్నాసి పాలనకు మరియు అక్కడ సన్యాసి పాలనకు స్పష్టమైన తేడా.....
#uttarpradesh #cm #yogiadityanath" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వీడియోలో చూపిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్నది కాదు. మహారాష్ట్రలో జరిగిన ఘటన.
వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు వైరల్ వీడియోలోని విజువల్స్ ను స్క్రీన్ షాట్ గా కలిగిన పలు మీడియా కథనాలు లభించాయి.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాల ద్వారా ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటు చేసుకుందని మీడియా సంస్థలు తెలిపాయి.
300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించడం ద్వారా అకోలా పోలీస్ క్రైమ్ బ్రాంచ్ 36 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను గుర్తించింది. గుజరాత్‌కు చెందిన అంతర్రాష్ట్ర నేరస్థులైన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు, రూ.1.5 లక్షల విలువైన దొంగిలించబడిన 15 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో మహిళకు క్షమాపణ కూడా చెప్పించారు. జూలై 10న, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆనంద్ నగర్ ప్రాంతంలోని తన ఇంటి ముందు భాగంలో చెత్త ఊడ్చుతుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ నుండి బంగారు గొలుసును లాక్కున్నారు. ఓ ఇంటి చిరునామా కావాలంటూ దుండగులు ఆమెను సంప్రదించారు. క్షణాల్లో ఆమె మెడ నుండి మంగళసూత్రాన్ని లాక్కుని వెళ్లారు. ఖడాన్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 304 కింద వెంటనే కేసు నమోదు చేశారు. అకోలా పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నుండి రెండు ప్రత్యేక బృందాలు 200 కి పైగా సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించి సాంకేతిక దర్యాప్తు ప్రారంభించాయి. నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కలోల్‌కు చెందిన దీపక్ పర్మార్, సబర్కాంత (గుజరాత్) నివాసి రాకేష్ పఠానీగా గుర్తించారు.
నిందితులిద్దరూ రైలులో షెగావ్‌కు ప్రయాణించి, అక్కడ ఒక బైక్‌ను దొంగిలించి, అకోలాలోకి చేరుకున్నారు. గొలుసు దొంగతనం చేసిన తర్వాత, వారు బైక్‌ను వదిలివేసి వేర్వేరు దిశల్లో పారిపోయారు. ఒకరు నాగ్‌పూర్‌కు, మరొకరు గుజరాత్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు నిందితులను పట్టుకుని మహిళ వద్దకు తీసుకుని వచ్చి క్షమించమని కోరేలా చేశారు.
అకోలా పోలీసులు కూడా ఈ చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించిన పత్రికా ప్రకటనను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకోలేదు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ కు ఆపాదిస్తూ ఉన్నారు.
Claim : ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ కు ఎలాంటి సంబంధం లేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story

