ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21000 రూపాయలు పెట్టుబడి పెట్టమని అడగలేదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21000 రూపాయలు పెట్టుబడి

Claim :
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లో 21000 రూపాయలు పెట్టుబడి పెట్టమని కోరారుFact :
వైరల్ అవుతున్న వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జులై 14న మాట్లాడుతూ తమ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకునేలోపు జూన్ 2026 నాటికి లక్ష ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ (పిడిఎస్) కార్డుల పంపిణీని ప్రారంభించిన తర్వాత నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపు (డిసెంబర్, 2023లో) 60,000 మందిని నియమించడం ద్వారా దేశంలో రికార్డు సృష్టించిందని అన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని, వేలాది మంది నిరుద్యోగ యువత హైదరాబాద్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ సంవత్సరాల పాటూ నిరాశతో గడపాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష బిఆర్ఎస్ తన 10 సంవత్సరాల పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా కనీసం ఆలోచించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతులకు అనుకూలంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్వాంటం ఏఐ ప్లాట్ ఫామ్ లో పెట్టుబడి పెడితే ప్రతి ఒక్కరికీ ఆదాయం లభిస్తుందని చెబుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 21000 రూపాయలను పెట్టుబడి పెట్టించేందుకు ఆకర్షించేలా ఆ పోస్టులు ఉన్నాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఎలాంటి నివేదిక కనిపించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి ప్రకటన చేసి ఉంటే అది తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది. ఇలా పెట్టుబడి పెట్టమని రేవంత్ రెడ్డి కోరలేదు.
ఇక వైరల్ వీడియోను పరిశీలించగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను డిజిటల్ గా ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఇంగ్లీష్ మాట్లాడే విధానంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. హావభావాల్లో తేడాలు కూడా చూడొచ్చు.
వైరల్ పోస్టుల్లోని వీడియోలో బ్యాగ్రౌండ్ లో ఇండియా టుడే అని ఉండడం, సీఎం రేవంత్ రెడ్డి చేతిలోని మైక్రో ఫోన్ లో ఇండియా టుడే లోగో కనిపించాయి. వైరల్ వీడియోను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇండియా టుడే అప్లోడ్ చేసిన రెండు వీడియోలు మాకు కనిపించాయి.
ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, డీలిమిటేషన్, కుల గణన వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి వీడియోలో ఎక్కడా కూడా క్వాంటం ఏఐ వంటి వెబ్సైట్లలో పెట్టుబడి పెట్టమని ఆయన చెప్పలేదు. రేవంత్ రెడ్డి వాయిస్ అసహజంగా ఉంది. వైరల్ వీడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా సృష్టించారని గుర్తించాం.
ఏఐ అవునా కాదా అని తెలుసుకోడానికి మేము Hive Moderation టూల్ ను ఉపయోగించాం. 99 శాతం ఏఐ సృష్టి అని తెలిపింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.

