Sat Dec 13 2025 19:29:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీహార్ లో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు నిరసనలకు దిగారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్‌లో మరణించారు

Claim :
బీహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, బీహార్ ఫలితాల తర్వాత బీజేపీ వ్యతిరేక నిరసన చెలరేగిందని ప్రజలు రోడ్ల మీదకు వచ్చారుFact :
వైరల్ విజువల్స్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు ప్రజలు హాజరైన పాత వీడియో
2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీహార్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 20 లేదా 21 తేదీల్లో పాట్నాలో జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా NDAలోని అనేక మంది అగ్ర నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని పలు మీడియా సంస్థలు తెలిపాయి.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి 243 స్థానాలకు గాను 202 స్థానాలతో విజయం సాధించింది. భారత ఎన్నికల సంఘం తరపున ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరిగింది. బీహార్‌లో భారతీయ జనతా పార్టీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది, ఆ తర్వాత జనతా-దళ్ (యునైటెడ్) 85 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని ఆర్జేడీ నాయకుడు సునీల్ సింగ్ రాష్ట్రంలోని ఎన్నికల అధికారులను అంతకు ముందు హెచ్చరించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొన్న అధికారులందరూ ప్రజా తీర్పును తారుమారు చేయవద్దని తాను కోరినట్లు ఆర్జేడీ నాయకుడు తెలిపారు. అలా చేస్తే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో కనిపించిన విధంగా బీహార్‌లో అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. తమ పార్టీ అప్రమత్తంగా ఉందని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని అధికారులను కోరారు సింగ్.
ఈ సందర్భంలో, బీజేపీ విజయం తర్వాత బీహార్‌లో నిరసనలు చెలరేగాయనే వాదనతో భారీ జనసమూహాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఎన్నికల ఫలితాల తర్వాత బీహార్ లో బీజేపీకి వ్యతిరేకంగా భారీగా నిరసనలు చెలరేగాయేమోనని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు అందుకు సంబంధించిన ఫలితాలు ఏవీ లభించలేదు. అలాంటి ఘటనలు చోటు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీడియా ప్రస్తావించి ఉండేది.
వైరల్ క్లిప్ కు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అస్సాంలోని గౌహతిలో గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియల ఊరేగింపును చూపించే వీడియో సోషల్ మీడియాలో మాకు లభించింది. సెప్టెంబర్ 21, 2025 నాటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుండి ఫుటేజ్ ఉంది.
అందుకు సంబంధించిన వీడియోలను పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు.
ఇండియా టైమ్స్ కూడా ఊరేగింపు గురించి నివేదించింది. పలు వీడియోలలో జుబిన్ గార్గ్ మృతదేహాన్ని తీసుకువెళుతున్న వాహనం విజువల్స్ ఉన్నాయి.
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్‌లో మరణించారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్లిన జుబీన్ సెప్టెంబర్ 19న ప్రాణాలు కోల్పోయారు. యాట్ పార్టీలో భాగంగా ఈతకు వెళ్లి చనిపోయినట్లు గుర్తించారు. జుబిన్ గార్గ్ (52) అంతిమయాత్ర ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లక్షలాది మంది అభిమానులు కన్నీటి నివాళులు అర్పించిన ఈ యాత్ర లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్, క్వీన్ ఎలిజబెత్-2 వంటి ప్రముఖుల తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్న అంత్యక్రియగా ఇది నిలిచింది. గౌహతిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన జుబిన్ గార్గ్ అంత్యక్రియలకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. ఎండ, వానను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన గాయకుడి చిత్రపటాలు, కటౌట్లు చేతబూని, ఆయన ఆలపించిన గీతాలను పాడుతూ కన్నీటి వీడ్కోలు పలికారు.
జుబిన్ గార్గ్ అంతిమ యాత్రకు సంబంధించిన విజువల్స్ ను మనం చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ గౌహతిలో గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియల ఊరేగింపుకు సంబంధించినవి. బీహార్ లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కావు.
Claim : వైరల్ విజువల్స్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు ప్రజలు హాజరైన పాత వీడియో ఇది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

