Mon Mar 16 2026 12:25:52 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు చేపట్టారనే విజువల్స్ ను ఏఐ ద్వారా సృష్టించారు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు

Claim :
హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారుFact :
వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుబంధ జట్టు సన్‌రైజర్స్ లీడ్స్ ది హండ్రెడ్ 2026 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. అబ్రార్‌ను సన్‌రైజర్స్ రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. భారత ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించిన పాకిస్థాన్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ దక్కించుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా సైతం సస్పెండ్ అయింది. ది హండ్రెడ్ లీగ్‌లో తమ జట్టుకు అబ్రార్ అహ్మద్ లాంటి స్పిన్నర్ అవసరమని సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ విటోరీ తెలిపారు. అబ్రార్ అహ్మద్ వేరియేషన్స్ బాగున్నాయని అందుకే అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడ్డట్లు చెప్పారు.
'ది హండ్రెడ్'లో భారత్ కు చెందిన నాలుగు ఫ్రాంఛైజీలు- సన్‌రైజర్స్ లీడ్స్, ఎంఐ లండన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సదరన్ బ్రేవ్ ఉన్నాయి. పాకిస్తానీ ఆటగాళ్ళను తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఐపీఎల్ యజమానులకు చెందిన జట్లు దక్షిణాఫ్రికా ఎస్ఏ20, యూఏఈ ఐఎల్ టీ20 వంటి లీగ్‌లలో ఏ పాకిస్తానీ క్రికెటర్‌నూ తీసుకోలేదు. హండ్రెడ్స్ లీగ్ వేలం తొలి రౌండ్లో హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, సయిమ్ అయూబ్ వంటి ప్రముఖ పాక్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. అయితే ఊహించని విధంగా కావ్య మారన్ పాకిస్థాన్ ఆటగాడిని తీసుకోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సన్ రైజర్స్ జట్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
https://x.com/OM_Hindi/status/2032337705439514770
https://www.instagram.com/p/DV01IPUEpnZ/
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు.
ది హండ్రెడ్ వేలంలో పాకిస్తాన్ క్రికెటర్ ను సన్‌రైజర్స్ యాజమాన్యం తీసుకోవడంతో సోషల్ మీడియాలో సన్ రైజర్స్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పలు చర్చలు జరిగాయి. SRHను బహిష్కరించాలి అంటూ డిమాండ్ వినిపించాయి. సన్‌రైజర్స్ లీడ్స్ సోషల్ మీడియా X ఖాతాను కూడా నిలిపివేశారు. కొందరు క్రికెట్ ఔత్సాహికులు IPLలో SRH మ్యాచ్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఫ్రాంచైజీ, సహ-యజమాని కావ్య మారన్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు.
ఇక హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా నిరసనలు ఏవైనా చేపట్టారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ చేశాం. అయితే మాకు అందుకు సంబంధించి ఎలాంటి కథనాలు లభించలేదు.
మేము వైరల్ ఫోటోను నిశితంగా పరిశీలించాం. అందులో పలు తప్పులు ఉండడం చూడొచ్చు. చిత్రంలోని సైన్ బోర్డుపై ఇంగ్లీష్ లో ‘రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం’ అని ఉంది. అయితే తెలుగు బోర్డులో చాలా తప్పులు ఉన్నాయి. చిత్రంలోని మూలలో గూగుల్ AI అసిస్టెంట్ జెమిని లోగో కూడా ఉంది. దీన్ని బట్టి ఇది ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఫ్రంట్ గేట్ కు సంబంధించిన విజువల్స్ ను ఇక్కడ గమనించవచ్చు. వైరల్ చిత్రం లోని ఫోటో తో ఎలాంటి పోలికలు లేవు.
ఇక వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి మేము హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ను వినియోగించాం. అయితే వైరల్ విజువల్ ఏఐ ద్వారా సృష్టించారని తేల్చింది.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

