ఫ్యాక్ట్ చెక్: పొంగల్/రిపబ్లిక్ డేకి ఫోన్‌పే రూ. 5,000 మెగా గిఫ్ట్ అందించలేదు. మీ డబ్బులు కాజేయడానికి మోసగాళ్లు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ ఒకటి
ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ రాకతో ఆ సమస్య దాదాపు తీరిపోయింది

Claim :
పొంగల్/రిపబ్లిక్ డేకి ఫోన్‌పే రూ. 5,000 మెగా గిఫ్ట్ అందిస్తోందిFact :
వైరల్ అవుతున్న లింక్ మీద దయచేసి క్లిక్ చేయకండి. అందులో ఎలాంటి నిజం లేదు
మన అకౌంట్ లో నుండి డబ్బులు పంపించడం ఒకప్పుడు అయితే చాలా సమయం తీసుకునేది. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ రాకతో ఆ సమస్య దాదాపు తీరిపోయింది. ఫోన్‌పే డిజిటల్ పేమెంట్స్ యాప్‌ను 2016లో ప్రారంభించారు. మార్చి 31, 2025 నాటికి, ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ యాక్సెప్టెన్స్ నెట్‌వర్క్‌లో 61 కోట్లకిపైగా రిజిస్టర్ అయిన యూజర్లు, 4.4 కోట్లపైగా వ్యాపారులు ఉన్నారు. ఫోన్‌పే ప్రోడక్టులు, సర్వీసులలో కన్స్యూమర్ పేమెంట్లు, మర్చంట్ పేమెంట్లు, లెండింగ్, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసులు, న్యూ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మర్చంట్ ఎకోసిస్టమ్‌ను మరింత శక్తిమంతం చేయడం కోసం, మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్‌స్పీకర్, స్మార్ట్పాడ్లను ఫోన్‌పే ప్రవేశపెట్టింది. SIDBIతో ఫోన్‌పే కుదుర్చుకున్న భాగస్వామ్యంలో భాగంగా తీసుకొచ్చిన ఉద్యమ్ అసిస్ట్ అనే కార్యక్రమంతో, వారి అధికారిక క్రెడిట్ యాక్సెస్‌ను క్రమబద్ధీకరిస్తూ, MSMEలకు డిజిటల్-ఫస్ట్ ఇంటిగ్రేషన్‌ను మొదటగా అందించిన సంస్థలలో ఒక కంపెనీగా నిలిచింది. వీటికి తోడు, భారతదేశంలో ఆర్థిక భద్రత లేని ప్రజల కోసం హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా సంక్రాంతి సందర్భంగా ఫోన్ పే 5000 రూపాయలు ఇస్తోందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో ఓ లింక్ ను వైరల్ చేస్తున్నారు.
అయితే ఇది మొదటి నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు 5000 రూపాయలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించి చూడండి అంటూ కొందరు ఆ లింకును వివిధ వాట్సప్ గ్రూపుల ద్వారా షేర్ చేస్తున్నారు.
వైరల్ లింక్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇలాంటి ఆఫర్ ను ఏదైనా ఫోన్ పే ప్రవేశపెట్టి ఉంటే ఆ విషయాన్ని యాప్, వెబ్ సైట్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫోన్ పే సంస్థ స్పష్టం చేసి ఉండేది. మేము వీటిని పరిశీలించాం.. ఎక్కడా కూడా 5000 రూపాయలను వినియోగదారులకు అందించే ప్రకటన కనిపించలేదు.
https://www.phonepe.com/press/
https://www.instagram.com/
ఇక సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా 18 జనవరి, 2026న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలను ఇలాంటి ఆఫర్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కీలక సూచన చేశారు.
“₹5,000 ఉచితం” అంటూ వచ్చే సైబర్ మోసాల పట్ల జాగ్రత్త!
సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేయడానికి కొత్త ఉపాయాలతో వస్తున్నారు. ప్రస్తుతం, “PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్” “సంక్రాంతి గిఫ్ట్” వంటి సందేశాలతో అనేక నకిలీ లింక్‌లు WhatsAppలో విస్తృతంగా వ్యాపించాయి. ఈ లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా వారికి ₹5,000 ఉచితంగా లభిస్తుందని సైబర్ మోసగాళ్ళు వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
“మొదట నేను ఇది నకిలీ అని అనుకున్నాను, కానీ నాకు నిజంగా ₹5,000 వచ్చింది! మీరు కూడా దీన్ని ప్రయత్నించాలి” అని సందేశాలు షేర్ చేస్తున్నారు, అలాగే ఒక లింక్ కూడా ఉంది. ప్రజలను ట్రాప్ చేయడానికి నేరస్థులు ఉపయోగించే ఉపాయం మాత్రమే. మీకు తెలిసిన పరిచయాలు లేదా WhatsApp సమూహాల నుండి అలాంటి సందేశాలు వస్తే, ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ సందేశాల చివర ఉన్న లింక్‌లపై నిశితంగా గమనించండి. అవి సాధారణంగా fdgc.lusvv.xyz లేదా iom.qmtyw.xyz వంటి వాటిని కలిగి ఉంటాయి. ఇవి అధికారిక PhonePe లింక్‌లు కాదని అర్థం చేసుకోండి. మీరు అలాంటి లింక్‌లను ప్రలోభాలకు గురై క్లిక్ చేస్తే, ప్రమాదకరమైన మాల్వేర్ మీ ఫోన్లోకి ప్రవేశించవచ్చు. దీని వలన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పిన్లు, పాస్‌వర్డ్‌ల దొంగతనం జరుగుతుంది. మీ బ్యాంక్ ఖాతా నిమిషాల్లో ఖాళీ అవుతుంది. PhonePe, Google Pay లేదా ఏదైనా ఇతర కంపెనీ WhatsApp లింక్‌ల ద్వారా డబ్బును పంపిణీ చేయవు. ఏదైనా నిజమైన ఆఫర్ వారి అధికారిక యాప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎవరైనా అనుకోకుండా అలాంటి లింక్‌పై క్లిక్ చేసి డబ్బు పోగొట్టుకుంటే, వారు వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి." అంటూ సూచించారు.
ఇక మా టీమ్ వైరల్ లింక్ ఓపెన్ చేసి చూడగా, 404 ఎర్రర్, మరికొందరికి ఆ మెసేజ్ ను 5 గ్రూపులు లేదా 15 మందికి వాట్సప్ ద్వారా షేర్ చేయాలని చూపిస్తోంది. అలా షేర్ చేసిన మెసేజ్ లో "మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ.. నిజంగా నాకు రూ.50,000 వచ్చింది. మీరు కూడా ప్రయత్నించి చూడండి." అని లింక్ వస్తోంది. కాబట్టి ఇలాంటి లింక్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని మేము కోరుతున్నాం.
మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్స్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ లింక్ ద్వారా మీ బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీ సేకరించి, మీ అకౌంట్లో ఉన్న డబ్బును క్షణాల్లో కాజేస్తారు.
ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా ధృవీకరిస్తూ కథనాలను ప్రచారం చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

