Fri Dec 05 2025 09:36:27 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సమోసా, జిలేబీలు ఆరోగ్యానికి హానికరం అనే లేబుల్ ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదు
సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే వివరాలను వినియోగదారులకు తెలిసేలా అమ్మకందారుల

Claim :
సమోసా, జిలేబీలు ఆరోగ్యానికి హానికరం అనే లేబుల్ ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలుFact :
అలాంటి నిర్ణయం ఏదీ కేంద్రం తీసుకోలేదు
భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో సమోసా, జిలేబీ మొదటి వరుసలో ఉంటాయి. సమోసాలు, జిలేబీలు ఇప్పటికీ ఎన్నో కార్యాలయాలు, ఇతర సంస్థలలో స్నాక్స్ ఐటమ్స్ లిస్టులో ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరం అంటూ నమ్మేవాళ్లు ఎక్కువగానే ఉన్నారు.
అయితే సిగరెట్, మందు తరహా ఈ ఆహార పదార్థాల విషయంలో వార్నింగ్ సైన్ తప్పకుండా ఉండాలని కేంద్రం తెలిపిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "సిగరెట్, మందుపై మాత్రమే కాదు సమోసా, జిలేబీ విషయంలో కూడా హెచ్చరికలు తప్పవు. హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు కూడా వచ్చేశాయి. ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ ఆహార పదార్థాలపై కూడా హెచ్చరిక సందేశాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది." అంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించి స్థూలకాయం, పలు వ్యాధులను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, సమోసాలు, జిలేబీలు మాదిరిగా డీప్‌ఫ్రై చేసే ఇతర స్నాక్స్‌పై కూడా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిందని పోస్టుల్లో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఈ జిలేబీలు, సమోసాలు ఉన్నచోట తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం చెబుతోంది. ఆ ఆరోగ్య హెచ్చరికలో ఆహారాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతాన్ని తెలియజేయనున్నారని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు తెలిపాయి.
పలు పత్రికల్లో కూడా ఈ కథనాలు వచ్చాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం వైరల్ అవుతున్న వాదనను ఖండిస్తూ పోస్టు పెట్టింది. సమోసా, జిలేబీ, లడ్డూ వంటి ఆహార ఉత్పత్తులపై హెచ్చరిక లేబుల్‌లను జారీ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆదేశించిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయని, వీటిలో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చింది.
దీన్ని క్యూగా తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదంటూ కథనాలను ప్రచురించాయి. సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే వివరాలను వినియోగదారులకు తెలిసేలా అమ్మకందారుల ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సిగరెట్ పెట్టెలపై ఉన్నట్లుగా హెచ్చరికలు ఉంచాలని కేంద్రం నిర్ణయించిందనడంలో వాస్తవం లేదని తేలింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. బహిరంగంగా విక్రయించే ఆహార ఉత్పత్తుల్లోని చక్కెర, నూనె శాతాలను పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు పెట్టాలని నిర్దేశించలేదని, అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ వంటకాల పేర్లను ప్రస్తావించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
సమోసాలు, జిలేబీలు వంటి ప్రసిద్ధ భారతీయ స్నాక్స్‌లకు ఎటువంటి హెచ్చరిక లేబుల్‌లను జారీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. వీధి వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలను లేబుల్ చేయడానికి లేదా లక్ష్యంగా చేసుకోవడానికి ఎటువంటి చర్య లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బదులుగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక సాధారణ ఆరోగ్య సలహాను జారీ చేసింది. ఇదే విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రస్తావించింది.
అందుకు సంబంధించిన ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఈ ప్రయత్నం ప్రజలు మెరుగైన ఆహార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి ఒక ప్రయత్నంగా ఉద్దేశించినట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దిష్ట ఆహార పదార్థాలపై దృష్టి పెట్టడం లేదు, కానీ మొత్తం మీద ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం గురించి మాత్రమే కేంద్రం ఆలోచిస్తోంది.
ఆహారం గురించి సందేశాలతో పాటు, మెట్లు ఉపయోగించడం, నడక కోసం సమయం కేటాయించడం, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన భోజన ఎంపికలను ఎంచుకోవడం వంటి సలహాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
కాబట్టి, సమోసా, జిలేబీలు ఆరోగ్యానికి హానికరం అనే లేబుల్ ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయలేదు.
Claim : అలాంటి నిర్ణయం ఏదీ కేంద్రం తీసుకోలేదు
Claimed By : Social Media Users, Media Outlets
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

