Tue Apr 22 2025 06:41:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ లో మార్పు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ లో మార్పు

Claim :
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ లో మార్పు చేశారుFact :
ఎలాంటి మార్పు చేయలేదని IRCTC తెలిపింది
భారతీయ రైల్వేలు రోజూ లక్షల మందిని తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నాయి. ముందుగా ప్రయాణం చేయాలనుకున్న వాళ్లు కొన్ని రోజులు, వారాల ముందు టికెట్లను బుక్ చేసుకుంటారు. మరికొందరు తత్కాల్ టికెట్లపై ఆధారపడుతూ ఉంటారు. బుకింగ్ చేసుకునే విధానాన్ని బట్టి టికెట్ల ధరలు ఉంటాయి. ఇక సీనియర్ సిటిజన్లకు ఛార్జీల రాయితీలను నిలిపివేయడం ద్వారా భారత రైల్వేలు గత ఐదు సంవత్సరాలలో దాదాపు రూ.8,913 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాయని, సమాచార హక్కు (RTI) దరఖాస్తుకు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) సమాధానం ఇచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న CRIS, టికెటింగ్ వ్యవస్థలను నిర్వహించడం, ప్రయాణీకుల డేటాను నిర్వహించడం, అనేక ఇతర సేవలను అందిస్తూ ఉంటుంది.
అయితే కొత్తగా తత్కాల్ టైమింగ్స్ మారాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏప్రిల్ 15 నుండి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలతో భారత రైల్వే తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలను సవరించిందని సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఏప్రిల్ 15 నుండి కొత్త తత్కాల్ బుకింగ్ సమయాలు అమలు చేస్తారని సూచించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని భారతీయ రైల్వే తెలిపింది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా వైరల్ అవుతున్న పోస్టులను ఖండిస్తూ IRCTC చేసిన ట్వీట్ ను గుర్తించాం.
AC, నాన్-AC తరగతులకు, ఏజెంట్లకు తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం మార్చారంటూ సోషల్ మీడియాలో అనేక తప్పుదారి పట్టించే పోస్ట్ల నేపథ్యంలో ఈ వివరణ ఇస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల కోసం వేర్వేరు సమయాల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియా ఛానెల్లలో కొన్ని పోస్ట్లు ప్రసారం అవుతున్నాయని IRCTC ఒక ప్రకటనలో తెలిపింది. "AC లేదా నాన్-AC తరగతులకు తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయాలలో ప్రస్తుతం అలాంటి మార్పు ఏదీ ప్రతిపాదించలేదని, ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్ సమయాలు కూడా మారవు." అని IRCTC తెలిపింది.
PIB Fact Check బృందం కూడా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ నిజ నిర్ధారణ చేసింది. ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ సమయాలు మారుతాయని సోషల్ మీడియాలో ఒక చిత్రం విస్తృతంగా ప్రచారం అవుతోందని, ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. AC లేదా నాన్-AC తరగతులకు సంబంధించిన తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయాల్లో ప్రస్తుతం అలాంటి మార్పు ప్రతిపాదించలేదని, ఏజెంట్ల కోసం అనుమతించబడిన బుకింగ్ సమయాలు కూడా మారవని తెలిపింది.
మా తదుపరి పరిశోధనలో పలు మీడియా కథనాల్లో వైరల్ పోస్టులను ఖండిస్తున్న నివేదికలు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించే వాదనలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారికంగా తోసిపుచ్చిందని ఈ కథనాలు తెలిపాయి. ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో, ప్రస్తుత టికెట్ బుకింగ్ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని IRCTC ధృవీకరించింది, ఏప్రిల్ 15 నుండి కొత్త సమయాలు అమల్లోకి వస్తాయని సూచించిన వైరల్ నివేదికలను IRCTC తోసిపుచ్చిందని ఈ మీడియా కథనాలు తెలిపాయి.
కాబట్టి, ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ లో మార్పు చేసిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఎలాంటి మార్పు చేయలేదని IRCTC తెలిపింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story