Mon Mar 23 2026 10:26:36 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఉచితంగా ప్రధానమంత్రి వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
ఉచితంగా ప్రధానమంత్రి వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉన్నారనే వాదనలో

Claim :
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉందిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
2025-26లో భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కింద అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఉద్యోగ కల్పన కోసం పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన, గిగ్ వర్కర్స్ స్కీమ్‌తో పాటు, ఎంజీఎన్ఆర్ఈజీఏ హామీతో కూడిన పనిని 125 రోజులకు పెంచే ముఖ్యమైన గ్రామీణ సంస్కరణలను కూడా ప్రారంభించింది. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, కార్పొరేట్ మిత్ర తదితర వినూత్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్లే ఉద్దేశ్యంతో తీసుకుని వచ్చారు.
ఇలాంటి పథకాలకు ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆసక్తి చూపుతూ ఉండగా ఉచితంగా పలు వస్తువులు ఇస్తున్నారనే వాదనతో కొన్ని పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలకు ఉచితంగా వాషింగ్ మెషీన్లను ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారంటూ కొన్ని పోస్టులు వాట్సాప్ లో వైరల్ అవుతూ ఉన్నాయి.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టులు నిజం కాదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. అలాంటి ప్రకటన ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేసి ఉండి ఉంటే అది తప్పకుండా మీడియాలో ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు. కాబట్టి అలాంటి కథనాలు ఏవీ మాకు లభించలేదు.
మా తదుపరి పరిశోధనలో PIB Fact Check సంస్థ వైరల్ పోస్టులలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ‘techayasfacts’ అనే ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియో కల్పితమైనది, మోసపూరితమైనదిగా గుర్తించినట్లుగా వివరించారు. అలాంటి సంక్షేమ పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకున్న ఆసక్తిని వాడుకోవడం కోసం ఇటువంటి తప్పుడు సమాచారాన్ని చూసి మోసపోవద్దని ఫ్యాక్ట్-చెక్ విభాగం ప్రజలను హెచ్చరించింది. అసలు ఉనికిలో లేని ప్రభుత్వ ప్రయోజనం ఉందని వీక్షకులను నమ్మించి తప్పుదోవ పట్టించేందుకు, ఈ వీడియోలో కల్పిత దరఖాస్తు లింకులు ఉన్నాయి. అలాంటి వాటిని క్లిక్ చేయొద్దని మోసగాళ్ల చేతిలోకి మీ కీలకమైన డేటాను పంపించొద్దని అందులో కోరారు.
2024, 2025 మధ్య కాలంలో కూడా ఇలాంటి మోసాలు పదేపదే వెలుగులోకి వచ్చాయని అధికారులు గుర్తించారు. మోసగాళ్లు తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రజలను మోసం చేయడానికి మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు తీసుకుని వచ్చి మోసం చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఆర్థిక, వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి దారితీస్తాయి.
ఖచ్చితమైన సమాచారం కోసం ధృవీకరించిన ప్రభుత్వ వేదికలపై మాత్రమే ఆధారపడండి. ఇంకా మీకు అనుమానాస్పద కంటెంట్ కనిపిస్తే, ఆ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి వెంటనే అధికారులను సంప్రదించండి. డిజిటల్ యుగంలో ఆన్లైన్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన సూచిస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉందనే వాదన నిజం కాదు.
Claim : కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉంది వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

