Tue Feb 24 2026 15:50:30 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: సీఎం రేవంత్ రెడ్డి పాలన కారణంగా ఓటమి పాలయ్యామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పలేదు
వైరల్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు

Claim :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వల్లే రెండు మున్సిపాలిటీ సీట్లు కోల్పోయామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారుFact :
వైరల్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు
మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ఇటీవల ముగిశాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1,349 వార్డులను కైవసం చేసుకుని 74 మున్సిపాలిటీలలో ఆధిపత్యం చాటింది. ఇక బీఆర్ఎస్ 718 వార్డుల్లో గెలిచి 17 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థులు 260 వార్డుల్లో విజయం సాధించారు. మిగిలిన 25 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఏర్పడింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నమ్మకాన్ని కల్పించామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత ముందుకెళ్లాలని, సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.
అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"బ్రేకింగ్ న్యూస్
మా ముఖ్యమంత్రి పాలన వల్లే నా నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీ సీట్లు కోల్పోయాం
ప్రభుత్వ పనితీరుపై స్వంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసంతృప్తి…" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ క్లెయిమ్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుసుకున్నాం. అదే కానీ జరిగి ఉంటే తప్పకుండా మీడియా నివేదించి ఉండేది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ ను పలు మీడియా సంస్థలు లైవ్ టెలికాస్ట్ చేశాయి. అందులో ఎక్కడా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమని చెప్పలేదని ధృవీకరించాం.
ఇక వైరల్ అవుతున్న పోస్టులను ఖండిస్తూ తెలంగాణ అధికారిక ఫ్యాక్ట్ చెక్ టీమ్ వివరణ కూడా ఇచ్చింది. "భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్‌ను, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించేలా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. ఈ వీడియోను కావాలని మధ్యలో కట్ చేసి, ముందు వెనుక సందర్భం లేకుండా ఎడిట్ చేశారు. దీనివల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు తప్పుడు అర్థం వచ్చేలా తయారు చేశారు." అంటూ వివరించింది. ఆ ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న క్లిప్ అసంపూర్ణమైనది. కీలకమైన చోట వాక్యాన్ని కట్ చేసి ఎడిట్ చేశారు. పూర్తి ప్రసంగం పార్టీ అంతర్గత సంస్థాగత సమీక్ష గురించి ఉంది. ప్రచారంలో ఉన్న వెర్షన్లో అసలు సందర్భాన్ని తొలగించారని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
Claim : వైరల్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

