Tue Feb 17 2026 12:49:41 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: రేబీస్ కారణంగా కుక్కలా ప్రవర్తించిన యువకుడు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
రేబీస్ కారణంగా కుక్కలా ప్రవర్తించిన యువకుడు అంటూ

Claim :
రేబీస్ కారణంగా కుక్కలా ప్రవర్తించిన యువకుడుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
రేబీస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. జంతువుల కాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. రేబిస్ బారిన పడే వారిలో ఎక్కువ మంది కుక్కకాటుకు గురైన వారే ఉంటారు. కుక్క కాటుకు గురైన వెంటనే వ్యాక్సిన్లు వేయించుకోవాల్సి ఉంటుంది. కుక్కల కాటు ద్వారా రేబిస్ సంక్రమించే సందర్భాలు అత్యధికం. పెంపుడు మరియు వీధి కుక్కలు రేబిస్ వైరస్ను వ్యాప్తి చేయగలవు.
2024 లెక్కల ప్రకారం దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అందులో 54 మంది రేబిస్ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్త రేబిస్ మరణాల్లో 36 శాతం వాటా ఒక్క భారతదేశానిదే. కుక్క కరిచిన 24 గంటలలోపు డాక్టర్ను కలిసి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది సాధారణంగా 0, 3, 7, 14, 28 రోజులలో 5 డోసులుగా ఇస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే 'రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్' ఇంజెక్షన్ నేరుగా గాయం వద్ద ఇస్తారు.
అయితే కుక్క కరవడం వలన ఓ యువకుడు వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"మహారాష్ట్రలోని సాతారా-రహిమత్పూర్ రహదారిపై ఉన్న అంగాపూర్ ఫాటా (Angapur Phata) వద్ద ఒక యువకుడు కుక్కలా ప్రవర్తిస్తూ కలకలం సృష్టించాడు. ఆ వ్యక్తి రెండు చేతులు, మోకాళ్లపై నడుస్తూ, నాలుక బయటపెట్టి కుక్కలా ప్రవర్తించాడు, అలాగే వాహనాలపైకి దూకాడు. ఈ వింత ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది, దీనివల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో వ్యక్తి రేబిస్ వ్యాధి బాధితుడు కాదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించిన పలు రిపోర్టులు లభించాయి. 2025 డిసెంబర్ నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
సతారా కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వైరల్ వీడియోలో, కొంతమంది వ్యక్తులు తారు రోడ్డుపై వల వేసి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడొచ్చు. వారు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి బైక్ వెనుక దాక్కుని నాలుగు కాళ్లపై నడుస్తున్న జంతువులా తనను తాను రక్షించుకుంటున్నట్లు కనిపిస్తుంది.
అంగాపూర్ ఫాటా సమీపంలోని రోడ్డుపై జరిగిన ఈ నాటకమంతా కుక్క కరవడం వలన చోటు చేసుకుంది కాదని పలు మీడియా నివేదికలు తెలిపాయి. సదరు వ్యక్తి ఓ మానసిక రోగి. అయితే కుక్క కరిచింది కాబట్టి అతను ఇలా ప్రవర్తిస్తున్నాడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పలు మీడియా సంస్థల నివేదికలు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైద్యుడు ఈ ఘటనపై మాట్లాడిన లింక్ కూడా ఇక్కడ ఉంది. సదరు వ్యక్తి అలా ప్రవర్తించడం వెనుక కుక్క కాటు లేదు.
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత, అతన్ని వెంటనే చికిత్స కోసం సతారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలోని వైద్య అధికారులు పరీక్షించిన తర్వాత, సంబంధిత యువకుడికి రేబిస్ లేదని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని స్పష్టం చేశారు. వైద్యుల ప్రాథమిక పరీక్షలో అతనికి తీవ్రమైన మానసిక అస్థిరత లక్షణాలు ఉన్నాయని తేలింది.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి రేబిస్ బాధితుడు కాదు.
Claim : రేబీస్ కారణంగా కుక్కలా ప్రవర్తించిన యువకుడు
Claimed By : Social Media Users and Media Outlets
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media, Media Outlets
Fact Check : False
Next Story

