Wed Jan 28 2026 00:11:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనను ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె ఘటనగా ప్రచారం చేస్తున్నారు
కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనను ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె

Claim :
మదనపల్లెలో మహిళా కండక్టర్ పైన దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలుFact :
ఇది కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన
తెలుగు రాష్ట్రాల్లోనూ, కర్ణాటక లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకుని వచ్చారు. ఈ సమయంలో మహిళల మధ్య గొడవలు, ప్యాసెంజర్లతో డ్రైవర్లు, కండక్టర్లకు గొడవలు సర్వ సాధారణమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులలో మహిళల భద్రతకు భరోసా కల్పిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. మహిళలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు పాకెట్ కెమెరాలను అమరుస్తామన్నారు. దీని ద్వారా పూర్తి భద్రతతో మహిళలు ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వీలు కలుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే ఫుట్ బోర్డు మీద నిలబడి ఉన్న మహిళా కండక్టర్ పై ఓ వ్యక్తి చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బస్సు బయట నుండి వచ్చిన వ్యక్తి ఆ మహిళ మీద చేయి చేసుకోవడం వీడియోలో రికార్డు అయ్యింది. ఆమె ఏడుస్తూ అతడిని కొట్టడానికి ప్రయత్నించడం మనం చూడొచ్చు.
మహిళా కండక్టర్ పై దాడి చేసింది వైసీపీ నేతలు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా, మరికొందరు జనసేన నేత మహిళా కండక్టర్ పై చేయి చేసుకున్నారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు.
"మదనపల్లె లో మహిళా కండక్టర్ పైన దాడి చేసిన స్థానిక జనసేన లీడర్" అంటూ పోస్టు పెట్టారు.
"మదనపల్లిలో మహిళా కండక్టర్ పై దాడి చేసిన స్థానిక వైసీపీ నాయకుడు !!!
#YcpCriminalPolitics
#tillutrolls" అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నది కాదు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటన.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా ఎలాంటి నివేదికలు లభించలేదు.
వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్స్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లాలో చోటు చేసుకుందని పలు కన్నడ మీడియా సంస్థలు తెలిపాయి.
విద్యార్థులను బస్సు నుంచి బలవంతంగా దింపారనే ఆరోపణలపై ఒక మహిళా కండక్టర్‌పై దాడి చేసిన సంఘటన గదగ్ లో నమోదైంది. KSRTC మహిళా కండక్టర్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులు దాడి చేసిన సంఘటన గడగ్-ముండరగ్గి రోడ్డులోని పాపనాషి టోల్ ప్లాజా సమీపంలో జరిగింది. మహిళా బస్సు కండక్టర్ విద్యార్థినులను వారి బస్సు నుంచి దించేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు బస్సును ఆపి మహిళా కండక్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు. గడగ్ ట్రాన్స్పోర్ట్ యూనిట్‌కు చెందిన NWKRTC బస్సు (KA-26-F-852) గడగ్ నగరం నుండి కదంపూర్ మీదుగా శింగతరాయణకేరి గ్రామానికి ప్రయాణిస్తోంది. పాపనాషి టోల్ సమీపంలో విద్యార్థినులు చెప్పిన ప్రాంతంలో బస్సు ఆపడానికి అధికారిక అనుమతి లేకపోవడంతో, మహిళా కండక్టర్ విద్యార్థులను కొంచెం ముందే దింపేసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు బస్సును వెంబడించి పాపనాషి టోల్ బూత్ దగ్గర ఆపారు. ఆ తర్వాత బస్సులోని మహిళా కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, మహిళా కండక్టర్ గడగ్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటన తర్వాత మాట్లాడుతూ, కండక్టర్లను తరచుగా అన్యాయంగా నిందిస్తారని మహిళా కండక్టర్ తెలిపారు. ఆపడానికి అనుమతి లేని ప్రదేశాలలో బస్సును నిలిపితే, తనిఖీ సిబ్బంది కండక్టర్‌ను సస్పెండ్ చేసి వెంటనే కేసు నమోదు చేస్తారని ఆమె చెప్పినట్లు కన్నడ ప్రభ నివేదించింది. కండక్టర్లు నియమాలను మాత్రమే పాటిస్తున్నారని, వారి విధిని నిర్వర్తించినందుకు వారిపై దాడి చేయకూడదని ఆమె అన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన అంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక అన్నమయ్య జిల్లా పోలీసులు వైరల్ అవుతున్న వాదనను ఖండిస్తూ వివరణ ఇచ్చారు.
"వైరల్ వీడియోపై స్పష్టత:
ఈ ఘటన మదనపల్లి పట్టణంలో జరిగినది కాదు.
ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లా,
పాపనాషి సమీపంలో జరిగింది.
సోషల్ మీడియాలో
మదనపల్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు." అంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో చోటు చేసుకున్న ఘటన కాదు. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన.
Claim : కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనను ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

