ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ పార్లమెంట్ లో గాడిద ప్రవేశించింది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
పాకిస్థాన్ పార్లమెంట్ లో గాడిద ప్రవేశించింది అంటూ ప్రచారం

Claim :
పాకిస్థాన్ పార్లమెంట్ లోకి గాడిద ప్రవేశించిందిFact :
వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
నవంబర్ నెలలో పాకిస్థాన్ పార్లమెంట్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ పార్లమెంట్ తన రాజ్యాంగంలో వివాదాస్పద సవరణను ఆమోదించింది. ఆర్మీ చీఫ్ అధికారాలను మరింత విస్తరించింది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది. దీనికోసం రాజ్యాంగ సవరణను చేపట్టారు. ఈ మేరకు 27వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సెనెట్‌లో ప్రవేశపెట్టింది. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను ఐదేళ్ల కాలానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)గా ఏకకాలంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా నియమిస్తూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ సీడీఎఫ్ పదవి పాక్ త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌పై అధికారాన్ని కల్పిస్తుంది.
పాకిస్తాన్ పార్లమెంటులో గాడిద హల్చల్..
ఎంపీల కుర్చీలు, డెస్క్ లపైకి దూసుకెళ్లిన గాడిద
గాడిద హంగామాతో ఒక్కసారిగా హడలిపోయిన పాక్ ఎంపీలు... అంటూ తెలుగులో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఆర్కైవ్ చేసిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
https://www.instagram.com/
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్ పార్లమెంట్ లో అలాంటి ఘటన ఏదైనా చోటు చేసుకుందా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. కానీ మాకు పాక్ మీడియాలో వచ్చిన కథనాలు, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు లభించలేదు.
వైరల్ క్లిప్‌లో, మంత్రులు భద్రత కోసం పరిగెడుతూ ఉండగా, మరికొందరు గాడిద ఆకస్మికంగా ప్రవేశించడంతో గందరగోళానికి గురైనట్లు కనిపిస్తుంది. ఆ జంతువు టేబుళ్లపైకి దూకడం, ఫైళ్లను చెల్లాచెదురు చేయడం, దానిని ఆపడానికి భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు కనిపిస్తాయి. ఆ గాడిద ఏమాత్రం భయపడకుండా చాంబర్ గుండా తిరుగుతూనే ఉంది, కొంతమంది ఎంపీలను కూడా ఢీకొట్టింది. అయితే ఈ వీడియోలో పలు తప్పులను మేము గమనించాం.
మొదట ఆ గాడిద కాళ్లలో తేడాలు కనిపించాయి, పడిపోయిన ఎంపీల ముఖాలు కూడా స్పష్టంగా లేవు. వీడియో నిడివి కూడా అతి తక్కువగా ఉండడంతో ఇది ఏఐ సృష్టి అనే అనుమానాలను కలిగించింది.
వైరల్ వీడియో కింద పలువురు AI అంటూ కూడా కామెంట్లు చేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా arabianspeed1 అనే టిక్ టాక్ అకౌంట్ లో వైరల్ వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియో వివరణలో AI జెనెరేటెడ్ వీడియో అని ఉండడం మేము గమనించాం.
ఇక వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోవడం కోసం మేము హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ను కూడా వాడాము. వైరల్ వీడియో లోని కంటెంట్ ఏఐ సృష్టి అంటూ సంబంధిత రిజల్ట్స్ తెలియజేశాయి.
ఇక వైరల్ వీడియోను పోస్టు చేసిన అకౌంట్ లో పలు దేశాల చట్ట సభల్లో సింహాలు, గుర్రాలు లాంటి జంతువులు ప్రవేశించినట్లుగా వీడియోలను పోస్టు చేసి అప్లోడ్ చేశారు. ఇవన్నీ ఏఐ సృష్టి అని కంటెంట్ సృష్టికర్త స్పష్టంగా తెలిపారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

