Sat Dec 13 2025 19:24:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరైతే 50 మార్కులు విద్యార్థులకు ఇవ్వడం లేదు
ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని

Claim :
ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని తెలిపారుFact :
అలాంటి ప్రకటన ఏదీ యూనివర్సిటీ అధికారులు చేయలేదు
ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెహ్రాడూన్‌లో జరిగిన రజతోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి పథాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో ₹8,140 కోట్లకు పైగా విలువైన బహుళ మౌలిక సదుపాయాలు, సంక్షేమ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఆయన కొనియాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో సాకారం అయిన ఉత్తరాఖండ్ సృష్టి కోసం అవిశ్రాంతంగా పోరాడిన ప్రజల ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నవంబర్ 9న ప్రధానమంత్రి మోదీ చారిత్రక దినంగా అభివర్ణించారు. గత 25 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని స్థిరమైన, సమగ్రాభివృద్ధికి ఒక నమూనాగా మార్చారని ఆయన అన్నారు.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యే విద్యార్థులకు 50 మార్కులు ఇస్తారనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
"ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీలో ఓ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ సభకు విద్యార్ధులు వస్తారో, రారో అని సదరు యూనివర్సిటీకి బెంగ పట్టుకున్నట్లుంది. దీంతో యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామంటూ ఆఫర్ చేశారు.యూనివర్శిటీలో మిగతా కోర్సులు చదివే విద్యార్ధులు కూడా ఉన్నా బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం, బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకే అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు." అంటూ కొన్ని మీడియా కథనాలు తెలిపాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భావ రజతోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అదనంగా 50 మార్కులు ఇస్తున్నట్లుగా పేర్కొన్న ఒక నోటీస్ వైరల్ అయింది. ఇది నిజమేనని నమ్మి కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
న్యాయవాది, కార్యకర్త ప్రశాంత్ భూషణ్ Xలో దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం (DBUU) డెహ్రాడూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీకి హాజరైన విద్యార్థులకు 50 ఇంటర్నల్ మార్కులను కేటాయిస్తుందని పేర్కొన్న ఒక నోటీసును పంచుకున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ పోస్టుల్లోని నోటీసును నిశితంగా పరిశీలిస్తే అనేక తప్పులు అందులో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ నోటీసులో ఎలాంటి తేదీ కూడా లేదు. సాధారణంగా విశ్వవిద్యాలయాలకు, కాలేజీలకు జారీ చేసే సర్క్యులర్లలో తేదీ అన్నది ఉంటుంది. వైరల్ నోటీసులు కనీసం ఎవరు అధికారికంగా ఈ ప్రకటన చేశారో అని తెలుసుకోడానికి అందులో ఎలాంటి సంతకం, స్టాంప్ లేదా సీల్ లేకపోవడంతో అది నకిలీదని స్పష్టంగా తెలుస్తోంది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పలు మీడియా సంస్థల కథనాలు మాకు లభించాయి.
ఇండియా టుడే, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి ప్రముఖ మీడియా సంస్థలు వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ కథనాలను ప్రచురించాయి.
ఈ వైరల్ పోస్టులపై భారత ప్రభుత్వ అధికారిక వాస్తవ తనిఖీ సంస్థ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వైరల్ నోటీసును నకిలీదని స్పష్టం చేసింది.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు తప్పనిసరి అని, హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు ఇస్తారని పేర్కొంటూ దేవభూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం జారీ చేసినట్లుగా చెప్పబడుతున్న ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖ నకిలీ విశ్వవిద్యాలయం అటువంటి ఉత్తర్వును జారీ చేయలేదు" అని తేల్చి చెప్పింది.
ఈ నోటీసు నకిలీది, తప్పుదారి పట్టించేది అని యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఉన్నత విద్యా శాఖకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయం తన వివరణలో, నోటీసులో సరైన ప్రామాణికత లేదని పేర్కొంది. అధికారిక లెటర్‌హెడ్, రిఫరెన్స్ నంబర్ లేదా సంతకం అందులో లేదని తెలుస్తోంది, "విశ్వవిద్యాలయం అటువంటి నోటీసు ఏదీ విడుదల చేయలేదు" అని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. "ఇటువంటి మోసపూరిత సమాచారాన్ని నమ్మవద్దని, ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా విశ్వవిద్యాలయ అధికారులను, పరిపాలనా యంత్రాంగాన్ని సంప్రదించాలని విద్యార్థులు, సంరక్షకులు, సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము." అని తెలిపారు.
అందుకు సంబంధించిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
ఫేక్ లెటర్ పై యూనివర్సిటీ ఇచ్చిన వివరణను కూడా చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Next Story

