Sat Jul 12 2025 13:41:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: శ్రీకాకుళంలో భూమి మీదకి రాలిన మేఘాలు అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
శ్రీకాకుళంలో భూమి మీదకి రాలిన మేఘాలు

Claim :
శ్రీకాకుళంలో భూమి మీదకి రాలిన మేఘాలుFact :
పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు నీటితో కలవడం వల్ల ఇలాంటి నురుగు ఏర్పడుతుంది
రుతుపవనాలు జూన్ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నా ఆశించిన వర్షపాతం నమోదవ్వడం లేదు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు కారణమవ్వనుంది.
ఉత్తర బంగాళాఖాతంలో, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో జూన్ 29 నాటికి మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని సూచించింది.
ఉత్తర దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 30 వరకు ఈ ప్రాంతాలను గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఇంతలో మేఘం లాంటి ఆకారం భూమి మీద పడిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతూ ఉంది. పొలంలో పిల్లలు దాన్ని తాకుతూ ఉండడం కూడా మనం చూడవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో మేఘాలు కిందకు పడ్డాయని అందులో తెలిపారు. ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
పలు సోషల్ మీడియా ఖాతాదారులు ఈ వీడియోను మేఘాలు అంటూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేఘాలు కిందకు పడవని సైన్స్ చెబుతుంది. మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి పైన ఉన్న మేఘాలు ఎందుకు పడవు అని ఆలోచించారా? అవి ఎప్పటికీ కిందకు పడవు. గాలిలోని నీటి అణువులు కలిసి చిన్న బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా ఏర్పడినప్పుడు మేఘాలు పుడతాయి. ఈ ప్రక్రియను సంగ్రహణ చర్య అంటారు. ఆవిరితో కూడిన వెచ్చని గాలి పైకి లేచినప్పుడు, అది చల్లబరుస్తుంది. అప్పుడు దానిలో నిల్వ చేయబడిన నీరు ఘనీభవించడం ప్రారంభిస్తుంది. ఇక మేఘంలోని ద్రవం చాలా చిన్న నీటి బిందువుల తరహాలో ఉంటుంది. వేడి, భూమి మీద ఉన్న గాలి కారణంగా ఆ నీటి బిందువులు కూడా చాలా చిన్నదైపోతాయి. అలా మేఘం మొత్తం నీటి రూపంలో కిందకు పడిపోతుంది. అంతే తప్ప మేఘం కిందకు పడే అవకాశమే లేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా ఆ మేఘం తరహా ఆకారం పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్థపదార్థాలలో భాగం అంటూ పలు మీడియా నివేదికలు తెలిపాయి.
పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు నీటితో కలవడం వల్ల ఇలాంటి నురుగు సహజంగానే ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడం, గాలులు వీస్తుండడంతో ఈ నురగ ఇలా గాల్లోకి తేలింది. గతంలో కూడా పలు పట్టణాలు, నగరాల్లో ఇలాంటి నురుగ వెలుగు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయని మీడియా నివేదికలు తెలిపాయి. ఇది కూడా అటువంటి జాబితాలోకి వస్తుంది. కాబట్టి మేఘాలు కింద పడుతున్నాయన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
శ్రీకాకుళంలో మేఘాలు కిందపడ్డాయనే వాదనలో ఎలాంటి నిజం లేదని పలు తెలుగు మీడియా సంస్థలు కూడా నివేదించాయి.
వైరల్ అవుతున్న వీడియో ఎక్కడ చోటు చేసుకుందో తెలుగు పోస్ట్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ వైరల్ వీడియోలో ఉన్నది మేఘాలు కాదని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : శ్రీకాకుళంలో భూమి మీదకి రాలిన మేఘాలు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story