Sat Dec 07 2024 14:10:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు భయపడనంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వీడియోను విడుదల చేయలేదు.
సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఈ వీడియోకు ఇటీవలి ఘటనలకు
Claim :
సల్మాన్ ఖాన్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు భయపడేది లేదంటూ వీడియోను విడుదల చేశాడుFact :
సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఈ వీడియోకు ఇటీవలి ఘటనలకు ఎలాంటి సంబంధం లేదు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గత కొంతకాలంగా ప్రకటనలను విడుదల చేస్తూ వస్తోంది. ఎన్సీపీ నేత, సల్మాన్ కు అత్యంత సన్నిహితుడు బాబా సిద్ధిఖీని తామే చంపేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెబుతోంది.
1998 నాటి కృష్ణజింకలను వేటాడిన కేసు సల్మాన్ ఖాన్‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. 26 సంవత్సరాల తర్వాత కూడా సల్మాన్, అతని కుటుంబం బెదిరింపులను ఎదుర్కొంటూ ఉంది. సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరపడం, ఆయన తండ్రికి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బిష్ణోయ్ కమ్యూనిటీ అత్యంత గౌరవించే జింకల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని లారెన్స్ బిష్ణోయ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
సల్మాన్ ఖాన్ తన సన్నిహితుడు, బాబా సిద్ధిక్ హత్యతో విషాదంలో మునిగిపోయాడు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కొత్తగా ఎవరికీ అపాయింట్మెంట్లను కూడా ఇవ్వడం లేదు. సల్మాన్ స్నేహితులను కొంతకాలం కలవకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సల్మాన్ సెక్యూరిటీని కూడా భారీగా పెంచేశారు.
బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయనకు వై-ప్లస్ సెక్యూరిటీకి అప్‌గ్రేడ్ చేశారు. సల్మాన్‌కు ఎస్కార్ట్ వాహనంతో పాటు వ్యక్తిగత భద్రతా అధికారి కూడా ఉంటాడు.
ఇంతలో సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు ధమ్కీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 'ఒప్పుకుంటున్నా మీరు బలవంతులే..' అంటూ వీడియో స్టార్ట్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఎవరికీ భయపడడం లేదంటూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు.
సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్నారు అంటూ మరో అకౌంట్ లో కూడా ఇదే వీడియోను పోస్టు చేశారు.
'సల్మాన్ ఖాన్ ఈ మాటలు ఎవరికి చెబుతున్నారో తెలుసా?' అంటూ మరో ఎక్స్ యూజర్ వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోకు ఇటీవలి సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విషయంలో సల్మాన్ ఖాన్ ఎలాంటి వీడియోను విడుదల చేయలేదు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
ఈ వీడియోను సల్మాన్ ఖాన్ రికార్డ్ చేసింది కరోనా వైరస్ దేశంలో ప్రబలుతున్న సమయంలో అని గుర్తించాం. "Video: Salman Khan goes BRUTAL with his words to make people take the Coronavirus lockdown seriously; says, 'In logo chand Jokaro ke vajah se yeh bimari faili ja rahi hai'" అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏప్రిల్ 16, 2020న కథనాన్ని ప్రచురించారని గుర్తించాం.
ఆ సమయంలో పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతూ వీడియోను పంచుకుంటున్నారు. తన పోస్ట్ ద్వారా సామాజిక దూరం, ఐసోలేషన్ పాటించేలా తన అభిమానులను, ప్రజలను ప్రోత్సహించారు.
దీన్ని క్యూగా తీసుకుని మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం. 'Salman Khan's message to people violating lockdown' అంటూ ఏప్రిల్ 16, 2020న సన్సద్ టీవీ ఛానల్ పోస్టు చేసిన వీడియోను మేము గుర్తించాం.
కాబట్టి, వైరల్ వీడియో నాలుగు సంవత్సరాల కిందటి నుండి ఆన్ లైన్ లో ఉందని గుర్తించాం. ఇటీవలి ఘటనల తర్వాత సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉద్దేశించి పోస్టు చేసిన వీడియో కాదని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక సల్మాన్ ఖాన్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఇదే వీడియోలను కరోనా లాక్ డౌన్ సమయంలో పోస్ట్ చేశారని మేము గుర్తించాం.
ఈ వీడియోలో, సల్మాన్ ఖాన్ COVID-19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యక్తులను విమర్శించారు. వైరల్ వీడియోలో కనిపించే భాగాన్ని 8:24 మార్క్ వద్ద చూడవచ్చు. సల్మాన్ ఖాన్ ఇదే వీడియోను ఏప్రిల్ 2020లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేశాడు.
ఈ వైరల్ పోస్టులను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు డీబంక్ చేశాయి. ఆ వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
సల్మాన్ ఖాన్ బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు సంబంధించి ఏదైనా ప్రకటన చేశారేమోనని మీడియా కథనాల గురించి వెతికాం. అయితే సల్మాన్ ఖాన్ స్పందించినట్లు ఏ మీడియా సంస్థ కూడా ప్రకటించలేదు. సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గురించి ప్రకటన చేసి ఉంటే మీడియా ప్రముఖంగా ప్రచురించి ఉండేది.
కాబట్టి, సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం ఎలాంటి ప్రకటన చేయలేదు. వైరల్ అవుతున్న వీడియో నాలుగు సంవత్సరాల క్రితం నాటిది.
Claim : సల్మాన్ ఖాన్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు భయపడేది లేదంటూ వీడియోను విడుదల చేశాడు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story