ఫ్యాక్ట్ చెక్: ట్రావెల్ వ్లాగర్ పై దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరభారతదేశంలో జరిగిన ఘటన కాదు
ట్రావెల్ వ్లాగర్ పై దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో

Claim :
ట్రావెల్ వ్లాగర్ ను హిందీ మాట్లాడలేకపోవడంతో ఉత్తర భారతదేశంలో దాడి జరిగిందిFact :
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది
ట్రావెల్ వ్లాగింగ్ చేయడం అంత సులువైనది కాదు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ రావాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు దాడులు, దోపిడీలు ఎదురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రావెలింగ్ మొదలుపెట్టిన తర్వాత ప్రయాణ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. మీరు కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. ట్రావెల్ వ్లాగింగ్ చేయడం వల్ల చాలా మంది సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. కొంతమందికి ఇది ఒక వృత్తిగా కూడా మారింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అక్కడ చాలా విషయాలను చూస్తాము. ట్రావెల్ వ్లాగర్ తన ప్రేక్షకులతో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని షేర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అందరూ ఒకేలా ప్రవర్తించకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
“దాదాపు 20 దేశాలకు ప్రయాణించి అనుభవం ఉన్న ఒక వ్లాగర్, హిందీ మాట్లాడలేకపోవడంతో ఉత్తర భారతీయులు అతడిపై దాడి చేసి, అతని డబ్బును దొంగిలించి, దారుణంగా కొట్టారని” చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"మన తెలుగు వాడి పైన దాడి
దాదాపు 20 దేశాలు తిరిగిన అనుభవం గల VLOGGER ని హిందీ మాట్లాడలేదు అని NORTH INDIA వాళ్ళు దాడి చేశారు. డబ్బులు లాక్కున్నారు, దారుణంగా కొట్టారు." అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రావెల్ వ్లాగర్ పై దాడి జరిగింది.
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేములను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. నిడివి ఎక్కువ ఉన్న వీడియోను “Soni Traveling” యూట్యూబ్ ఛానెల్లో 21 జనవరి 2026న అప్లోడ్ చేశారు.
ట్రావెల్ వ్లాగర్ అయిన సుమిత్ సోని, విజయవాడ నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తనపై దాడి జరిగిందని తెలిపాడు. అంతేకాకుండా డబ్బులు దొంగిలించారని అన్నాడు. ఒక స్థానిక వ్యక్తి తనకు లిఫ్ట్ ఇచ్చాడని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణించారని, రాత్రి తమ ఇంట్లోనే ఉండమని అడిగాడని, ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం తాగి డబ్బులు డిమాండ్ చేయడంతో గొడవ చోటుచేసుకున్నట్లు తెలిపాడు. ఇద్దరినీ గుంటూరులోని ఆటోనగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తరువాత వదిలేశారని వ్లాగర్ వెల్లడించాడు.
ఇక వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అందులో ఉన్న నేమ్ బోర్డులు తెలుగులో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను మీరు ఇక్కడ చూడొచ్చు.
సుమిత్ సోని సోషల్ మీడియా హ్యాండిల్‌ను పరిశీలించగా, అతను ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి చెందినవాడని తెలిపాడు. హిందీ మాట్లాడకపోవడం వల్ల ఉత్తర భారతదేశంలో అతనిపై దాడి జరిగిందనే వైరల్ పోస్ట్‌లోని వాదన అబద్ధమని తేలింది.
పలు వీడియోలలో సుమిత్ హిందీలో మాట్లాడడం మనం గమనించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుందని పలు మీడియా కథనాలు మాకు లభించాయి.
https://www.newsx.com/viral-
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఉత్తరభారతదేశంలో చోటు చేసుకుంది కాదు. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

