Fri Dec 05 2025 12:13:30 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్న ఏపీ పోలీసులు
లాకప్ డెత్ పేరుతో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం

Claim :
ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ ఘటన జరిగిందిFact :
లాకప్ డెత్ పేరుతో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుల కోసం 12 బృందాలతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
ఒంగోలులో వీరయ్య చౌదరిని దుండగులు దారుణంగా హత్యచేశారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో వీరయ్య చౌదరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలిసింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరికి మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది. స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి ఒంగోలులోని తన కార్యాలయానికి తిరిగొచ్చారు. ఏప్రిల్ 22 సాయంత్రం 7.35 గంటల సమయంలో రెండు ద్విచక్రవాహనాలపై ముఖాలకు రుమాళ్లు కట్టుకొని కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వస్తూనే వీరయ్య చౌదరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాతీ, గొంతు, పొట్టపై పదిహేనుసార్లు కత్తితో పొడిచి పారిపోయారు. ఆ సమయంలో వీరయ్య వెంట ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నారు. ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా ఉన్న నిందితుల కోసం విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో పోలీసులు గాలిస్తున్నారు.
"వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితుడు లాకప్ డెత్ - గుట్టు చప్పుడు కాకుండా వ్యక్తి అంత్యక్రియలు" అంటూ కొందరు పోస్టులు పెట్టారు. అందులో సాక్షి పత్రికకు సంబంధించిన కథనాన్ని కూడా పోస్టు చేశారు.
"1980లలో లాకప్ డెత్ లు చూసి ప్రజలు భయపడిపోయేవారు.
దేశమంతా ఈ మరణాలపై చర్చలు జరిగేవి.
కోర్టులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకొనేవి.
ఇపుడు రాజకీయ అండతో పేదల ప్రాణాలకు పైసా విలువలేకుండా పోయింది.
ఖచ్చితంగా ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలి. మీడియా పోరాడాలి." అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని ఏపీ పోలీసులు తెలిపారు.
వైరల్ పోస్టులో ఉన్న పేపర్ క్లిప్పింగ్ లో "రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన 'పోలీసు మార్కు' విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం గా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్‌లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం" అని ఉంది.
సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వైరల్ పోస్టులను ఖండిస్తూ కథనాలను పోస్టు చేసింది.
"ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ పేరుతో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇటువంటి నిరాధారమైన ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.#FactCheck#AndhraPradesh" అంటూ పోస్టులు పెట్టారు.
ఇక ప్రకాశం పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలలో సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా పేర్కొంటూ అసత్య కథనాలను వండి వార్చి వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మా తదుపరి పరిశోధనలో "DGP Harish Kumar Gupta: సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్.." అంటూ ఎన్టీవీ కథనం కూడా మాకు కనిపించింది.
సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారని ఆ కథనంలో ఉంది. సహజ మరణాలను లాకప్డెత్లుగా పేర్కొంటూ కథనాలను వండి, వార్చి, వడ్డిస్తున్న పత్రికలు, సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్.? పేరిట అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలు ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని అపఖ్యాతిపర్చే దురుద్దేశంతో పుకార్లు, అబద్ద ప్రచారాలు చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
అందుకు సంబంధించిన కథనం ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ పేరుతో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.
Claim : లాకప్ డెత్ పేరుతో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
Claimed By : Social Media Users, Media
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media, Media
Fact Check : False
Next Story

