Fri Dec 05 2025 09:59:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే, అది తప్పనిసరిగా వార్తల్లో నిలిచి ఉండేది

Claim :
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేశారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
సినీ నటుడిగా తన ప్రస్తానం మొదలుపెట్టి, ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పొత్తుకు ఆయన ముఖ్య కారణమయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగా, ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు లభించింది.
పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికలకు ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం సైన్ చేసిన సినిమాలను పూర్తీ చేస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన హరి హర వీర మల్లు సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇంతలో పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేశారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఎటువంటి నివేదికలు లభించలేదు. పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే, అది తప్పనిసరిగా వార్తల్లో నిలిచి ఉండేది. కాబట్టి, అలాంటిది ఏమీ జరగలేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము నిశితంగా పరిశీలించాం. ఎక్కడా కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన కనిపించలేదు.
ఆయన ట్విట్టర్ లో ఆగస్టు 6న అమిత్ షా ను కలుసుకున్నట్లుగా కూడా పోస్టు పెట్టారు.
ఇక పలు మీడియా నివేదికలను పరిశీలించగా ఆయన ఆగస్టు నెలలో డిప్యూటీ సీఎం హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగం పునరుజ్జీవింప చేయాలని తెలిపారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీక అని గుర్తుచేశారు. యువత వారానికి కనీసం ఒక్కరోజు అయినా చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, చేనేత రంగం పతనం చెందకుండా దాన్ని ప్రోత్సహించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ చేనేత రంగానికి ఊతమిచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అధికారిక ట్విట్టర్ పేజీని కూడా పరిశీలించాం. అందులో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించాయి. ప్రజలకు పలు సందేశాలను ఇచ్చారు.
ఆగస్టు 8న ప్రజలకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. "శ్రావణ శుక్రవారం సందర్భంగా వ్రతం ఆచరిస్తున్న ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. లక్ష్మీ దేవి అమ్మవారి కృపా కటాక్షం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను - @PawanKalyan" అంటూ పోస్టులో తెలిపారు.
ఆగస్టు 7న చేనేత రంగానికి అందిస్తున్న తోడ్పాటు గురించి కూడా ఆయన వివరించారు.
"చేనేత... మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత ఒకటి. ఈ రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఊతమిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాము. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అందిస్తుంది. సొసైటీలనుoచి ఆప్కో కొనేవాటికి జీఎస్టీపై 5% రాయితీ అమలు చేయడంతోపాటు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమైంది.
చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. చేనేత వస్త్రాలు వినియోగం పెంచే దిశగా ప్రచార కార్యక్రమాలు పెంపొందిస్తాము. యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి." అంటూ పోస్టు పెట్టారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయలేదు.
Claim : పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే, అది తప్పనిసరిగా వార్తల్లో నిలిచి ఉండేది
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story

