Fri Dec 05 2025 09:29:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: pH అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల COVID నుండి మనల్ని రక్షించుకోవచ్చనేది అబద్దం
భారతదేశంలో గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 430 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో ఉంది, తరువాత

Claim :
pH వ్యాల్యూ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కోవిడ్ నుండి మనల్ని రక్షించుకోవచ్చని వైరల్ ఇమేజ్ చూపిస్తోందిFact :
ఆల్కలైన్ ఆహారం తీసుకోవడం వల్ల COVID-19 వైరస్ నశించదు, జాబితా లో ఆహారాల pH తప్పుగా రాసారు
భారతదేశంలో గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 430 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. మే 29, 2025 నాటికి భారతదేశంలో 1000 కి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఆసుపత్రులలో చికిత్స తీసుకునే వ్యక్తుల సంఖ్య తక్కువగానే ఉందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. చాలా మంది రోగులు జ్వరం, అలసట, గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను అనుభవిస్తున్నారు. నిపుణులు నిరంతర నిఘా, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.
భారతదేశంలో NB.1.8.1, LF.7 వేరియంట్లు పెరుగుతున్నాయి. JN.1 వేరియంట్ కారణంగా అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం లేదా చలి, పొడి దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం లాంటివి ఉన్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా కరోనా సోకిన 2 నుండి 14 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఆరోగ్య నిపుణులు తేలికపాటి లక్షణాల గురించి చెబుతున్నారు. పరిశుభ్రత పద్ధతులను పాటించాలని, భయాందోళనలకు గురికాకుండా ఉండాలని సలహా ఇస్తున్నారు.
ఇంతలో, COVID-19 ఇన్ఫెక్షన్ను ఓడించడానికి సూచనలతో కూడిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. COVID-19 నుండి కాపాడుకోవాలంటే 5.5 కంటే ఎక్కువ pH ఉన్న ఆహారాలను తీసుకోవాలని, వాటికి రోగనిరోధక శక్తి ఉంటుందని ఆ మెసేజీలలో సూచించారు. వైరస్‌తో పోరాడటానికి pH స్థాయిని పెంచడంలో మనకు సహాయపడే ఆహారం తీసుకోవాలి. వాటిలో కొన్ని: నిమ్మకాయ - 9.9pH, అవకాడో - 15.6pH, వెల్లుల్లి - 1.2 pH, మామిడి - 8.7pH, టాన్జేరిన్ - 8.0pH, పైనాపిల్ - 12.7pH, నారింజ - 9.2 pH. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ పంపించండని ఆ మెసేజీలో ఉంది.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఏదైనా ఆమ్లమా, క్షారామా లేదా తటస్థమా అని pH విలువ తెలియజేస్తుంది. pH 0 అధిక స్థాయి ఆమ్లతను సూచిస్తుంది. pH 7 తటస్థం. pH 14 అత్యంత ప్రాథమిక లేదా ఆల్కలీన్.
వైరల్ పోస్టుల్లో ఉన్న pH విలువలు కూడా తప్పు. నిమ్మ, టాన్జేరిన్, నారింజ మొదలైనవన్నీ ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి, ఆల్కలీన్ కాదు. నిమ్మకాయలు ఆమ్ల పండ్లు, వీటి pH విలువ 2 నుండి 3 వరకు ఉంటుంది, 9.9 pH కాదు. మామిడి, టాన్జేరిన్, పైనాపిల్, నారింజ అన్నీ తక్కువ pH విలువలు కలిగిన పండ్లు.
నిమ్మరసం (pH: 2.00–2.60)
నిమ్మకాయలు (pH: 2.00–2.80)
నీలి రేగు పండ్లు (pH: 2.80–3.40)
ద్రాక్ష (pH: 2.90–3.82)
దానిమ్మ (pH: 2.93–3.20)
ద్రాక్షపండ్లు (pH: 3.00–3.75)
బ్లూబెర్రీస్ (pH: 3.12–3.33)
పైనాపిల్స్ (pH: 3.20–4.00)
ఆపిల్స్ (pH: 3.30–4.00)
పీచెస్ (pH: 3.30–4.05)
నారింజ (pH: 3.69–4.34)
టమోటాలు (pH: 4.30–4.90)
సాధారణంగా, సిట్రస్ పండ్లలో pH తక్కువగా ఉంటుంది, అంటే అవి ఆమ్లంగా (అసిడిక్) ఉంటాయి. పండ్ల రసాలు కూడా ఆమ్లంగా ఉంటాయని తెలుసుకోవాలి.
మేము అవకాడో pH సమాచారం కోసం వెతికినప్పుడు, దాని pH 6.7 నుండి 7.1 వరకు ఉందని, వెల్లుల్లి pH స్థాయి 6.06 నుండి 6.47 వరకు ఉందని తేలింది. వైరల్ పోస్టులలో వ్రాసినట్లుగా 15.6, 13.2 కాదని మేము తెలుసుకున్నాం.
ఆల్కలీన్ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కోవిడ్‌ను అడ్డుకోవచ్చనే వాదన 2020 సంవత్సరంలో కూడా వైరల్ అయింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు మళ్లీ కనిపిస్తున్నాయి. అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనను తోసిపుచ్చాయి. AAP ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఆమ్ల లేదా ఆల్కలీన్ ఆహారం తినడం వల్ల కోవిడ్ మీద ప్రభావం చూపించదు.
అంటు వ్యాధులు, వ్యాక్సినాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం "COVID వైరస్‌లోనే ఎటువంటి pH ఉండదు; pH అనేది నీటి ఆధారిత ద్రావణానికి వర్తించే విషయం, ఇది వైరస్ కాదు. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అయితే, ఆల్కలీన్ ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఎటువంటి ఆధారాలు లేవు" అని పేర్కొంటూ AP న్యూస్ ఈ వాదనను తోసిపుచ్చింది.
కాబట్టి, ఆల్కలీన్ ఆహారాలు తినడం వల్ల COVID-19 ని నిరోధించవచ్చనే వాదలో నిజం కాదు.
Claim : pH వ్యాల్యూ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కోవిడ్ నుండి మనల్ని రక్షించుకోవచ్చని వైరల్ ఇమేజ్ చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story

