‘‘సుప్రీం’’ లో ఇది కొత్త కాదు...!

భారత ప్రధాన న్యాయమూర్తి... కేవలం ఏడాదో... ఏడాదిన్నరో పదవిలో ఉండి వెళ్లిపోయే వ్యక్తి కాదు. ఆయన ఓ శక్తి. మొత్తం వ్యవస్థకు మార్గదర్శి. న్యాయ పాలనకు దిక్సూచి వంటి వారు. ఆయన ప్రవర్తన అనుమానాలకు అతీతంగా ఉండాలి. న్యాయం చేయడమే కాదు చేసినట్లు కూడా కనపడాలి. ఆయన ఇచ్చే తీర్పులు, ఏర్పరిచే సంప్రదాయాలు, మార్గదర్శకాలు ముందు తరాల వారు పదికాలాల పాటు చెప్పుకునే విధంగా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నైతికత, వ్యవహార శైలి, వృత్తిపరమైన విషయ పరిజ్ఞానం.. ఇలా ఏ కోణంలో చూసినా ఎవరూ వెలెత్తి చూపే పరిస్థితి ఉండరాదు.
తొలి తరం న్యాయమూర్తులు.....
అదృష్టవశాత్తూ మొదటి తరం ప్రధాన న్యాయమూర్తులు అలాగే ఉండేవారు. కాని రానురాను పరిస్థితి మారిపోతోంది. వారి పనితీరు విమర్శలకు గురవుతోంది. ప్రవర్తనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరొకరికి జవాబు చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాది అదే పరిస్థితి. ఆయనపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చేసిన విమర్శలను తోసిపుచ్చలేం. వివిధ కేసుల విచారణ, ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులో పారదర్శకత కొరవడుతోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాధ్ మిశ్రాకు మేనల్లుడు దీపక్ మిశ్రా. ఒడిషాకు చెందిన మిశ్రా ఈ ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు.
అనేక మందిపై ఆరోపణలు....
ఒక్క దీపక్ మిశ్రాపైనే కాదు... గతంలో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులపై కూడా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దాదాపు ఎనిమిది మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులపై కూడా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దాదాపు ఎనిమిది మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టమైన ఆరో్పణలు వచ్చాయి. జస్టిస్ రంగనాధ్ మిశ్రా, జస్టిస్ కె.ఎన్ సింగ్, జస్టిస్ ఎంహెచ్ కానియా, జస్టిస్ఎల్.ఎం శర్మ, జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జెఎస్ వర్మ, జస్టిస్ ఎం.ఎం. పూంఛీ, జస్టిస్ ఎ.ఎస్. ఆనంద్, జస్టిస్ భరూజా, జస్టిస్ బిఎన్ కిర్వాల్, జస్టిస్ జేబీ పట్నాయక్, జస్టిస్ రాజేంద్రబాబు, జస్టిస్ లహౌటీ, జస్టిస్ వి.ఎన్ ఖరే, జస్టిస్ వైకే సభర్వాల్ పౌై వివిధ రకాల ఆరోపణలు వినవచ్చాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్రమాజీ మంత్రి శాంతిభూషణ్ ఈ విమర్శలు, ఆరోపణలు చేశారు. శాంతిభూషణ్ ఆషామాషీవ్యక్తి కాదు. జనతా ప్రభుత్వ హయాంలో 1977 నుంచి 79 వరకూ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. న్యాయశాస్త్రంలో నిష్ణాతులు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థలోని లోపాలను తీవ్రంగా ఎండగడుతున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈయన కుమారుడే. శాంతి భూషణ్ ఆషామాషీగా, అల్లాటప్పాగా ఆరోపణలు సంధించలేదు. వీటికి తాను కట్టుబడి ఉంటానని కూడా ప్రకటించారు. స్వయంగా సర్వోన్నత న్యాయస్థానంలోనే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన ధీశాలి. అంతేకాక ఈ విషయంలో న్యాయస్థానం తీసుకునే ఎటువంటి చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని స్పష్టం చేశారు. దేశ న్యాయవ్యవస్థ మెరుగు కోసం, సత్సంప్రదాయాల పరిరక్షణ, ఉన్నత న్యాయవ్యవస్థలో నైతిక రుజువర్తన కోసం సంతోషంగా జైలుకు వెళతానని శాంతి భూషణ్ ప్రకటించడం విశేషం.
ప్రశ్నించిన వారిని.....
2009లో తెహెల్కా డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి భూషణ్ కుమారుడు ప్రశాంత్ భూషణ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. 17 మంది ప్రధాన న్యాయమూర్తుల్లో కనీసం సగం మంది అవినీతి పరులేనని ఆరోపించారు. పంచీ, ఆనంద్ సభర్వాల్ ల పై ఆరోపణలకు ఆధారాలున్నాయని పేర్కొనడం విశేషం. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ, కోల్ కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కూడా న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీ, పదోన్నతుల్లో పారదర్శకత పాటించడం లేదని నేరుగా ఆరోపణలు గుప్పించారు. ఇందుకు గాను జస్టిస్ కట్జూ చేత సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పించుకుంది. జస్టిస్ కర్ణన్ కు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కారాన్ని ఆయుధంగా చేసుకుని ఎల్లకాలం రక్షణ పొందలేదు న్యాయవ్యవస్థ. తన నిజాయితీ, నైతికత, పారదర్శకత, జవాబుదారీతనంతోనే భారత న్యాయ వ్యవస్థ తేజోమయం కాగలదు.
-ఎడిటోరియల్ డెస్క్

