సమాచారమా? చట్టు బండలా?...

రాజకీయ పార్టీలు ఎన్నికల లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రాంతీయ పక్షాలు స్థానిక ప్రయోజనాలపై గళం విప్పుతున్నాయి. విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మోర విరుచుకుంటూ అద్భుతం చేశామంటూ జబ్బలు చరుస్తోంది. బడ్జెట్ 2018-19 తమకు ఏ కోణంలో ఉపయోగపడుతుందా?అన్నయావలోనే అధికార విపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఘనతను చాటుకోవడానికి బీజేపీ, మిత్రపక్షాలు, అందులోని లొసుగులను ఎండగట్టడం ద్వారా రాజకీయం నొల్లుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయాసపడుతున్నాయి. అన్ని పార్టీలు, అందరు నాయకులూ ఓట్ల గణాంకాలపైనే దృష్టి పెడుతున్నారు. ఈ గడబిడలోనే గుట్టుచప్పుడు కాకుండా కేంద్రం ఒక ప్రజా గొంతు నొక్కేసేందుకు తెలివిగా చక్రం తిప్పింది. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పూచీకత్తుగా నిలుస్తున్న సమాచార హక్కు చట్టానికి చల్లంగా చెక్ చెప్పేందుకు పక్కాగా ప్లాన్ గీసింది. 2005లో దీనికి ఊపిరిపోసిన యూపీఏ, సారథ్యం వహించిన కాంగ్రెసు లు పట్టించుకునేంత తీరిక చేసుకోలేకపోతున్నాయి. కొండొకచో ఈ చట్టం తమకు కూడా చుక్కలు చూపించిందన్న భావనతో మౌనం వహిస్తున్నాయి. మొత్తమ్మీద సమాచార హక్కు చట్టానికి దురవస్థ దాపురించబోతోంది. దానిని అమలు చేయాల్సిన కేంద్రసమాచార కమిషన్ కు గడ్డుకాలం తప్పకపోవచ్చని తాజా బడ్జెట్ ప్రతిపాదనలు నిరూపిస్తున్నాయి.
నిధుల కోత.. నిలువు వాత...
ప్రతి ఏటా ప్రభుత్వాలు బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు పెంచుతూ ఉంటాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఏటా కనీసం పదిశాతం మేరకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం సాధారణ విషయం. ప్రభుత్వం ప్రాధాన్య అంశాలుగా గుర్తించిన శాఖలకు మరింతగా నిధులను పెంచుతుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో ప్రభుత్వ శాఖలపై ప్రజల తరఫున వాచ్ డాగ్ గా పనిచేస్తున్న సమాచార కమిషన్ కు భారీగా నిధుల కోత పెట్టింది. ప్రాధాన్యం లేని విభాగంగా భావించిందో లేక గొంతు నొక్కడానికి నిధుల కోతను మించిన సాధనం లేదని భావించిందో సమాచార హక్కుచట్టానికి చాపచుట్టేసే దిశలో నిధుల గండి కొట్టింది. సవరించిన అంచనాల ప్రకారం 2017-18 బడ్జెట్ లో కేంద్రసమాచార కమిషన్ కు 23.61 కోట్ల రూపాయల మేరకు వ్యయ కేటాయింపులు చేశారు. 2018-19 లో దీనిని అమాంతం కుదించివేశారు. 63 శాతం కోత పెడుతూ కేవలం 8.66 కోట్లు సరిపోతాయంటూ 2018-19 బడ్జెట్ లో కేంద్రం సరిపెట్టేసింది. జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం అమలు పై నిర్ణయాత్మక అధికారాలు ఉన్న కేంద్ర సమాచార కమిషన్ పనితీరుపై ఇది తీవ్రప్రభావాన్ని చూపించే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి ఏటా వంద కోట్ల రూపాయల వరకూ నిధులను కేటాయించి సమాచార కమిషన్ ను బలోపేతం చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినవస్తోంది. దానిని పక్కనపెట్టి వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశలో కేటాయింపులను కుదించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు హక్కుల కార్యకర్తలు.
పారదర్శకతకు పాతర...?
భారత స్వాతంత్ర్యానంతరం రాజకీయం, అధికారం కుమ్మక్కై అక్రమాలకు తెరతీసిన ఉదంతాలు కోకొల్లలుగా చోటు చేసుకున్నాయి. ప్రజల చేతిలోనే నిజమైన అధికారం ఉంటుందన్న రాజ్యాంగ ప్రవచనం నిస్తేజమై పోయింది. కనీసం ప్రశ్నించే అధికారం కూడా లేకుండా పోయింది. తాము చెల్లిస్తున్న పన్నులు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రజలకు కనీస సమాచారం కరవైంది. రాజకీయ పాలకులు, అధికారులు కలిసికట్టుగా ఆడింది ఆట పాడింది పాటగా అధికారం చెలాయిస్తూ అక్రమాలు చేసినా అడిగే నాథుడు కరవయ్యాడు. ఈ నేపథ్యంలోనే అనేక ఉద్యమాల ఫలితంగా 2005 లో ఊపిరిపోసుకుంది సమాచార హక్కు చట్టం. ఏ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ప్రభుత్వ పథకాల తీరు, ఫైళ్ల కదలికలోని జాప్యాన్ని, అభివృద్ధి సంగతులను, అన్యాయాన్ని ప్రశ్నించే హక్కును , సమాచారాన్ని డిమాండ్ చేసి తెలుసుకునే అధికారాన్ని ప్రజలకు ఈ చట్టం కల్పించింది. అక్కడక్కడా వ్యక్తిగత కక్షలతో కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ కేసులు అత్యరుదుగానే చెప్పుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు దోహదం చేయాలనేది ఈ చట్టం లక్ష్యం. తమ నిధులను ప్రభుత్వాలు ఏరకంగా ఖర్చు పెడుతున్నాయో తెలుసుకునే అధికారం, చట్టబద్దంగా ప్రశ్నించే హక్కు ప్రజలకు కల్పించడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టవచ్చనేది కూడా చట్టం లక్ష్యమే. ఈ చట్టం సక్రమంగా అమలవుతుందో లేదో చూసే బాధ్యత, పర్యవేక్షణ హక్కులు జాతీయ స్థాయిలో కేంద్ర సమాచార కమిషన్ కు , రాష్ట్రాల్లో రాష్ట్ర సమాచార కమిషన్లకు ఉంటాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న కమిషన్ కు నిధుల కోత విధించడమంటే నిలదీసే యంత్రాంగాన్ని నిలువరించడమే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంటోంది.
కేంద్రంపై నా నిఘా...
కేంద్రసమాచార కమిషన్ పనితీరు సంతృప్తికరంగానే ఉందని హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక సాంకేతికపరిజ్ణానం, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది పెంపుదల జరిగితే సమాచార హక్కు చట్టం లక్ష్యం నూటికి నూరుపాళ్లు నెరవేర్చేందుకు అవకాశం ఉంటుంది. కమిషన్ తన పరిధిలో ఎంతటి పెద్దస్థాయి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా ఉపేక్షించడం లేదు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి స్మృతి ఇరాని వంటి వారి విషయంలోనూ నిరపేక్షంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనగా చెప్పుకోవాలి. ఇటువంటి స్థితిలో కమిషన్ కు చాలినన్ని నిధులు ఇవ్వకపోవడమంటే కక్ష సాధింపు ధోరణిగా విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఫిర్యాదులు చేసేందుకు కాల్ సెంటర్ల ఏర్పాటు, డిజిటలైజేషన్, కేసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు వంటివాటిని సమకూర్చుకోవాలని సమాచార కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. 120 కోట్ల మంది ప్రజలకు చేరువ కావడానికి , మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ ప్రయత్నాలు ఎంతైనా దోహదం చేస్తాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 50 లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యయ ప్రణాళికతో కూడిన బడ్జెట్లను ఏటా అమలు చేస్తున్నాయి. ఈమొత్తం నిధులన్నీ ప్రజల నుంచి సమకూర్చుకునే మొత్తాలే. అవి ఎలా ఖర్చవుతున్నాయో, ఎంతమేరకు దుర్వినియోగం అవుతున్నాయో తెలుసుకుని నిలదీసే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. అందుకు ఎంత ఖర్చైనా వెనుకాడకూడదు. ఇందుకుగాను తగిన మొత్తాలు కేటాయించి మౌలికవసతులతో బలోపేతం చేయకపోతే... బిల్లు బెల్లు అన్నట్లుగా జీతభత్యాలకే పరిమితమయ్యే మరో యంత్రాంగంగా మారిపోతుంది సమాచార కమిషన్. తాము ఎన్నికైన ప్రతినిధులం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటవుతుంది. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తే ప్రజలే అప్రమత్తం కావాల్సి ఉంటుంది.
-ఎడిటోరియల్ డెస్క్

