ష్ గప్ చుప్...! ఇక గుసగుసలే...!

నోటికి రాజ్యం తాళం వేస్తోంది. నిత్యం నిందించే విమర్శకులపై కొరడా ఝళిపించబోతున్నారు.రాజకీయ ప్రత్యర్థులపై కేసీఆర్ పాశుపతాస్త్రం ప్రయోగిస్తున్నారు. కనిపించని శత్రువులపై కరవాలం దూస్తున్నారు. సమైక్య పాలకులకు, జాతీయ పార్టీలకు రాని వినూత్నమైన ఆలోచనతో విమర్శలు, ఆరోపణలకు చట్టంతోనే చెక్ పెట్టబోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేయాలంటే ఇక కాసింత ఆలోచించాల్సిందే. సర్కారు కన్నెత్తి ఆగ్రహిస్తే కటకటాలు లెక్కించాల్సిందే. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన కేసీఆర్ ఇప్పుడు పక్కా రాజకీయవాదిగా, ఫక్తు సర్కారీ ప్రతినిధిగా రూపాంతరం చెందారు. నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించే తీవ్ర ఆరోపణలు ఇక నేరపూరిత కుట్రలో బాగం కాబోతున్నాయి. న్యాయస్థానాల అనుమతితో సంబంధం లేకుండానే సదరు బాధ్యులైన వ్యక్తులపై కేసులు నమోదు చేసే స్వేచ్ఛను రాజ్యం చేతుల్లోకి తీసుకొంటోంది. ప్రభుత్వంలోని అత్యంత శక్తిమంతమైన పోలీసు యంత్రాంగం రాజకీయ విమర్శను సైతం నేరంగా పరిగణించి కేసులు పెట్టవచ్చు. సంబంధిత వ్యక్తిని నిందితుడిని చేసి న్యాయస్థానం బోనులో నిలబెట్టవచ్చు.
నీరుగారిన స్ఫూర్తి...
తెలంగాణ ఉద్యమంలో మాటను తూటాగా ప్రయోగించి గరిష్టంగా లబ్ధి పొందింది తెలంగాణ రాష్ట్రసమితి. విమర్శకు, దూషణకు, అసభ్యతకు, ఆరోపణకు వ్యత్యాసం లేకుండా దండకం మాదిరిగా విరుచుపడేవారు కేసీఆర్. సమైక్యాంధ్రపాలకులను, అప్పుడప్పుడూ ఆ ప్రాంత స్థానికత కలిగిన ప్రజలను కలగలిపి ఏకిపారేసేవారు. తెలంగాణ ప్రజల్లో ఆవేశం రగిలించడానికి ఆ మాటలు ఎంతగానో ఉపయోగపడుతుండేవి. ఇంతటి అణచివేతకు, దారుణానికి తాము గురయ్యామన్న భావనను కేసీఆర్ తిట్ల ద్వారానే ప్రజలుతెలుసుకునేవారు. ఈవిషయంలో జాతీయ నాయకులను సైతం ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు. రక్తం తాగే రాక్షసులు, పిశాచాలు, భూతాల వంటి పదప్రయోగానికీ టీఆర్ఎస్ నేతలు వెనకాడలేదు. అగ్రనాయకులే ఇందుకు మార్గం చూపారు. రాష్ట్ర విభజనకు ఈ ఆరోపణల పర్వం ఒక ప్రాతిపదికగా పనిచేసింది. తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నిలపగలిగింది. హేతుబద్దతను పక్కనపెట్టినా విమర్శల వాడి,వేడి ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ఇప్పుడు ఆ స్థాయి విమర్శలతో కూడిన ఆరోపణలే కుదరవంటున్నారు కేసీఆర్. సహేతుకమైన విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రజాస్వామ్యానికి రాణింపు నిస్తుంది. ఉద్యమసమయంలో కేసీఆర్ ఈ పంథాను ఎన్నుకోవడం ద్వారానే ఇతరపక్షాలను డిఫెన్స్ లోకి తోసేసి తాను ప్రజల హృదయాల్లో ఆధిక్యాన్ని సాధించగలిగారు. అవే విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు తనపై ఎక్కుపెట్టేటప్పటికి తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యామ్నాయ చట్టాలకు పదునుపెట్టి భావస్వేచ్ఛకు పరిధులు నిర్ణయించాలని చూస్తున్నారు.
సామాజిక ఉచ్చు...
సామాజిక మాధ్యమాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. వాట్సప్ , ఫేస్ బుక్, యూట్యూబ్, వెబ్ సైట్ల రూపంలో అనామక వ్యక్తులు, ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా, కీలక నేతలపైనా తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయా విమర్శలు, ఆరోపణలు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అందులోనూ అర్బనైజేషన్ ఎక్కువగా ఉన్న తెలంగాణలో వీటిపట్ల యువత తీవ్రంగానే ప్రభావితం అవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక వ్యక్తి పెట్టిన పోస్టింగును షేర్ చేయడం , కామెంట్లు పెట్టడం ద్వారా అభిప్రాయం దావానలంలా వ్యాపించిపోతోంది. ప్రభుత్వం దీనికి వివరణ ఇచ్చే ఆస్కారం కూడా ఉండటం లేదు. వీటిని అదుపు చేయాలని గతంలోనే సీఎం కేసీఆర్ పోలీసు అధికారులకు సూచించారు. ఐపీసీ సెక్షన్ 506 కింద పరుషపదజాలంతో దూషించడం, కించపరచడం, ప్రత్యక్షంగా బెదిరించడం వంటివి నేరపూరిత చర్యల పరిధిలోకి వస్తాయి. పరోక్ష బెదిరింపులతో నేరాన్ని ప్రేరేపించడం సెక్షన్ 507 కింద చర్యలు తీసుకునే నేరమే. కానీ సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. పోలీసులు అప్రోచ్ అయినా కోర్టులు ఆయా నేరాలపై పెద్దగా స్పందించడం లేదు. దీంతో ప్రభుత్వం, కీలక నేతలు సామాజిక మాధ్యమ ఉచ్చులో విలవిలలాడుతున్నారు. నిజానికి ప్రత్యర్థులైన రాజకీయ నేతలు చేసే ఆరోపణలు, ప్రచారం కంటే సామాజిక మాధ్యమాల వల్ల వాటిల్లుతున్న నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రభావాన్ని తగ్గించాలంటే కచ్చితంగా ఆయా ఆరోపణలను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులను గత కొంతకాలంగా కోరుతున్నారు.
ప్రత్యర్థులు ..పరారు...
కోర్టు అనుమతితో మాత్రమే కేసులు నమోదు చేయాల్సిఉన్న సెక్షన్ 506, 507 పరిధిలోకి వచ్చే దూషణ, నేర ప్రేరేపిత చర్యలు ఇప్పుడు కాగ్నిజబుల్ నేరాలుగా నిర్వచనం మార్చుతున్నారు. అంటే ఇటువంటి కేసులపై కోర్టుతో సంబంధం లేకుండా పోలీసులు కేసులు పెట్టవచ్చు. ఈమేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్ నిర్వచనం మార్చుకునేందుకు చట్టసవరణ విచక్షణాధికారాలు రాష్ట్రప్రభుత్వానికి ఉన్నాయి. ఆ హక్కుని వినియోగించుకుని చట్టసవరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ముక్తకంఠంతో ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ఆరోపణల దాడిని పెంచిన విపక్షనేతలకు ముకుతాడు వేయడమే ఈ చట్టసవరణ ఉద్దేశం. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి సోదరులు, మందకృష్ణమాదిగ, వీహెచ్ వంటి నేతలకు గొంతులో పచ్చివెలక్కాయ పడబోతున్నట్లే. విమర్శల విషయంలో ప్రత్యర్థులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని చూడాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని హైకోర్టు, సుప్రీం కోర్టులను ప్రతిపక్షాలు ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్

