లోకల్ బాయ్స్ వర్సెస్ మోడీ

నిన్నా మొన్నటి వరకూ గుజరాత్ కు ప్రధాని మోడీ మోనార్క్. లార్జర్ దేన్ లైఫ్ సైజులో ఆయన ముఖచిత్రం కనిపిస్తే చాలు ఓట్ల వర్షం కురవాల్సిందే. తమ ప్రాంతీయ ఆత్మాభిమానానికి, ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా మెజార్టీ గుజరాతీయులు ఆయనను ఆరాధిస్తూ వచ్చేవారు. జాతీయ స్థాయి కాంగ్రెసు నాయకులు ఆయన వాగ్ధాటి, వ్యూహనైపుణ్యం ముందు నిలవలేకపోయేవారు. ప్రధానంగా సోనియా, రాహుల్ వంటి వారిని పరాయి వ్యక్తులుగానే ఇక్కడి ప్రజలు భావిస్తుండేవారు. మోడీ అంటే తమ సొంత మనిషన్న భావన బలంగా నెలకొనేలా చేసుకోగలిగారు. స్థానిక సమీకరణలకు అవసరమైన పొలిటికల్ లైన్ తో బీజేపీ ప్రతి ఎన్నికలోనూ బలపడుతూ వచ్చింది. సీట్ల పరంగా , ఓట్ల పరంగా ఒక స్థిరమైన కేంద్రీకరణను సాధించగలిగింది. జాతీయ వాదం, గుజరాత్ ఆత్మగౌరవం,మతపరమైన సమీకరణను పాలకపక్షం ఒక సిద్ధాంతంగా మార్చేసింది. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, గుజరాత్ అంటేనే అభివృద్ధి అన్న ఆకర్షణీయ నినాదాలు ప్రచార హంగామాలో ప్రధాన పాత్ర పోషించేవి. ఇంతవరకూ ఏ అంశాలను మోడీ తన అమ్ముల పొదిలో అస్త్రాలుగా చేసుకుంటూ దూసుకుపోయారో, అవే అంశాలను ప్రతికూలంగా ప్రయోగిస్తూ ఈసారి కాంగ్రెసు పార్టీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. వారం లోపు తొలి విడత ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పరిస్థితులు ఏమంత సానుకూలంగా లేవన్న విషయాన్ని కమల నాథులు కూడా గ్రహిస్తున్నారు.
మూల్యం చెల్లిస్తా....
గుజరాత్ ఎన్నికల ఘట్టం అత్యంత కీలక దశకు చేరిన నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. తాను తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణ విషయంలో ప్రజల్లో ప్రతికూలత వస్తుందన్న విషయం తనకు తెలుసునన్నారు. ఇందుకు రాజకీయ మూల్యం చెల్లించేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. వ్యాపార వర్గాలు ప్రాబల్యం వహించే గుజరాత్ లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందన్న విషయాన్ని మోడీ ఈ ప్రకటన ద్వారా ముందస్తుగానే చెప్పేసినట్లయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. మానసికంగా పార్టీని, క్యాడర్ ను సిద్దం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సైకలాజికల్ గా ఎంతో ఎఫెక్టు పడే విధంగా ప్రధాని ఈ ప్రకటన ఎందుకు చేశారన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. తీవ్రమైన నైరాశ్యంలోనే ప్రధాని తన ఆవేదనను వ్యక్తీకరించారంటున్నారు. ప్రధాని స్థాయిలో కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుని తరహాలో 33 జిల్లాలకు గాను 35 చోట్ల మోడీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది.
లోడెడ్ లోకల్ బాయ్స్ ...
గతంలో మోడీని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు పోటీగా ప్రజలు పోల్చి చూడటం వల్ల ఆయన వైపే మొగ్గు కనిపించేది. ప్రాంతీయ వాదం ప్రాబల్యం వహించేది. ఇప్పుడు ఆయన ప్రధాని. అందువల్ల తమ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనేవారు వేరే వారు అన్న విషయం గుజరాతీయులకు స్పష్టంగా తెలుసు. రాహుల్ వర్సస్ మోడీ అని జాతీయస్థాయిలో ప్రచారం సాగుతున్నా నిజానికి గుజరాత్ ఓటర్ల మనోభిప్రాయం వేరుగా కనిపిస్తోంది. మోడీ వర్సస్ లోకల్ బాయ్స్ అన్నట్లుగా పోటీ రూపాంతరం చెందింది. పటేదార్ల రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్, బీసీ సంఘాల నాయకుడు అల్ఫేష్ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని వంటివారు ప్రజల్లో మనుషులు. మోడీ మాదిరిగానే వీరినీ ఎంతగా తమ వాళ్లుగా ప్రజలు భావిస్తున్నారు. మోడీ మాదిరిగానే వాగ్ధాటితో వీరు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మోడీ శైలిలోనే మోడీకి బదులిస్తున్నారు. బీజేపీకి ఇదే ప్రధాన ప్రతికూలాంశంగా పరిణమిస్తోంది. గ్రామ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ దుస్థితి, పారిశ్రామిక సంక్షోభం, నిరుద్యోగం వంటి అంశాలను ఈ యువ త్రయం చర్చనీయం చేస్తోంది. షో కేసులుగా ఒకటి రెండు ప్రాంతాల్లో చూపించే అభివ్రుద్ధి నమూనాలను ఎద్దేవా చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు యువనాయకులు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ని ఎన్నికల ప్రయోజనం కోసం వినియోగించడం బీజేపీ నమూనా. దీనిని కూడా హార్దిక్ పటేల్ వర్గం సొంతం చేసేసుకుంది. జై సర్దార్. జై పటేదార్ అన్న నినాదంతో బీజేపీకి, పటేళ్లకు మధ్య అంతరాన్ని స్రుష్టించడంలో హార్దిక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ముస్లిం లకు ‘చెయ్యి’చ్చేసినట్లేనా?
నేను శివభక్తుడిని అంటూ రాహుల్ గాంధీ తనకు తాను ప్రకటించుకున్నారు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమనాథ్ ఆలయ సందర్శనలో ఆయన పేరు హిందూ యేతర వ్యక్తుల చిట్టాలో నమోదయిందని బీజేపీ వివాదం చేసేందుకు ప్రయత్నించింది. కాంగ్రెసు దానిని తిప్పికొట్టింది. మొత్తానికి ఎవరు పెద్ద హిందువు అన్నంతగా పరిస్థితి దిగజారింది. గతంలో గుజరాత్ లో ముస్లింలు మెజార్టీ సంఖ్యలో కాంగ్రెసుకు ఓట్లేస్తున్నట్టుగా అనేక సర్వేలు అంచనా వేశాయి. కానీ జనాభాలో వీరి సంఖ్య తొమ్మిది శాతానికే పరిమితం కావడంతో హిందూ ఓట్లు బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్నాయి. కేవలం ముస్లిం లను నమ్ముకుంటే ఎప్పటికీ అధికారంలోకి రాలేమని కాంగ్రెసు గ్రహించింది. మైనారిటీ అప్పీజ్ మెంట్ ను ఈసారి దూరం పెడుతోంది. రాహుల్ ప్రచారంలో హిందూ ముద్ర పడేలా జాగ్రత్త వహిస్తోంది. అహ్మద్ పటేల్ వంటివారు ఇంతవరకూ గుజరాత్ లో అనుసరిస్తూ వచ్చిన మైనారిటీ ఆకర్షక యత్నాలకు స్వస్తి పలికేసినట్లే. దీంతో ఇప్పుడు ముస్లిం లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది కూడా కొంత ఆసక్తిదాయకంగా మారింది.
-గుజరాత్ నుంచి తెలుగుపోస్ట్ ప్రత్యేక ప్రతినిధి

