రాజకీయమా... శాసించు..శ్వాసించు..!

ప్రజాస్వామ్యంలో రాజకీయానిదే పైమాట. ఓట్లు, సీట్ల సయ్యాటలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అందలమెక్కాలనుకుంటాయి పార్టీలు. కులం, మతం, ప్రాంతం దేన్నైనా తమ పార్టీ ప్రయోజనాల కోసం అడ్డంగా వాడేసుకుంటుంటాయి. అవసరమైతే శాంతిభద్రతల సమస్యనూ సృష్టిస్తుంటాయి. గరిష్టంగా ఓట్లు రాబట్టుకునే ఏ మార్గాన్నీ వదులుకోవు. నైతికత, విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి వంటివన్నీ చట్టుబండలు. వట్టిమాటలే. అందుకే ఇటువంటి అవకాశాలను అధికారపక్షం కంటే ప్రతిపక్షాలే ఎక్కువగా ఒడిసిపట్టుకుంటూ ఉంటాయి. విచిత్రంగా ఈ సారి అధికారపక్షానికి అరుదైన అవకాశం కలిసొచ్చింది. చట్టసభలో విపక్షాలపై పైచేయి సాధించి ఇరుకున పెట్టేందుకు ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ బిల్లు ఆసరాగా అందివచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకించలేక, మద్దతివ్వలేక ఎటూ తోచని అయోమయంలో కొట్టుకుంటున్నాయి విపక్షాలు. సెలక్టు కమిటీ వంటి అస్త్రాలు తాత్కాలిక రక్షణకు ఉపకరిస్తాయే కానీ శాశ్వతంగా కాదు.
రెండిందాలా లాభమే....
కమలం కత్తికి రెండు వైపులా పదునుంది. ఎటు కోసినా తెగుతుంది. ముస్లిం లంటే బీజేపీకి పడదు. బీజేపీ పేరు చెబితే ముస్లిములకు గిట్టదు. వారి ఓట్లే మాకవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది బాజపా. అసలు కమలం పార్టీ పొడే గిట్టదు ముస్లింలకు. తమ వ్యతిరేకతను ఈ రెండు వర్గాలు కూడా ఎక్కడా దాచుకున్న దాఖలాలు లేవు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో ముస్లింలకు సీట్లు కేటాయించకపోయినా విజయం సాధించగలిగిందంటే బీజేపీ వ్యూహం అర్థమవుతుంది. ఎటువంటి మొహమాటాలకు పోకుండా ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ పోలరైజేషన్ చేయగలగడమే కమల విజయం. ఒక శివసేనను మినహాయిస్తే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దృఢంగా మెజార్టీ వాదాన్ని తీసుకున్నదాఖలాలు మనకు కనిపించవు. అన్నిపార్టీలు కన్సాలిడేటెడ్ గా పోలయ్యే మైనారిటీలను బుజ్జగించడంపైనే దృష్టి పెడుతుంటాయి. దీంతో హిందూ ఓట్లు దూరమవుతున్నాయి. నిన్నామొన్నటివరకూ హిందువుల్లో కూడా ఎక్కువమంది లౌకికవాదులు కావడంతో ఈ ఓట్లలో చీలిక కనిపిస్తుండేది. కరడు గట్టిన హిందూవాదుల ఓట్లు మినహా దేశవ్యాప్తంగా బీజేపీ పెద్దగా వాటా సాధించగలిగేది కాదు. దాంతో కాంగ్రెసు, సమాజ్ వాదీ, తృణమూల్, బీజేడీ వంటి పక్షాలు రాజకీయంగా లాభం పొందుతుండేవి. సెక్యులర్ ఓట్లను కూడా హిందూ మితవాదం వైపు మొగ్గుచూపేలా చేసుకోవడంలో గడచిన మూడు సంవత్సరాలుగా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విజయం సాధిస్తోంది. దీనిని రుజువు చేసుకునేందుకు ముస్లిములకు శాసనసభ టిక్కెట్లను కేటాయించకుండా వ్యూహాత్మక ఎత్తుగడను అవలంబిస్తున్నారు. తాజాగా ముస్లిం మహిళా హక్కుల పరిరక్షణ బిల్లు ద్వారా ఈవర్గంలో కూడా చీలిక తెచ్చే మాయోపాయం దాగి ఉంది. మైనారిటీ ఓట్లు మావే అని క్లెయిం చేసుకుంటున్న విపక్షాలకు దీనిపై ఎలా స్పందించాలో అర్థం కాని అయోమయం. మూడుసార్లు తలాక్ అని చెప్పడం ద్వారా పురుషులు వివాహాన్ని రద్దు చేసుకోవడంతో ముస్లిం మహిళలు తీవ్రమైన మానసిక, ఆర్థిక ,సామాజిక వేదనను అనుభవిస్తున్నారు. విద్యావంతులైన ముస్లిం మహిళలు, మద్యతరగతి మహిళలు దీనిని తీవ్రంగానిరసిస్తున్నప్పటికీ ఈ ఆచారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పుడు బీజేపీ చట్టబద్దంగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు పూనుకోవడంతో మహిళల నుంచి మద్దతు లభించేందుకు వీలుంటుంది.
అడకత్తెరలో...
షాబానో కేసులో సుప్రీం కోర్టు ముస్లిం మహిళలకు మద్దతుగా నిలిచినప్పటికీ రాజీవ్ గాంధీ ప్రధానిగా పార్లమెంటు ద్వారా దానిని తిప్పికొట్టారు. మూడు దశాబ్దాల క్రితమే అడ్డగోలుగా తలాక్ చెప్పే విధానానికి ముగింపు పలికే అవకాశం వచ్చినప్పటికీ కాంగ్రెసు అడ్డుపడింది. ముస్లిం మహిళల హక్కుల విషయంలో ఈ పార్టీ అన్యాయం చేసినట్టే చెప్పాలి. కాంగ్రెసు మేధావులు సైతం దీనిని అంగీకరిస్తారు. అప్పటికున్న పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి సుప్రీం తీర్పు స్ఫూర్తినే గంగపాలు చేశారు. నిజానికి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంటును ప్రాతిపదికగా చేసుకుంటూ దానికి మద్దతుగా చట్టం చేసి ఉంటే కాంగ్రెసు ముస్లిం మహిళల కన్నీళ్లను శాశ్వతంగా తుడిచినట్లయి ఉండేది. ఆ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న పార్టీ ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అటు బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతివ్వకపోతే ముస్లిం మహిళా లోకంలో శాశ్వతమైన శత్రువుగా మిగిలిపోతుంది. గతంలో షాబానో కేసులో తాము చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. కానీ మద్దతిస్తే పొలిటికల్ మైలేజీ మాత్రం బీజేపీ ఖాతాలోనే జమ అవుతుంది. అదే సమయంలో ముస్లిం పురుషుల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉంది. నిజానికి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాంతీయ పక్షాలు, ఇతర పార్టీ ల కంటే పాన్ ఇండియా పార్టీ అయిన కాంగ్రెసుకే ఎక్కువ నష్టం. ఎటువైపు మొగ్గు చూపినా మరో వర్గం పూర్తిగా దూరమవుతుంది. కక్షగట్టి మరీ బీజేపీకి ఓటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో కాంగ్రెసు గోడమీద పిల్లివాటంగా లోక్ సభలో సపోర్టు చేసి రాజ్యసభలో డ్రామాకు తెరతీసింది. సేఫ్ గేమ్ తో గట్టెక్కాలనుకుంటే ఎవరూ విశ్వసించక ఒక్కోసారి నిండా మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఆశల మోసులు...
ముస్లిం మహిళా వైవాహిక హక్కుల పరిరక్షణ బిల్లును ప్రవేశ పెట్టడంతోనే కావాల్సిన రాజకీయ లబ్ధిని బీజేపీ ఇప్పటికే దక్కించుకోగలిగింది. బిల్లు పాసయ్యి చట్ట రూపం దాల్చినా, లేక వీగిపోయినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. గెలిస్తే ఓట్ల లాభం, ఓడితే ప్రయత్నం. మహిళా ప్రయోజనాల కోసం పాటుపడ్డామన్న సంస్కరణవాద ముద్ర. మైనారిటీ మతంలో పెద్ద మార్పునకు తాము ప్రయత్నిస్తున్నామంటూ కమలం పార్టీ ప్రచారం చేసుకొంటోంది. ముస్లిం లకుండే ప్రత్యేక హక్కులను మరోసారి చర్చనీయం చేస్తూ మెజారిటీ హిందువుల్లో సంఘటిత ఓటింగు అవసరాన్ని మరోసారి తెరమీదుకు తెస్తోంది. కాంగ్రెసు ఈ బిల్లుకు అడ్డుపడుతోందంటూ సంస్కరణ వాదులైన ముస్లింలు, మహిళల్లో సానుభూతి కూడగడుతోంది. కాంగ్రెసుకు వ్యతిరేకంగా మహిళా ప్రభంజనాన్ని సృష్టించాలనే ఎత్తుగడతో ముందుకు వెళుతోంది. 2019 నాటికి ఓటు లెక్కలూ వేసుకుంటోంది. పశ్చిమబంగ, అస్సాం, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల అనేక లోక్ సభ నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపు నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 62 నియోజకవర్గాల్లో మోడరేట్ గా హిందూ ఓట్లతోపాటు మెజారిటీ ముస్లింలు ఎటువైపు మొగ్గితే అటు వైపే గెలుపు సాధ్యమవుతుందనే అంచనా. ఈ మేరకు బీజేపీ తన సర్వేలో నిర్ధారించుకుంది. ఆ నియోజకవర్గాల్లో మైనారిటీల నుంచి 20శాతం ఓటింగును రాబట్టగలిగితే గెలుపు తారుమారవుతుంది. బీజేపీ వ్యతిరేక భావనలో కరడు గట్టిన పురుష ముస్లింలను పక్కనపెట్టి మహిళల్లో కనీసం 40 శాతం ఓట్లు రాబట్టగలిగితే 40 లోక్ సభ స్థానాలను తన కిట్టీలో వేసుకోవచ్చనే అంచనాలో ఉంది బీజేపీ. ముస్లిం మహిళా ఓటింగులో 25 శాతం రాబట్టగలిగినా 30 లోక్ సభ స్థానాలు గెలుచుకోవచ్చని కమలనాథులు ధీమాగా ఉన్నారు. ఆ మేరకు ముస్లిం మహిళా వైవాహిక హక్కుల పరిరక్షణ బిల్లు ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్

