మోడీకి నిద్ర కరువయింది..ఎందుకంటే?

ఇటీవల గొరఖ్ పూర్, ఫూల్ పూర్ ఉప ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలనాధులకు మరో అగ్ని పరీక్ష ఎదురు కానుంది. త్వరలో మరోసారి యోగీ ఇలాకాలో ఉప ఎన్నికలను కమలం పార్టీ ఎదుర్కొనేందుకు సన్నద్థమవుతోంది. సిట్టింగ్ సభ్యుల మృతి కారణంగా కైరానా లోక్ సభ స్థానం, నూర్ పుర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరోపక్క కమలనాధులను కట్టడి చేసేందుకు ఒకప్పటి ఆగర్భ శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సమాయత్తమవుతున్నాయి. నిజానికి గొరఖ్ పూర్, ఫూల్ పూర్ కన్నా కైరానా, నూర్ పూర్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోనుంది. ఇవేమీ కమలం పార్టీ కంచుకోటలు కావు. మొన్నటి ఎన్నికల్లో మోడీ గాలిలో గెలిచినవే తప్ప మొదటి నుంచి పట్టున్న స్థానాలు కావు. అందువల్ల మారిన పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో, కేంద్రంలో చక్రంతిప్పుతున్న భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కీలకమైనవే. ఏ మాత్రం తేడా వచ్చినా కమలం పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేయడానికి, ఆ పార్టీకి తాటాకులు కట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్, ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి.
బీజీపీకి కంచుకోట కాదు....
కైరాన్ నియోజకవర్గ చరిత్రలో 1998లో బీజేపీ ఇక్కడ విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోడీ గాలిలో మాత్రమే గెలిచింది. నాటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హుకుంసింగ్ 2,36,628 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. ఆయనకు 5,65,909 ఓట్లు రాగా, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి 3,29,081 ఓట్లు రాగా, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థికి 1,60,414 ఓట్లు లభించాయి. ఈ ఓట్ల వివరాలను చూస్తే కమలనాధులను కట్టడి చేయడం అంతకష్టం ఏమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే గెలుపు అసాధ్యమేమీ కాదు. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కలిపి దగ్గదగ్గరగా అయిదు లక్షల ఓట్లు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని, విపక్ష ఓట్లు చీలకుండా చూసుకుంటే విజయానికి చేరువ అయినట్లే. షమ్లీ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో జాట్, ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంకు ఎక్కువ. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు బలం ఎక్కువ. అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ గతంలో ఇక్కడ గెలిచింది. జాట్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా ఉంది. చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఈ సామాజిక వర్గం మద్దతుతోనే మనుగడ సాగిస్తున్నారు. కైరానా, నకుర్, షమి, ధాన, భవన్, గంగోష్ అసెంబ్లీ స్థానాలు ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. హుకుం సింగ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన సానుభూతిని సొమ్ము చేసుకుని విజయతీరాలకు చేరాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ఆయన కూతురు మృంగన్ సింగ్ ను బరిలోకి దించాలని ఆలోచిస్తోంది. గోరఖ్ పూర్, ఫూల్ పూర్ చేదు అనుభవాల నేపథ్యంలో పకడ్బందీగా వ్యవహరించాలని అధినాయకత్వం శ్రేణులను ఆదేశించింది. 1998లో బీజేపీ, 1999, 2004ల్లో రాష్ట్రీయ లోక్ దళ్, 2009లో బీఎస్పీ, 2014లో బీజేపీ ఇక్కడ విజయకేతనం ఎగురవేశాయి. దీనిని బట్టి చూస్తే కైరానా కమలనాధులకు కంచుకోట కాదన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే వారికి గుబులు కలిగిస్తోంది.
ఇది కూడా కష్టమే....
బిజ్నూర్ జిల్లాలోని నూర్ పూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా బీజేపీ శ్రేణుల్లో భయం కల్గిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి లోకేంద్రసింగ్ 79,172 ఓట్లు సాధించి విజయకేతనం ఎగురవేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి గోషర్ ఇక్బాల్ 66,463 ఓట్లు సాధించారు. ఫిబ్రవరి 21న లక్నోలో జరుగుతున్న పెట్టుబడి దారుల సదస్సుకు హాజరయ్యేందుకు వెళుతున్న లోకేంద్ర సింగ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ వేర్వేరుగా పోటీ చేసి ఓడిపోయాయి. ఈ దఫా ఉమ్మడిగా పోటీ చేస్తే బీజేపీని నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదన్నది నాటి భావన. పంజాబ్ లోని గురుదాస్ పూర్, రాజస్థాన్ లోని అజ్మీర్, ఆల్వార్, తాజాగా యూపీలోని గొరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీజేపీ తాజా ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. అయినా ఫలితం ఎలా ఉంటుందోనన్న భయం వారికి లేకపోలేదు.
-ఎడిటోరియల్ డెస్క్

