మోడీకి తలెగరేస్తాయా? తోకాడిస్తాయా?

లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలంటూ మళ్లీ బీజేపీ చర్చను మొదలు పెట్టింది. ఈ సారి ఏకంగా రాష్ట్రపతి ప్రసంగంలోనే ప్రస్తావన తెచ్చిపెట్టింది. సీరియస్ గానే ఈ విషయంపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీఏ మిత్రపక్షాలన్నిటినీ దాదాపు ఈ విషయంలో ఒప్పించినట్లుగానే చెప్పాలి. శివసేన వంటి పక్షాలు విభేదించినా అది ఒంటరి స్వరమే అవుతుంది. తెలుగుదేశం పార్టీకి ఎటూ ఇబ్బంది లేదు. లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు 1999 నుంచి కలిసే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వంటి విపక్ష పార్టీలకూ పెద్దగా అభ్యంతరాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఎన్నికలు జరపడానికి ఏకాభిప్రాయం సాధించాలనే దిశలో బీజేపీ వ్యూహరచన చేస్తోంది. సైద్దాంతికంగా బీజేపీని వ్యతిరేకించే వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలను అన్నిటినీ ఒప్పించవచ్చని మోడీ, అమిత్ షా భావిస్తున్నారు. ఏకకాలంలో ఉమ్మడిగా ఎన్నికలు ఎందుకు జరపాలనే విషయమై సమర్థమైన వాదననే బీజేపీ సిద్ధం చేసింది. దీనిని వ్యతిరేకించడం కూడా కష్టసాధ్యమే. అభివృద్ధి స్తంభించిపోవడం , ఎన్నికల వ్యయం, ప్రభుత్వ కార్యకలాపాలు కుంటుపడటం వంటి కారణాలు చూపిస్తున్నారు. ఇందులో రాజకీయప్రయోజనాలు ముడిపడి ఉండటమూ ముఖ్యకారణమే. 2019 నాటికి దేశ వ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధించి ఎన్నికలు జరిపే వాతావరణం కనిపించడం లేదు. 2019 లో కూడా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ విజయం సాధిస్తే కచ్చితంగా 2024 నాటికి ఏకకాల ఉమ్మడి ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రెండిందాలా లాభం....
వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెసు, ప్రాంతీయపార్టీలు ఉమ్మడి ఎన్నికలను తీవ్రంగా ప్రతిఘటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ అజెండా ప్రజలను ప్రభావితం చేస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రాంతీయపార్టీలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే కొన్ని లాభాలు లేకపోలేదు. ఏటా సగటున అయిదారు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. దేశ ప్రయోజనాల రీత్యా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఆటంకంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పు ఫైనల్. అసెంబ్లీ ఎన్నికలను సైతం కేంద్రంలో అధికారంలోఉన్న పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోక తప్పని పరిస్థితి. దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కనపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు , ప్రజాకర్షక విధానాలకు పెద్దపీట వేయకతప్పడం లేదు. అంతేకాకుండా ప్రధాని సహా కేంద్రమంత్రులందరూ దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఎన్నిక అనేది పార్టీలకే పరిమితం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ లో భాగమైన ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాల్సి వస్తోంది. తమ పాలనపై తీర్పుగా భావించాల్సి వస్తోంది. దీంతో సంస్కరణలకు సంబంధించిన విషయాలు, ఆర్థికానికి సంబంధించి కొంత కఠిన వైఖరిని పక్కనపెట్టాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అయిదేళ్లపాలనకు ప్రజాతీర్పు వచ్చినప్పటికీ ఏ ఏటికాయేడు ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ పాలనకు రిఫరెండంగానే కేంద్రంలోని అధికార పార్టీ భావించక తప్పడం లేదు. ఈ బెడద వదిలించుకోవడానికే మోడీ,అమిత్ షా ఏక కాల ఎన్నికల అజెండాను పైకి తెచ్చి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. సామదానభేదోపాయాల ద్వారా అన్ని పక్షాలనూ ఇందుకు మమ అనిపించే దిశలో గట్టి కసరత్తు చేస్తున్నారు. కేంద్రం దీర్ఘకాలిక వ్యూహంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మాటిమాటికీ రాజకీయ అజెండాతో ప్రజాకర్షక విధానాలకు లొంగిపోకుండా ఉండటానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయనేది రాజకీయపరిశీలకులు కూడా అంగీకరిస్తున్న సత్యం.
మూడిందాలా ముప్పు....
భారతదేశం సమాఖ్య వ్యవస్థ. భిన్నమైన సంస్కృతులు, భాషలు, రాష్ట్రాలే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షల్లో కూడా వైరుద్ధ్యం వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే దేశ సమగ్రత సాధ్యమవుతోంది. జాతీయ అజెండా ప్రధానంగా ప్రభావితం చేసినప్పుడు స్థానిక ఆకాంక్షలు దెబ్బతింటాయి. పైపెచ్చు జాతీయ పార్టీలు శాసిస్తూ పోతే అణిచివేత మొదలవుతుంది. భాష, ప్రాంతీయ సమతుల్యత కు నష్టం వాటిల్లుతుంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సమైక్య భావనతో ప్రజల్ని ఏకం చేసిన కాంగ్రెసు పార్టీ తొలి రెండు దశాబ్దాలు ఏకచ్ఛత్రాధిపత్యంతో దేశాన్ని పరిపాలించగలిగింది. కానీ జాతీయ ఆధిపత్య ధోరణితో ప్రాంతీయపార్టీలు పురుడు పోసుకోవడానికి కారణమైంది. ఆతర్వాత కాలంలో కేంద్రంలో సంకీర్ణయుగం మొదలైంది. కేంద్రంలో అధికారం సాధించాలంటే ప్రాంతీయ పార్టీల అండ తప్పనిసరి అవసరంగా మారింది. రాష్ట్రాల్లోనూ అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. దీనివల్ల కేంద్రం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొనే నియంత్రుత్వ ధోరణికి చరమగీతం పాడగలిగారు. ప్రాంతాల అభివ్రుద్ధికి, రాష్ట్రాల డిమాండ్లకు ప్రాధాన్యం వచ్చింది. మళ్లీ జాతీయ పార్టీ, అందులోనూ మోడీ వంటి బలమైన నాయకుడు జాతీయ రాజకీయాలను ఒంటిచేతిపై శాసించగలిగే స్థితి జమిలీ ఎన్నికల కారణంగా ఏర్పడితే నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సాధించుకున్న ప్రాబల్యం కనుమరుగై పోతుంది. భాష, ప్రాంతాలపై కేంద్రం పెత్తనం స్థిరపడుతుంది. ఇది అశాంతికి , ఉద్యమాలకు కూడా కారణం కావచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఉండాలి. కానీ అయిదేళ్ల వరకూ తిరిగి చూడాల్సిన పనిలేదన్న భరోసా నాయకుల్లో సోమరిపోతు తనానికి, అవినీతికి కూడా కారణమవుతుంది. ప్రజారంజకమైన పాలనకు బదులు నియంతృత్వ ధోరణితో నిండా ముంచేసే ప్రమాదం ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వెలువడే ప్రజాభిప్రాయం అధికార,విపక్షాల బలాబలాలను బ్యాలెన్సు చేస్తుంటుంది. దీనివల్ల రాజకీయ సంతులనం సాధ్యమవుతుంది. ఒకేసారి ఎన్నికలంటే చెక్స్ అండ్ బ్యాలెన్సె్స్ లేని అరాచక వాతావరణం కూడా ఏర్పడుతుంది. అన్నిటికంటే అతి ప్రమాదకరమైన అంశం ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినే అవకాశం ఉండటమే. సాధారణంగా జాతీయ పార్టీలు వివిధ రూపాల్లో ప్రాంతీయ పార్టీలను కబళించే ప్రయత్నాలు చేస్తుంటాయి. పదవులు ఎరవేస్తుంటాయి. జాతీయ నేర పరిశోధక సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రాంతీయ పార్టీల నాయకులను నియంత్రిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఎన్నికలు మొదలైతే ఈ ధోరణి మరింతగా విజృభిస్తుంది.
2019 లోనే దిశానిర్దేశం...
జమిలి ఎన్నికలపై తాజాగా చర్చ మొదలైంది. అయితే పూర్తిగా దీనిపై ఏకాభిప్రాయ సాధన అంత సులభంగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో మోడీ మరోసారి తన ప్రజాకర్షణను నిరూపించుకుని బలమైన శక్తిగా ఆవిర్భవిస్తే ఉమ్మడి ఎన్నికల కల సాకారమవుతుంది. పరిస్థితులు అనుకూలించక కేంద్రంలో అధికారం కోసం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తే మాత్రం జమిలీ ఎన్నికలు చర్చలతోనే సమసి పోతాయి. పిల్లిమెడలో గంట కట్టేశారు. దానిని ఊరూరా మోగించి ఏకరాగాలాపన చేసేలా చూడాల్సిన బాధ్యత మోడీపై పడింది. టైమ్ బాగాలేదు కాబట్టి ఎన్డీఏ పక్షాలు మోడీ అభిప్రాయాలకు తల ఊపుతున్నాయి. తోకాడిస్తున్నాయి. మోడీ హవా తగ్గితే సొంత అభిప్రాయాలతో తాము బలపడేందుకు ప్రయత్నిస్తాయి. ఉమ్మడి ఎన్నికలు జాన్తానై అని ఎదురుతిరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్

