పాహిమాం పాక్ ప్రభో...!

ఆడలేక మద్దెల ఓడు అని తెలుగులో నానుడి. అచ్చంగా అలాగే ఉంది గుజరాత్ లో బీజేపీ పద్ధతి. గెలుపు కోసం పాకిస్థాన్ జపం పఠిస్తోంది. బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టి గుజరాత్ లో ప్రభుత్వాన్ని మార్చడానికి పాకిస్థాన్ లో కుట్ర జరుగుతోందన్నట్లుగా ప్రచారం మొదలెట్టేశారు. ఇందుకు కాంగ్రెసు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందంటూ వదంతులను వ్యాపింపచేస్తున్నారు. మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ ను కూడా ఈ వివాదంలోకి లాగుతూ రచ్చ మొదలు పెట్టారు. నిజానికి గుజరాత్ ఎన్నికలను ప్రభావితం చేసేంత సామర్థ్యం పాకిస్థాన్ కు ఉందా? మన్మోహన్ వంటి నిష్కళంక వ్యక్తి పై బురద జల్లడం సమంజసమా? వంటి హేతుబద్ధమైన అంశాలను పక్కన పెట్టేసి కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా గురి పెట్టేశారు. ఒక పార్టీగా బీజేపీ ఎటువంటి వ్యూహాలు,ఎత్తుగడలను అయినా అనుసరించవచ్చు. మతపరమైన అంశాలతో సమీకరణలు చేసుకున్నాఆ పార్టీ సిద్ధాంతంగా సరిపుచ్చుకోవచ్చు. కానీ ప్రధాని పీఠంపై ఉన్న మోడీయే ఇందుకు సంబంధించి ప్రధాన ప్రచారకర్తగా మారడమే విచారకరం. దీర్ఘకాల దేశప్రయోజనాలు, ప్రజాస్వామ్య రాజకీయాలపై ఇది పెను ప్రభావాన్ని చూపుతుంది. ఒక చెడు సంకేతానికి తొలి అడుగుగా మారుతుంది.
పాక్ బూచి ..పరాన్న రాజకీయం...
ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులను విమర్శించడం, తాము చేసినపనిని చెప్పుకోవడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలి. లేదంటే తాము ఏంచేయదలిచామో చెప్పడం ద్వారా ప్రజావిశ్వాసంతో అధికారంలోకి రావాలి. కానీ గుజరాత్ లో కొలబద్దలు మారుతున్నాయి. 22 సంవత్సరాలుగా అధికారంలో నిరవధికంగా కొనసాగుతోంది బీజేపీ. అంటే ఇప్పటికే ఆపార్టీకి సంబంధించి విధివిధానాలు, పనితీరుపై ప్రజల్లో పూర్తి అవగాహన ఏర్పడి ఉంటుంది. అభివృద్ధి, ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యదక్షతపై ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడి ఉంటుంది. అయిదేళ్లకోసారి ప్రభుత్వాలను మార్చేస్తున్న కాలంలో అంతదీర్ఘకాలం సర్కారు కొనసాగిందంటేనే ఒక రకమైన భరోసాగా చూడాలి. ప్రజలకు ఏమీ చెప్పాల్సిన పనిలేదు. చేసిన పని చూసి మమ్మల్నే కొనసాగించండి అని అభ్యర్థించే స్థాయి ఆత్మస్థైర్యాన్ని బీజేపీ ఇప్పటికే సంతరించుకుని ఉండాలి.కానీ జరుగుతున్నది వేరు.
పాక్ ప్రస్తావన ఎందుకు...?
పాకిస్తాన్ ను బూచిగా చూపి రాష్ట్రంలో పునరధికారం కోసం పాలకపక్షం ఎత్తుగడలు వేస్తోంది. స్టార్ క్యాంపెయినర్ అయిన ప్రధాని మోడీ తనను తాను కుదించుకుని ఒక ప్రాంతీయ నేతగా మారిపోయారు. భారత్ తో ఏరకంగానూ సరిపోని పొరుగు దేశాన్ని కాంగ్రెసుతో ముడిపెట్టి పక్తు పాలిటిక్స్ నడపాలనుకుంటున్నారు. నిజానికి ప్రధాని ఒక పార్టీ అధ్యక్షుడు కాదు. దేశం మొత్తానికి ప్రతినిధి. రాజకీయ ప్రచారం విషయంలోనూ కచ్చితంగా కొన్ని కనీస ప్రమాణాలు పాటించాలి. దేశ రక్షణ, విదేశాంగ విధానం, దౌత్యసంబంధాలు దెబ్బతినేలా మాట్టాడకూడదు. ప్రధాని రాజకీయ వేత్త అయినప్పటికీ అంతిమంగా పార్టీకంటే దేశప్రయోజనాలకే పెద్ద పీట వేయాలి. ఇతర దేశాలపై విమర్శలు, ఆరోపణలు గుప్పించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పటికిప్పుడు పబ్బం గడుపుకునేలా ప్రవర్తించకూడదు. ఇటువంటి సందర్భాల్లో రాజకీయంగా కొన్ని సార్లు నష్టం వాటిల్లినా భరించాలి. గుజరాత్ లో బీజేపీ ఓడిపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వమూ కూలిపోదు. తన విధానాలను సమీక్షించుకునేందుకు ప్రధానికి అరుదైన అవకాశం దక్కుతుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రజామనోగతాన్ని, పార్టీలో పెద్దల అభిప్రాయాలను క్రోడీకరించుకుంటూ 2019 ఎన్నికలకు వెళ్లేందుకు పరిణతి లభిస్తుంది.
శిఖర సమానులు చిన్నబోయేలా...
రాజనీతిజ్ఝులెందరో ప్రధానులుగా పాలించిన దేశం మనది. తమదైన దౌత్యనీతి, శాంతికాముకత, లౌకికతత్వంతో ప్రపంచంలోనే భారతదేశానికి మంచి పేరు తెచ్చిపెట్టారు. ప్రథమ ప్రధాని నెహ్రూ అంటే వివిధ దేశాల్లో ఎంతగానో గౌరవాభిమానాలు ఉండేవి. ప్రజాస్వామ్య విలువలకు కూడా ఆయన పెట్టింది పేరు. మొరార్జీ దేశాయ్ భారతరత్నతోపాటు పాకిస్తాన్ లో అత్యున్నత పౌరపురస్కారమైన నిషాన్ ఏ పాకిస్థాన్ ను కూడా అందుకున్నారు. వాజపేయి తన హయాంలో సైనిక నియంత పర్వేజ్ ముషారప్ ప్రశంసలు సైతం అందుకోగలిగారు. వీరెవరూ తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ప్రధాని పదవి ప్రమాణాలు పడిపోయేలా ప్రసంగించిన ఉదంతాలు లేవు. వాజపేయి వంటి వారు విలువల కోసం ప్రధాని పదవినే త్యజించేందుకు సిద్ధపడిన సందర్బాలున్నాయి. దార్శనికత, దేశ దీర్ఘకాల ప్రయోజనాల పరిరక్షణ ప్రధాని బాధ్యత లో ఉన్న వారి ప్రథమ కర్తవ్యం. దేశంపైనా, పార్టీపైన బలమైన నాయకునిగా ముద్ర వేసిన మోడీ కేవలం ఒక రాష్ట్ర ఎన్నిక కోసం తన స్థాయిని, హోదాను మరిచి మళ్లీ మతాన్ని, పాక్ భూతాన్ని ఆశ్రయించడం దురదృష్టకరం. పన్నెండు సంవత్సరాల పాటు తాను పాలించిన రాష్ట్రంలో బీజేపీ చెప్పుకునేందుకు ఏమీ లేదా? అన్నట్లుగా ప్రచార పర్వం చివరి ఘట్టంలో మతం చిచ్చును మళ్లీ రాజేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల గండం నుంచి పాకిస్తాన్ వ్యతిరేకతే తమను గట్టెక్కించాలన్నట్లుగా ఉంది ధోరణి. అవసరార్థం శత్రువే తమకు రాజకీయాల్లో రహస్య మిత్రునిగా మారతారంటే ఆశ్చర్య పోనవసరం లేదు. పాకిస్థాన్ వ్యతిరేకత బీజేపీకి ఓట్లు కురిపించే వరదాయినిగా మారిందో లేదో ఎన్నికల ఫలితాలే తేల్చాలి.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- మోడీ

