దావోస్ తో దశ మారుతుందా?

దావోస్... స్విట్జర్లాండ్ లోని చిన్న పట్టణం గురించి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు సుపరిచితమే. కార్పొరేట్ తరహా రాజకీయ నేతలకు కూడా ఈ పట్టణం చిరపరిచితం. సుమారు 11వేల జనాభా గల ఈ పట్టణంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఏటా డిసెంబరులో ప్రపంచ కుబేరులు, పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రులతో విస్తృత సమావేశం నిర్వహిస్తుంది. 1971 నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఇప్పటి వరకూ 14 సార్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ దఫా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా వెళ్లారు. ఇక పారిశ్రామిక దిగ్గజాల సంగతి సరేసరి. తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ దోవోస్ వేదికగా భారతీయ వాణిని విన్పించారు. 1997లో నాటి భారత ప్రధాని దేవెగౌడ తర్వాత ఏ ప్రధాని దావోస్ పై అంతగా ఆసక్తి చూపలేదు. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ కూడా పదేళ్ల పదవీ కాలంలో దావోస్ వెళ్లలేదు. మొదటి దఫా పదవీకాలంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వామపక్షాల వత్తిడి కారణంగానే మన్మోహన్ దావోస్ కు దూరంగా ఉన్నారనే వాదన ఉంది. కాని రెండో దఫా పదవీకాలంలో కూడా మన్మోహన్ దృష్టి పెట్టలేదు. రెండో దఫా వామపక్షాల మద్దతు లేకుండానే యూపీఏ ప్రభుత్వం నడవటం గమనార్హం.
పెట్టుబడులు ప్రవహిస్తాయా....?
దీన్నిబట్టి చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం దావోస్ వెళ్లివచ్చినంత మాత్రానే ఒక్కసారిగా పెట్టుబడులు ప్రవహించవు. పరిశ్రమలు వచ్చి వాలిపోవు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సార్లు ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొన్నట్లు స్వయంగా వెల్లడించారు. అంతమాత్రాన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పటి ఏపీలో పరిశ్రమలు వెల్లువలా రాలేదు. ఏవో ఒప్పందాలు కుదరడమూ... పరిశ్రమల స్థాపనకు సంస్థలు ముందుకు రావడమూ... సంసిద్ధత కనబర్చడమూ జరుగుతుంది. అంతకు మించి అడుగు ముందుకు పడదు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు, రాజకీయ స్థిరత్వం, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టుబడుదారులు ముందుకు వస్తారు. ఇవి లేనప్పుడు మాటలకే పరిమితమవుతారు. చేతలకు రారు పారిశ్రామిక వేత్తలు. ఇది వాస్తవం. ఏ పారిశ్రామిక వేత్తా ప్రజాసంక్షేమం కోసం పరిశ్రమలు పెట్టరు. లాభం కోసమే చేస్తారు. ఈ వాస్తవాన్ని విస్మరించడమంటే ఆత్మ వంచన చేసుకోవడమే. నేలవిడిచి సాము చేయడమే.
ఎన్నో సంస్థలు ఆసక్తి.....
ఈ దఫా పర్యటనలో కూడా చంద్రబాబు ఎప్పటిలాగానే పారిశ్రామిక దిగ్గజాలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈనెల 21 నుంచి నాలుగు రోజుల పాటు అక్కడే గడిపారు. వేదాంత గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సౌదీ అరమ్ కో అనే సంస్థ కాకినాడ లేదా కృష్ణపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది. మైండ్ స్పేస్ కేంద్రాల ఏర్పాటుకు రహేజా సంస్థ సంసిద్ధత చూపింది. జ్యూరిక్ సిస్టర్ స్టేట్, మెడ్ టెక్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. హిటాచీ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఆలీబాబా క్లౌడ్ సెంటర్ కు ఆ సంస్థ ముందుకు వచ్చింది. మరికొన్ని సంస్థలతో కూడా చర్చలు జరిపారు చంద్రబాబు. తాజా ఫలితాలు తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు. ఇవన్నీ కార్యాచరణలోకి రావడం అంత తేలిక కాదు.
భవిష్యత్తులోనైనా వస్తాయా?
ఇక తెలంగాణ సర్కార్ కూడా తన ప్రతినిధిగా మంత్రి కేటీఆర్ ను పంపింది. వైమానిక రంగంలో లాకిడ్ మార్టిన్, ఎయిర్ ఏసియా ఔషధ రంగంలో నోవార్టిస్, ఫైజర్, ఐటీలో హెచ్.పి, సేల్స్ ఫోర్ వంటి సంస్థలు, హిటాచీ, మిత్సుబిషీ, ఎరిక్సన్ వంటి వాహన, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. ఇండోరమా వెంచర్స్ అనే జౌళి ఉత్పత్తి సంస్థ వరంగల్ లో పరిశ్రమ స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. టెక్ మహేంద్రా వరంగల్ లో ఐటీ కాంపెనీ స్థాపనకు ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు విస్తరించేందుకు ఆసక్తి చూపాయి. అదనపు పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రదాని మోడీ ఒక్కరోజు పర్యటనలో ఊపిరి సలపని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రసంగాలు, చర్చలు, సంప్రదింపులతో క్షణం తీరిక లేకుండా గడిపారు. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోడీ దావోస్ వెళ్లారు. కేవలంల ఒకటి రెండు పర్యటనలతోనే అంతా అయిపోదు. పెట్టుబడులు తరలి రావు. పారిశ్రామికవేత్తలు క్యూ కట్టరు. ఇలాంటి సమావేశాల వల్ల వివిధ రంగాల ప్రముఖులను కలిసే అవకాశం కలుగుతుంది. మనదేశం, రాష్ట్రాల్లోని అనుకూల పరిస్థితులను వివరించే వీలుంటుంది. దేశాల పరంగా, రాష్ట్రాల పరంగా వ్యక్తిగతంగా నాయకుల మధ్య సంబంధాలు బలపడతాయి. ప్రపంచవ్యాప్తంగా గల అవకాశాలు, సానుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. తద్వారా వెనువెంటనే కాకపోయినా... భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఏర్పడతాయి.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- దావోస్ పర్యటన

