తొగాడియా...మోడీకి చెడింది ఇందుకేనా...?

ప్రవీణ్ తొగాడియా... పరిచయం అక్కరలేని పేరు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన గురించి తెలియని వారుండరు. కరడుగట్టిన హిందుత్వ వాది. హిందుత్వను శ్వాసగా భావించిన నాయకుడు. తొగాడియా కేవలంల హిందుత్వ వాది మాత్రమే కాదు. ఆయన గురించి చాలా మందికి తెలియని మరో కోణం ఉంది. తొగాడియా ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు. వేల సంఖ్యలో క్యాన్సర్ ఆపరేషన్లు చేసి రోగుల ప్రాణాలను కాపాడిన వ్యక్తి. ఎంబీబీఎస్ తో పాటు ఎంఎస్ కూడా పూర్తి చేసిన అనుభవజ్ఞుడు. న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించిన ఘనాపాటి. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నిత్యం వార్తల్లో ఉంటారు తొగాడియా. రెచ్చగొట్టే ప్రకటనలతో ముస్లింలు, ఇతర మైనారిటీల ఆగ్రహానికి గురయ్యే వ్యక్తి. అదే సమయంలో హిందువుల అభిమాన నాయకుడు కూడా. వి.హెచ్.పి. అంతర్జాతీయ నేతగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల నుంచి అగ్రతాంబూలం అందుకున్న వ్యక్తి ఇప్పుడు బేలగా కన్పిస్తున్నారు. ఒకప్పుడు తన రెచ్చగొట్టే ప్రకటనలతో వార్తల్లో ఉండే నాయకుడు తనకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందుతున్నాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలో లేని సమయంలో కూడా పోలీసులకు భయపడని వ్యక్తి. ఇప్పుడు వారంటే ఉలిక్కిపడుతున్నారు. తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. తనను ఎన్ కౌంటర్ చేసేందుకు సొంత బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. గతంలో పార్టీ శ్రేణుల కోసం పరితపించిన నాయకుడు. ఇప్పుడు అదే పార్టీ నుంచి నిరాదరణను ఎదుర్కొంటున్నారు. రాజకీయ వైచిత్రి అంటే ఇదేనేమో. ఒక్కసారి తొగాడియా ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. గతంలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ రాసుకుపూసుకు తిరిగిన ఈ నాయకుడు ఈ దుస్థితికి చేరుకోవడానికి దారి తీసిన పరిస్థితులు అత్యంత ఆసక్తికరం.
హిందూరాజ్యం చేయాలన్న డిమాండ్....
తొగాడియా 1956 డిసెంబర్ 12న గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జన్మించారు. పదో ఏటనే ఆర్ఎస్ఎస్ ప్రభావానికి లోనయ్యారు. ఎంబీబీఎస్ తో పాటు ఎంఎస్ చేసిన తొగాడియా ప్రముఖ క్యాన్సర్ వైద్యుడంటే ఆశ్చర్యకలగక మానదు. పదివేలకు పైగా ఆపరేషన్లు చేసిన ఘన చరిత్ర ఆయనది. అహ్మదాబాద్ లో వైద్యశాలను స్థాపించి సేవలందించారు. ఇప్పటికీ ఓపీ విభాగంలో సేవలందిస్తుంటారు. న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించారు. 80వ దశకంలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, ఆయన మంచి స్నేహితులు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసేటప్పుడు వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. 80వ దశకంలో శంకర్ సింహ్ వాఘేలా నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అప్పట్లో తొగాడియా విడుదలకు నరేంద్ర మోడీ పోరాడారు. 2001లో మోడీ ముఖ్యమంత్రి అయ్యాక వారి మధ్య బంధం మరింత బలపడింది. కాలక్రమంలో విభేదాలు ఏర్పడ్డాయి. ముస్లింలపై విపరీత వ్యాఖ్యలు, గుజరాత్ ను హిందూరాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్ తదితర అంశాల కారణంగా వారి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. మోడీ ప్రధాని కాకముందు, ప్రధాని అయిన తర్వాత విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా పదిహేడేళ్ల నాటి ఒక కేసులో న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తొగాడియా అనేక ఎత్తులు వేశారు. 2002లో రాజస్థాన్ లోని గంగావూర్ లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం పలుమార్లు నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చేసింది.
తొగాడియాను నియంత్రించే పనిలో.....
ఈనెల8న వారెంట్ జారీ చేయడంతో రాజస్థాన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు అహ్మదాబాద్ వచ్చారు. తనను ఎన్ కౌంటర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న తొగాడియా ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. జడ్ ప్లస్ భద్రత కలిగిన తొగాడియాను ఎన్ కౌంటర్ చేయడం ఎలా సాధ్యమన్న అహ్మదాబాద్ పోలీసుల వాదనను తోసిపుచ్చలేం. తొగాడియా పట్ల సంఘ్ పరివార్ కూడా అసంతృప్తిగా ఉంది. తొగాడియాను త్వరలో పదవి నుంచి తొలగించడం తధ్యమన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఆయన పట్ల కొందరు నాయకులు, కార్యకర్తలు సానుకూలంగా ఉన్నప్పటికీ వారి సంఖ్య నామమాత్రమే. ప్రధాని మోడీ తో తనకు విభేదాలు లేవని, అయితే భిన్నాభిప్రాయాలున్నాయని తొగాడియా చెబుతున్నారు. మోడీ పరిపాలనపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ బాగానే ఉన్నప్పటికీ ఉపాథి అవకాశాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని అంటున్నారు. బీజేపీ దాని అనుబంధ సంస్థల్లో పరిస్థితి బాగాలేదనడానికి తొగాడియా ఉదంతం నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి హేమాహేమీలను పక్కన పెట్టిన మోడీకి తొగాడియా వంటి నాయకుడిని నియంత్రించడం చాలా తేలికైన పని. ప్రస్తుతం ఆపనిలోనే ఉన్నారు ప్రధాని మోడీ.
-ఎడిటోరియల్ డెస్క్

