తనవాడైతే... మోడీ... ఎంతకైనా వెనుకాడరా?

సీబీఐ... కేంద్ర దర్యాప్తు సంస్థ. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇది. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా, రాజకీయనాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చినా, ప్రతి రాజకీయ పార్టీ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. ఆ సంస్థ నిజాయితీ, సమర్ధతపై విశ్వాసమే ఇందుకు కారణం. అలాంటి సంస్థల అధిపతులు సచ్ఛరితులై ఉండాలని, వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలని, నిజాయితి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజలు ఆశిస్తారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ దర్యాప్తు సంస్థల అధిపతుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం అలా వ్యవహరిస్తుందా అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విషయమై దుమ్మెత్తి పోసిన కమలనాధులు ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నట్లు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా సీబీఐ అదనపు డైరెక్టర్ రాకేష్ ఆస్తానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ గా పదోన్నతి కల్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తానా 1984 ఐపీఎస్ బ్యాచ్. గుజరాత్ క్యాడర్ అధికారి. సీబీఐలో అత్యంత సీనియర్. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తర్వాత ఆయనే అత్యంత సీనియర్ అధికారి. ఆయన సమర్ధతపై కూడా ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఆస్తానాతో పాటు మరో 8 మంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆస్తానా అత్యంత కీలకమైన కేసుల దర్యాప్తునకు సారధిగా ఉన్నారు. లిక్కర్ డాన్ విజయ్ మాల్యా బ్యాంకు బకాయిల ఎగవేత, అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణాలపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్) నాయకత్వం వహిస్తున్నారు.
ఆరోపణలున్నప్పటికీ.....
ఆస్తానాపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకంపై స్వయంగా విజిలెన్స్ కమిషన్ అభ్యంతరాలను వ్యక్తం చేసినా ఎలా పదోన్నతి కల్పించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాశ్మీర్ పై చర్చలకు ప్రత్యేక దూతగా దినేశ్వర్ శర్మ నియామకాన్ని వెల్లడించేందుకు నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై విలేకరుల ప్రశ్నకలకు సమాధానాలు ఇచ్చేందుకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తడబడ్డారు. అనంతరం సమాధానాన్ని దాట వేశారు. ఈ సమావేశం కాశ్మీర్ చర్చలకు సంబంధించిందని, అందువల్ల ఇతర అంశాలను ప్రస్తావించరాదని స్వయంగా రాజ్ నాథ్ సింగ్ కోరారు. ప్రభుత్వం ఎంత ఆత్మరక్షణలో పడిందో ఈ విషయం చెప్పకనే చెబుతుంది. తన శాఖకు సంబంధించిన అధికారి పదోన్నతిలో సమాధానాన్ని చెప్పేందుకు నిరాకరించడం, దాట వేయడం, తడబడటం చూస్తుంటే ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు కలగక మానవు. నిజంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించినట్లయితే మంత్రి సమాధానాన్ని దాట వేయాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ లబ్ది లేనట్లయితే ఆస్తానా పదోన్నతి పై వివరణ ఎందుకు ఇవ్వలేకపోతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయన గుజరాత్ కేడర్ అధికారి కావడమా? లేక వివిధ కేసుల నుంచి తమ అనుయాయులకు లబ్ది చేకూర్చడానికేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
విజిలెన్స్ కమిషనర్ అభ్యంతరం తెలిపినా....
ఆస్తానా పదోన్నతిపై స్వయంగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.చౌదరి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలలు ఉన్నాయని పేర్కొన్నారు. లాలూ పశుదాణా కుంభకోణాన్ని విచారించిన ఆస్తానాపై ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి. స్టెర్లింగ్ బయోటిక్ కుంభకోణానికి సంబంధించిన డెయిరీల్లో ఆస్తానా పేరు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్వయంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ సంస్థ అయితే....ఎవరిపై అయితే... కేసు నమోదు చేసిందో... ఆ అధికారే ఆ సంస్థకు అత్యున్నత అధికారి కావడం ఎంతవరకూ సమర్థనీయం? తమ అధికారిపై నమోదైన కేసును ఆ సంస్థ ఎలా ముందుకు తీసుకుపోతుంది? అసలు ఈ విషయం తెలిసి కేంద్రం ఆయనకు ఎలా పదోన్నతి కల్పించింది? ఏ రాజకీయ లబ్ది లేకుండానే కేంద్ర ఎలా చొరవ తీసుకుంటుంది? స్వయంగా విజిలెన్స్ కమిషనర్ వద్దన్నా... ఎందుకు బేఖాతరు చేసిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవ్వక మానవు. గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటిక్ కంపెనీ నుంచి ముగ్గురు ఆదాయపు పన్ను శాఖ ముడుపులు తీసుకున్నారంటూ ఆగస్టు 30న సీబీఐ స్వయంగా కేసు నమోదు చేసింది. కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఆదాయపుపన్ను, పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు ఎంత ముడుపులు ఇచ్చిందీ? వీటిల్లో ఉన్నాయి. ఇందులో ఆస్తానా పేరు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కే.ఆర్. చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఆరోపణలు వచ్చినప్పుడు.....
2014లో ఇలాంటి ఆరోపణలు కారణంగానే సీబీఐ అడిషనల్ డైరెక్టర్ గా అర్చనా రామ సుందరం నియామకాన్ని చీఫ్ విజిలెన్స్ కమిషన్ కొట్టివేసింది. ఆమె మహిళా ఐపీఎస్ అధికారి. అయినప్పటికీ అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అర్చననునియమించారు. అనంతరం ఆమె నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గుర్తుచేస్తున్నారు. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలతరుపు వాదంచే న్యాయవాదిగా న్యాయవాద వర్గాల్లో ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు రాకేష్ ఆస్తానా అనుచిత పదోన్నతిని కూడా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు ఆయన చెబుతున్నారు. గతంలో ఆస్తానా కు సీబీఐ తాత్కాలిక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కూడా భూషణ్ కోర్టుకెళ్లారు. ప్రభుత్వాలు పక్కదారి పట్టినప్పుడు దానిని ఎవరో ఒకరు, ఏదో ఒక రూపంలో సవాల్ చేయడం పౌరసంఘాల బాధ్యత. ఈ దిశగా ప్రశాంత్ భూషణ్ చేస్తున్న కృషి అభినందనీయం.
- ఎడిటోరియల్ డెస్క్
- Tags
- ఆస్తానా...సీబీఐ

