జగన్ అక్కడ లీడర్ ఎవరు?

నాయకుడు సూర్యుడు లాంటివాడు. చుట్టూ ఉన్న గ్రహాలు, మండలాలకు కేంద్రం తనే అయినా సొంత అస్తిత్వంతో అవన్నీ ప్రకాశించేందుకు అవకాశం కల్పిస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర రివర్స్ గేర్ లో సాగుతోంది. గతంలో ఏపీలో నిర్వహించిన పాదయాత్రల్లో 2003లో వై.ఎస్.నిర్వహించిన పాదయాత్ర, 2013లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన పాదయాత్ర చాలా ముఖ్యమైనవి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు పట్టం గట్టడంతోపాటు వ్యక్తులుగా వారికి ఈ పాదయాత్రలతో సర్వజనామోదం లభించింది. 2019 అధికార పీఠం లక్ష్యంగా జగన్ చేపట్టిన పాదయాత్ర విస్తృత శ్రేణుల్లో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రభుత్వ అక్రమాలను సైతం బాగానే దుయ్యబట్టగలుగుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేయదలచుకున్నామో వర్గాలవారీగా వివరిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పాదయాత్ర అయిపోయిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో లభించిన స్పందనను కన్సాలిడేట్ చేసి ఓట్ల వరకూ తీసుకురావాల్సిన నియోజకవర్గ స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. వై.ఎస్. బాబు పాదయాత్రలకు జగన్ పాదయాత్రకు మధ్య ప్రధాన భేదంగా దీనిని పరిశీలకులు భావిస్తున్నారు. నాయకుడు పర్యటించిన తర్వాత లభించిన మద్దతును పటిష్ఠీకరించి ఎన్నికల వరకూ ఆ వేడిని కాపాడుకుంటూ ఓటర్లను పోలింగు బూతులకు తేవాల్సిన బాధ్యత పార్టీశ్రేణులపైనే ఉంటుంది. ఇందులో నియోజకవర్గ నాయకులదే అత్యంత ప్రముఖమైన పాత్ర. ఈ విషయాన్ని జగన్ శిబిరం విస్మరిస్తోంది.
అభయమిచ్చేందుకు అంత భయమెందుకు?
ముఖ్యంగా వై.ఎస్. పర్యటనలో నియోజకవర్గ నాయకులను తన చెంత పెట్టుకుని వారిని ప్రజలకు పరిచయం చేయడం సాగేది. వారితో నాలుగు మాటలు కూడా మాట్టాడించేవారు. వీళ్లు భవిష్యత్తులో పార్టీ తరఫున పోటీ చేస్తారనే సందేశం ప్రజలకు చేరేది. పాదయాత్ర రూపంలో క్యాడర్ ను, లోకల్ లీడర్ ను బలోపేతం చేసుకుంటూ యాత్ర సాగుతుండేది. దీనివల్ల నాయకుడు అందించిన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నియోజకవర్గమంతా ప్రచారం చేసేందుకు వినియోగించేవారు లోకల్ లీడర్లు, తమ అగ్రనాయకుడు భుజం తట్టి ఇచ్చిన ప్రోత్సాహం భరోసాగా ముందుకు వెళ్లేవారు. కానీ జగన్ పర్యటనలో ఆ రకమైన సందడి కరవైంది. నియోజకవర్గ నాయకులను చేరదీయడం, వారిని ప్రజలకు పరిచయం చేయడం సాగడం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఎక్కడ పార్టీ పరంగా కమిట్ కావాల్సి వస్తుందోనన్న భయం కావచ్చు. ఆనాటికి ఎన్నికల్లో ఉండే పరిస్థితులను ఆధారంగా చేసుకుంటూ అంగబలం, అర్థబలం ఉన్నవారికి టిక్కెట్లను పంపిణీ చేయవచ్చుననే అతిజాగ్రత్త కూడా మరో కారణం కావచ్చు. దీనివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం చేకూరదు. జగన్ మోహన్ రెడ్డిని చూడటానికి , అతని మాటలను వినడానికి వచ్చిన జనం కేరింతలు కొట్టి చప్పట్లు కొడతారు. ఆతర్వాత పార్టీ తరఫున తమ సమస్యలు వినే నేత ఎవరన్నదాని కోసం ఎదురు చూస్తారు. నిజానికి ప్రజలకు చేరువగా ఉండేది లోకల్ లీడర్ షిప్ మాత్రమే. స్థానిక ప్రతినిధులను పరిచయం చేసి నియోజకవర్గ సమస్యలపై స్పందించేందుకు, సంప్రతించేందుకు మీకు అండగా వీరుంటారన్న సుస్పష్టమైన సందేశాన్ని జగన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని విస్మరిస్తే పాదయాత్ర కలగచేసే ప్రభావం పలచనై పోతుంది. మళ్లీ ఎన్నికల నాటికి రొటీన్ గా మారిపోతుంది.
ఎవరికి వారే యమునా తీరే...
పాదయాత్రలో నాయకుడి ముందు హాజరు వేయించుకోవడానికి నియోజకవర్గస్థాయి నాయకులు క్యూ కడుతున్నారు. మమ అనిపించుకుంటున్నారు. ఆయన కనుసన్నల్లో మెలుగుతున్నారు. కానీ ఆ తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జనసమీకరణ, ఏర్పాట్లు, భారీ గా ప్రజల నుంచి స్పందన లభించేలా వ్యూహాత్మక ఏర్పాట్ల వంటివాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడ చూసినా రొటీన్ ప్రసంగం, ఒకే మాదిరి ప్రశ్నలు, ఒకే తరహా స్పందనలతో పరమబోరింగుగా పాదయాత్ర సాగుతోందంటూ మొదట్నుంచీ ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నవారు చెబుతున్నారు. ప్రధానప్రతిపక్ష నాయకుడు పర్యటిస్తుంటే అందులోనూ తమ పార్టీకి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర చేస్తుంటే రాజకీయంగా ఎంతో మైలేజీ పొందాలి. కానీ ఆశించిన రీతిలో స్పందన కరవు అవుతోందని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
సమన్వయం ఏదీ...?
పాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అగ్రనాయకులు కూడా రెండు బృందాలుగా విడిపోవడంతో సమన్వయం లోపిస్తోంది. వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని నాయకులు ఒక రీతిలో, విజయసాయి రెడ్డి చేసే సూచనలు మరో రకంగా ఉండటంతో పాదయాత్రలోనూ పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లుగా జిల్లా స్థాయి నాయకులు వాపోతున్నారు. ఈ విషయంలో కూడా జగన్ ఒక స్పష్టమైన అంచనాతో పర్యవేక్షక బృందానికి సూచన చేయలేకపోయారంటున్నారు. మొత్తం పాదయాత్రను పర్యవేక్షించేది ఎవరు? రూట్ మ్యాప్ మొదలు జనసమీకరణ, వీధి సభల వరకూ ఎవరి మాట ఫైనల్ అన్న విషయంలో కొంత గందరగోళం పార్టీలో కొనసాగుతోంది. వై.వి.సుబ్బారెడ్డి , విజయసాయి రెడ్డి ఇచ్చే సూచనలు, సలహాలకే లోకల్ నాయకత్వాలకు తలవాచి పోతుంటే మధ్యలో సాక్షి మీడియా బృందం మరో గైడెన్స్ సెల్ తరహాలో వ్యవహరిస్తోంది. సాక్షి మీడియాలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తులను ప్రశాంత్ కిశోర్ టీమ్ తో అనుసంధానం చేశారు. నాయకుని మీద వీరభక్తితో వాస్తవాలు ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా రుచించే మాటలను మాత్రమే అధినేతకు వివరించడం సాక్షి మీడియా బృందం నిర్వహిస్తున్న బాద్యత. ఒక రకంగా చెప్పాలంటే అధినేతను తప్పుదారి పట్టిస్తోంది. ఇదే బృందాన్ని ప్రశాంతకిశోర్ కు అటాచ్ చేయడంతో ఫీడ్ బ్యాక్ విషయంలో పీకే టీమ్ ను కూడా ఈ బృందం తప్పుదారి పట్టిస్తుందేమోనన్న భయం పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద నిష్పాక్షికంగా అంచనా వేసుకుని అడుగు ముందుకు వేసేందుకు మరో తటస్థ బృందం సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం జగన్ కు ఎదురవుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- జగన్ పాదయాత్ర

