గుజరాత్ లో దేవుళ్లే దిక్కయ్యారే...!

మతం మత్తులాంటిదని కారల్ మార్క్స్ ఏనాడో భవిష్యత్ దర్శనం చేశారు. కానీ కులం అంతకన్నా ప్రమాదకారి అని ఆనాడు ఆయన అంచనా వేయలేకపోయారు. ఒక మతంలో ఎన్నోకులాలు ఉంటాయి. ఒకే కులంలో అనేక ఉపకులాలు ఉంటాయి. మతానికి దేవుడు ఒక్కడే అయినప్పటికీ మళ్లీ ప్రతి కులానికి ప్రత్యేక దేవుళ్లు ఉండటం ఆధునిక భారత చరిత్ర. ఎన్నికల రాజకీయాల నేపథ్యంలో కులాల పాత్ర అత్యంత కీలకమైనది. ఏ పార్టీ, ఏ నాయకుడు ఇప్పుడు కులాన్ని, కులదేవతలను కొలవకుండా ముందడగు వేసే పరిస్థితి లేదు. ఇది ఎవరూ కాదనలేని చేదునిజం.
రెండు ప్రధాన ఆలయాలు....
ప్రస్తుత గుజరాత్ రాజకీయాలను పరిశీలిస్తే కులం ప్రాధాన్యం అర్థమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో పాటీదార్లు శక్తిమంతులు. కులపరంగా అగ్రవర్ణమైన వారు గత కొంతకాలంగా రిజర్వేషన్ల కోసం యువ నాయకుడు హార్థిక్ పటేల్ నాయకత్వంలో ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్గం నాయకులను, దేవుళ్లను, దేవాలయాలను అన్ని పార్టీల నాయకులు స్మరించలేకుండా పోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ నాయకుల వరకూ రాష్ట్రంలోని ఈ సామాజిక వర్గానికి చెందిన రెండు ప్రముఖ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. సౌరాష్ట్ర ప్రాంతమైన రాజ్ కోట్ లోని ఖోదల్ ధామ్, మెహసనా జిల్లాలోని ఉమమాధమ్ ఆలయాలు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఇవి రాజకీయ అధికార కేంద్రాలుగా మారిపోయాయి. పాటీదార్లలోని ల్యూవా, కడవా వర్గాల వారు ఈ ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాల ద్వారా రెండు వర్గాల వారూఅధికార కేంద్రాన్ని నిర్మించుకున్నారు. ఈ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పెద్దయెత్తున ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఆలయాల సందర్శన, ముఖ్యనేతలతో సంప్రదింపులతో పాటు ఆలయ ధర్మ కర్తలను ఎన్నికల బరిలోకి దింపడం విశేషం. ఖోదల్ దామ్ ఆలయానికి చెందిన ఇద్దరు ధర్మకర్తలు దినేష్ కోవాలియా, రవీభాయ్ అంబాలియాలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. దినేష్ దక్షిణ రాజ్ కోట్ నుంచి, రవిభాయ్ జెట్ పూర్ నియోజకవర్గం నుంచి తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. అధికార బీజేపీ కూడా ఈ విషయంలో ఏమీ వెనుకబడలేదు. ఇదే ఆలయానికి చెందిన మరో ముఖ్య ధర్మకర్త గోపాల్ భాయ్ బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఆమ్రేలీ జిల్లాలోని లతి బాబ్రా నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు ఆయన శ్రమిస్తున్నారు.
ధర్మకర్తలే కీలకమా....
పాటీదార్ల ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ ఇటీవల ఖోదల్ దామ్ ట్రస్ట్ ఛైర్మన్ నరేశ్ భాయ్ పటేల్ తో సుదీర్ఘ సమావేశం నిర్వహించి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ‘పటేల్ వర్గీయుల సామాజిక పరిస్థితులు బాగా లేవన్న మాట వాస్తవం. ఈ విషయంలో హార్థిక పటేల్ వాదనతో ఏకీభవిస్తాం. కాని ఎన్నికలకు సంబంధించి అన్ిన పార్టీల విషయంలో మేం తటస్థంగా ఉండదలచాం’ అని నరేష్ భాయ్ ప్రకటించడం విశేషం. అయినప్పటికీ హార్థిక్ తో తాను కలిసి ఉన్న ఫొటోను మీడియాకు విడుదల చేయడం గమనార్హం. దీనర్ధం పరోక్షంగా హార్థిక్ కు మద్దతు ప్రకటించడమే. పాటీదార్లలో సుమారు 70 శాతంగా ఉన్న ల్యూవా వర్గానికి చెందిన నరేశ్ భాయ్ పటేల్, కడవా వర్గానికి చెందిన హార్థిక్ పటేల్ కలిసి ఉన్న ఫొటో మీడియాకు విడుదల కావడం కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ యావత్ పాటీదార్లు బీజేపీకి గట్టి మద్దతుదారులు. రెండేళ్ల క్రితం హార్థిక్ పటేల్ నాయకత్వంలో రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ పట్ల వారి వైఖరిలో గణనీయమైన మార్పు కనపడుతోంది. ఇది పార్టీకి ఆందోళన కల్గిస్తుంది.
ఆలయాలనూ వదలడం లేదు...
మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్ నాధ్ నుంచి ద్వారక వరకూ ఇతర చిన్నాచితకా ఆలయాలను సందర్శించడం, పీఠాధిపతులకు ప్రణమిల్లడం కాషాయ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. ఆలయాల సందర్శనతో పాటు, ధర్మకర్తలతో మంతనాలు జరపడం, హిందుత్వానికి తామేమీ వ్యతిరేకం కాదన్న రీతిలో వ్యవహరించడంరాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మారుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీకూడా అప్రమత్తమైంది. స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఖోదల్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ నరేశ్ భాయ్ పటేల్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పాటీ దార్లపై ఈ ఆలయ ధర్మకర్తల ప్రభావం ఎక్కువే. వారి మాటలను అంత తేలిగ్గా తోసిపుచ్చలేరు. అందువల్లే ముఖ్యమంత్రి రూపానీతో పాటు కమలం పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఈ రెండు ఆలయాల ధర్మకర్తలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హార్థిక్ పటేల్ రిజర్వేషన్ డిమాండ్ కు తాము వ్యతిరేకం కాదని, న్యాయపరమైన చిక్కుల కారణంగానే వెనుకడుగు వేస్తున్నామని సర్ది చెబుతున్నారు. పోలింగ్ లో ఆలయాల ప్రభావం ఎంతవరకూ ఉంటుందో తెలియాలంటే ఈ నెల 18 వరకూ వేచి చూడక తప్పదు.
-గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

