గాలి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్...!

మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్ రెడ్డి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో గట్టి పట్టున్న గాలి జనార్ధన్ రెడ్డి 2013లో కోర్టు కేసులు, జైలు శిక్ష కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ లో నివసిస్తున్న ఆయన ఇప్పుడు కన్నడ రాజకీయాలపై దృష్టిపెడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన గాలి ఇప్పుడు కూడా పార్టీ అనుమతిస్తే పోటీకి రెడీగా ఉన్నారు. ఇందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల విలేకర్ల సమావేశంలో తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టంగా వెల్లడించారు. బళ్లారి జిల్లాలో ఆయనకు రాజకీయంగా గట్టి పట్టుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లాను బీజేపీకి పట్టున్న ప్రాంతంగా తీర్చిదిద్దడంలో గాలి కృషిని కాదనలేం.
కీలక నేతల ప్రయత్నం....
బీజేపీలోని కొందరు నాయకులు గాలి రాజకీయ ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసులు ఎన్నికల్లో పోటీకి ప్రతిబంధంకం కాదని వాదిస్తున్నారు. వీటినే ప్రామాణికంగా తీసుకుంటే ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకరని వారు అభిప్రాయపడుతున్నారు. గాలి తిరిగి రాజకీయ ప్రవేశంపై బీజేపీ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ పెద్దలతో గాలికి పాత పరిచయాలు బాగానే ఉన్నాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో మంచి అనుబంధం ఉంది. 1999 లోక్ సభ ఎన్నికల్లో బళ్లారిలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపై సుష్మాస్వరాజ్ పోటీ చేసినప్పుడు గాలి సోదరులే అన్ని కార్యక్రమాలూ పర్యవేక్షించారు. నాటి ఎన్నికల్లో సుష్మా ఓటమి పాలయినప్పటికీ సోనియాకు గట్టిపోటీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడ, ప్రస్తుత కేంద్ర మంత్రి అనంతకుమార్ తదితర నాయకులతో చక్కటి పరిచయాలున్నాయి. గత ఏడాది జరిగిన ఆయన కూతురి వివాహానికి వారంతా హాజరుకావడం గమనార్హం. యడ్యూరప్ప కేబినెట్ లో జనార్థన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. మరో సోదరుడు సోమశేఖర్ రెడ్డి అప్పట్లో బళ్లారి ఎమ్మెల్యేగా ఉన్నారు.
షా కూడా అనుకూలంగా.....
గాలి ప్రవేశానికి అధిష్టానం నుంచి కూడా పెద్దగా విముఖత లేదు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సానుకూలంగా ఉన్నారని సమాచారం. గాలి వల్ల పార్టీకి, పార్టీవల్ల గాలికి కొన్ని ప్రయోజనాలున్నాయి. ప్రస్తుతం కోర్టు కేసులతో సతమతమవుతున్న గాలి జనార్థన్ రెడ్డి రేపటి ఎన్నికల్లో గెలిస్తే రాజకీయంగా పునర్జన్మ లభిస్తుంది. పార్టీ గెలిస్తే గతంలో మాదిరిగా మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అధికారంలో ఉన్నందున కేసులను ఎదుర్కొనడం కొంత తేలికవుతుంది. ఇక పార్టీకి కూడా ఆయన అవసరం ఉంది. గాలి సొంత జిల్లా అయిన బళ్లారిలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. రేపటి ఎన్నికల్లో గెలుపు పార్టీకి ప్రాణావసరం. కర్ణాటకలో గెలవకపోతే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం పలుచబడుతుంది. అందువల్ల సామాజికంగా, ఆర్థికంగా శక్తిమంతుడైన గాలి జనార్థన్ రెడ్డి వంటి వ్యక్తులు పార్టీకి తక్షణ అవసరం. తొమ్మిది నియోజకవర్గాలు గల బళ్లారి జిల్లాలో పార్టీకి ఒక్క స్థానం మాత్రమే ఉంది. హడగల్లి, కుడ్లిగి, సండూర్, విజయనగర, బళ్లారి, బళ్లారి సిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. హెచ్ బిహళ్లిలో జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యే ఉన్నారు. కుంవ్లి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే హెచ్. టి. సురేశ్ బాబు ఉన్నారు.
బళ్లారిలో ఓడిపోయింది అందుకే....
బళ్లారి లోక్ సభ స్థానం మాత్రమే బీజేపీ చేతిలో ఉంది. ఇక్కడి ఎంపీ బి. శ్రీరాములు గాలి జనార్థన్ రెడ్డి నమ్మినబంటు. గాలి సోదరులు లేనందున జరిగిన నష్టం 2013లో స్పష్టంగా తెలిసినందున ఈసారి వారిని దగ్గరకు తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. గాలి సోదరుల ప్రభావం ఒక్క బళ్లారికే పరిమితం కాలేదు. రాయచూరు, సింధనూరు, గంగావతి, తుంకూరు, బెంగళూరు నగరాల్లో కూడా వారికి రాజకీయంగా పట్టుంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఆయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఇటీవల యాద్గిర్ లో జరిగిన రెడ్డి సామాజిక వర్గం సమావేశంలో పాల్గొన్న గాలి జనార్ధన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ముఖ్యఅతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా ఈ సమావేశంలో అందరి దృష్టి గాలిపైనే ఉంది. గాలి రాక వల్ల పార్టీకి మరో ప్రయోజనం కూడా ఉంది. వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులకు అర్థబలాన్ని ఆయన సమకూర్చే అవకాశముంది. పార్టీ నాయకత్వం ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తుంది.
ఇక్కడే పోటీ చేయాలని....
గాలి జనార్థన్ రెడ్డి పోటీ చేసేందుకు వివిధ నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు. బళ్లారి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో రెండు మినహా అన్నీరిజర్వడ్ నియోజకవర్గాలే. అందువల్ల ఆయన రాయచూర్, చిక్ బళ్లాపూర్, బెంగళూరులోని కె.ఆర్. పురం నియోజకవర్గాల నుంచి ఏదో ఒకటి ఎంచుకునే అవకాశముంది. గాలి సోదరులకు టిక్కెట్లు ఇచ్చేందుకు పెద్దగా ఇబ్బందులు లేవు. కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డికి బళ్లారి సిటీ, హరపనహళ్లి నియోజకవర్గాలను కేటాయించే అవకాశముంది. జిల్ాలోని కంప్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ బాబును తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సురేష్ బాబుబళ్లారి ఎంపీ శ్రీరాములు మేనల్లుడు. శ్రీరాములు పూర్తిగా గాలి సోదరుల మనిషి. కాంగ్రెస్ ప్రయత్నాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. గాలి జనార్థన్ రెడ్డికి సానుకూల సంకేతాలు పంపడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లోనే కర్ణాటక రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్

