ఐసిస్.... అది ఎక్కడుందబ్బా....?

ఐసిస్...ఒకప్పుడు ఈపేరు చెబితేనే అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడేది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఎక్కడ బాంబు దాడులకు పాల్పడుతుందో... ఎక్కడ విధ్వంసకర కార్యకలాపాలకు దిగుతుందోనని భయపడేవి. పశ్చిమ దేశాల్లతో పాటు ఇస్లామిక్ దేశాల్లోనూ ఉగ్రవాద చర్యల ద్వారా తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ఐసిస్ ఇప్పుడు దాదాపు కుదేలైంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గా పిలవబడే ఈ సంస్థ లక్ష్యం ఖలీపా రాజ్యస్థాపన. అంటే 18వ శతాబ్దంనాటి పాలననున పునరావృతం చేయడం. హరియత్ ప్రకారం పాలన సాగించడం, హరియత్ చట్టాలు భయంకరంగా ఉండేవి. ఇటీవలి దాడులతో ఐసిస్ దాదాపు నామమాత్రమే అయింది. తనకు తాను ప్రకటించుకున్న స్వయం ప్రకటిత ఖలీఫా రాజ్యానికి రాజధానిగా పేర్కొనే సిరియాలోని దక్కా నగరంపై ఐసిస్ దాదాపుగా పట్టుకోల్పోయింది. ఈ నగరాన్ని అమెరికా మద్దతు గల సిరియా దళాలు చేజిక్కించుకున్నాయి. వీటిని సిరియా డెమొక్రటిక్ ఫోర్స్ (ఎస్డీఎఫ్) గా పిలుస్తుంటారు. ఐసిస్ నుంచి దక్కా నగరం విముక్తి అంత తేలిగ్గా జరగలేదు. దాదాపు నాలుగు నెలలపాటు పోరు జరిగింది. సుమారు 3250 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. వందల మంది గల్లంతయ్యారు. 2.70 లక్షల మంది నిరాశ్రయులయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఐసిస్ ఆధీనంలో జాతీయ ఆసుపత్రి, స్టేడియాన్ని ప్రభుత్వ దళాలు స్వాధీనం చేసుకోవడంతో పోరాటం పూర్తయింది. వాస్తవానికి గత నవంబర్ లోనే దక్కా నగరం స్వాధీనానికి ప్రణాళిక సిద్ధమైంది. జూన్ లో సేనలు చుట్టుముట్టాయి. క్రమంగా పట్టు సాధిస్తూ చివరికి ఐసిస్ దళాలను పారిపోయేలా చేశాయి. సిరియా, ఇరాక్ లోని కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ కు గట్టిపట్టుండేది. వారి పాలనలో బహిరంగ శిర చ్ఛేదాలు సర్వ సాధారణమయ్యాయి. తమను వ్యతిరేకించిన వారిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపేవారు.
పట్టుకోల్పోయిన ఐసిస్.....
ఐసిస్ కు కంచుకోట వంటి దక్కా నగరం సిరియా ప్రభుత్వ స్వాధీనం కావడంతో ఐసిస్ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఇప్పటికీ ఇరాక్, సిరియాల్లో దాదాపు 3 నుంచి ఏడు వేల మంది ఐసిస్ పోరాట యోధులు ఉన్నట్లు అంచనా. ఐసిస్ సామ్రాజ్యం దాదాపు పతనమైంది. దాదాపు 90 శాతం భూభాగాన్ని అది కోల్పోయింది. కేవలం పదిశాతం భూభాగమే ఐసిస్ నియంత్రణలో ఉంది. ఒకప్పుడు ఐసిస్ నియంత్రణలో 1.07 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉండేది. ఐసిస్ ప్రాభవం బాగా ఉన్న 2014 ప్రాంతంలో దాదాపు సిరియా, ఇరాక్ ల్లోని చాలా ప్రాంతాల్లో దాని ప్రభావం ఉండేది. 1.07 వేల చదరపు కిలోమీటర్లు అంటే మనదేశంలోని తమిళనాడు రాష్ట్రంతో సమానం. అమెరికా మద్దతుతో సిరియా దళాలు పట్టు బిగించడంతో ఐసిస్ పట్టు తగ్గుతూ వస్తోంది. 2016 నాటికి దాని నియంత్రణలో ఉన్న ప్రాంత్రం సుమారు 75,800 చదరపు కిలోమీటర్లు. ఇది మనదేశంలోని అస్సోం రాష్ట్రంతో సమానం. ఇప్పుడు ఐసిస్ నియంత్రణలోఉన్నది కేవలం పదివేల చదరపుకిలోమీటర్లు కావడం గమనార్హం. ఇది మన దేశంలోని అతి చిన్న రాష్ట్రమైన సిక్కిం భూభాగంతో సమానం. ఐసిస్ పట్టు కోల్పోతుందనడానికి ఇదే నిదర్శనం.
ఆర్థికంగా కూడా బలహీనపడి.....
ఐసిస్ హవా నడుస్తున్న రోజుల్లో దాని ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండేది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దాని సొంతం. తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రజలపై భారంగా పన్నులు వేసి వసూలు చేసేది. 2014 జూన్ 29న సిరియా, ఇరాక్ ల్లోని ఐసిస్ ప్రాంతాలకు తానే సర్వాధికారినని ప్రకటించుకున్న అబుబకర్ అల్ బాగ్దాదీ ఒక ప్రభుత్వం తరహాలో సంస్థను నడిపేవాడు. తమ నియంత్రణలోని ప్రాంతాల్లో గల చమురు బావులపై భారీగా పన్ను విధించేవాడు. శత్రువులను కిడ్నాప్ చేయడం ద్వారానిధులను సమకూర్చుకునే వారు. ఐసిస్ దళాలు లూటీలకు కూడా పాల్పడేవి. మొత్తానికి అప్పట్లో ఐసిస్ ఆర్థికంగా పటిష్టంగా ఉండేది. ఒకప్పుడు 11 మిలియన్ల మంది ప్రజలను పాలించిన ఐసిస్ ప్రస్తుత పాలనలో రెండున్నర మిలియన్లకు మించి ప్రజలు లేరు. సిరియాలోని కీలక నగరాలు దక్కా, మౌసుల్ కోల్పోవడంతో బాగా బలహీనమైంది. అల్ ఖైదా నుంచి విడిపోయి కొత్తగా ఆవిర్భవించిన ఐసిస్ సున్నీ రాజ్యస్థాపన లక్ష్యంగా పనిచేసింది. ఈ ప్రయత్నంలో మొదట్లో కొంతవరకూ విజయం సాధించినప్పటికీ క్రమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. పశ్చిమ దేశాలే కాకుండా ఇస్లామిక్ దేశాల్లో కూడా అది పాల్పడిన అనూహ్య ఘటనలు ప్రజలను ఆలోచింప చేశాయి. అది రాజీకీయ పార్టీ కావచ్చు. ...లేదా తీవ్రవాద సంస్థ కావచ్చు...లేదా మరోసంస్థ కావచ్చు... ప్రజాదరణకు దూరమైతే అది పతనం కాక తప్పదు. సంస్థలు దారి తప్పినప్పుడే సహజంగా అవి ప్రజాదరణకు దూరమవుతాయి. ఇప్పుడు ఐసిస్ విషయంలో కూడా జరిగింది...ఇదే....!
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- ఐసిస్

