అలా అయితే జగన్ కు ఓటెయ్యను.... ఉండవల్లి...!

బిజెపితో కలిసే ఏ పార్టీకి ఓటెయ్యను
కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తే విపత్తే
పవన్ పై ఇంకా క్లారిటీ లేదు
ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్ కి ఛాన్స్ లేనట్టే
నీతి ఆయోగ్ చైర్మన్ చాలా వెటకారంగా మాట్లాడారు
పోలవరం టెండర్లు పిలవకుండా నవయుగకు ఎలా అప్పగిస్తారు
విభజన హామీలు ఏదీ అమలవ్వలేదని చంద్రబాబే చెప్పారు
"ప్రత్యేక హోదా ఇస్తే, బిజెపికి మద్దతిస్తానంటూ జగన్ చెబుతున్నాడు. నిజానికి ఇక్కడ టిడిపి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా వుంది. కేంద్రంపై పోరాటం చేయకుండా కేవలం టీడీపీ మీదే వైసిపి పోరాటం చేస్తోంది. ఇక 2014ఎన్నికలయ్యాక కేంద్రానికి మద్దతు ఇస్తున్నట్లు జగన్ ఢిల్లీ వెళ్లి చెప్పాడు. ఇప్పుడు హోదా ఇవ్వకుండా ప్యాకేజి ఇస్తున్నామని చెప్పిన కేంద్రం అదికూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితులలో జగన్ వ్యాఖ్యలను ఎలా అనుకోవాలి? అసలు ఈ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా అధికార టిడిపి,విపక్ష వైసిపి మాట్లాడడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని వింత రాజకీయ స్థితి ఏపీలో కనిపిస్తోంది" అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడి,ఎన్డీయేలో టిడిపి కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇక ఇప్పుడు ఎలా ఇస్తారని జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసారో ఆయనకే తెలియాలన్నారు. "మోడీ ఎటూ ప్రత్యేక హోదా ఇవ్వరనే ఉద్దేశంలో జగన్ ఉన్నాడేమో...? 2019 ఎన్నికల లోపు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బి.జె.పి.తో జగన్ కు రహస్య ఒప్పందం ఉందన్న చంద్రబాబు ఆరోపణ నిజం అవుతుంది. ఇక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ కాంగ్రెస్ వ్యతిరేకిగా ఉన్నాడు,అందుకే కాంగ్రెస్ తో కలవలేని పరిస్థితి లో ఉన్నాడు ఒకవేళ జగన్ బి.జె.పి.తో కలిస్తే రాష్ట్రానికి మంచా...చెడా అనేది కాలమే నిర్ణయించాలి" అని ఉండవల్లి పేర్కొన్నారు.
బీజేపీకి బద్ధ వ్యతిరేకిని.....
నిజంగా బిజెపితో జగన్ కలిస్తే మీరు సమర్థిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, తాను మొదటి నుంచి బిజెపి సిద్ధాంతాలకు వ్యతిరేకమని,అందుచేత బిజెపితో కలిసే ఏ పార్టీకి తాను ఓటు వేయనని, వేయమనికూడా ఎవరికీ చెప్పనని స్పష్టం చేసారు. తన పాలసీ తనకుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు,తమిళనాడు రాజకీయాలు చూసాక మోడీ కి చంద్రబాబు, జగన్ భయపడుతున్నారా అన్న ప్రశ్నకు అలాగే ఉందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వలన జిడిపి పెరిగిందని అంటున్నారని అయితే డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పినప్రకారం,అంచనాలు ఎక్కువచేసి చెప్పమంటున్నారని తేలిపోయిందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. నిజానికి యుపిఎ హయాంలో కొన్ని నోట్లు రద్దు చేయాలని చూస్తే, మోడీ తీవ్రంగా వ్యతిరేకించారని అయితే పెద్దనోట్లు ఒక్క ఉదుటున రద్దుచేశారని పేర్కొన్నారు. జిఎస్టీని ,ఆధార్ అనుసంధానం కూడా కూడా తీవ్రంగా వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చాక అమలు చేసారని , ఇవన్నీ చూస్తుంటే, 2019ఎన్నికల్లో మోడీకి అడ్డుకట్ట వేయకపోతే దేశం విపత్తు కి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మనుగడ దెబ్బతింటుందని, అధ్యక్ష తరహా పాలన కు దారితీస్తుందని ఆయన విశ్లేషించారు. ఇలాంటి పరిణామం మంచిది కాదన్నారు.
జనసేనపై క్లారిటీ రావాల్సి ఉంది....
జనసేన పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఉండవల్లి స్పందిస్తూ, ఆ పార్టీ ఎజెండా ఏమిటో క్లారిటీ రావాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందేనంటూ స్పష్టత ఇచ్చిన ఆ పార్టీ ,కాపుల రిజర్వేషన్,ఎబిసిడి వర్గీకరణ వంటి కీలక విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే బలం ఉన్నచోట్ల పోటీచేస్తామంటే, ఏ ప్రాతిపదికన బలం చూస్తారో కూడా తేలాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పుంజుకుంటుందా అన్న ప్రశ్నకు,రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ , బిజెపి ఒకేవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపి తప్పించుకుందని, కాంగ్రెస్ పై ప్రజల్లో ద్వేషం ఏర్పడిందని, ఇది పోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అందుచేత వచ్చే ఎన్నికల్లో కొంచెం కాంగ్రెస్ కి ఓట్లు పెరగవచ్చేమో గానీ , అధికారంలోకి వచ్చేంత మార్పు ఉండదన్నారు.
అంత వెటకారమా?
సీఎం చంద్రబాబు పక్కనే కూర్చుని నీతి ఆయోగ్ చైర్మన్ చాలా వెటకారంగా మాట్లాడారని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదని బిజెపి నేతలే చెప్పారని అలాంటప్పుడు హోదాపై కాగితం పెట్టండి చూద్దాం అంటూ చైర్మన్ వ్యాఖ్యానించడం చూస్తుంటే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పంపలేదా అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. పైగా హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేస్తే, 40శాతం ఆదాయం పెరుగుతుందని చైర్మన్ అనడం వింతగా ఉందన్నారు. ప్రధాని మోడీకి ఇటీవల చంద్రబాబు 16పేజీల లేఖ ఇస్తే, ఈ నాలుగేళ్లలో విభజన హామీలు ఏదీ అమలవ్వలేదని తేల్చేశారని ఉండవల్లి అన్నారు. మొదటినుంచి తాను ఈ విషయం చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ లోటు 16వేల రూపాయలుగా లెక్కతేలిస్తే, కేవలం మూడువేల కోట్లు ఇచ్చారని,రిఫండ్ కింద రావాల్సిన 3వేల 800కోట్లు కూడా ఇవ్వలేదని,పోలవరం బిల్లులు 7వేలకోట్లు పెడితే, మూడువేల కోట్లు ఇచ్చారని,చేసిన పనికి బిల్లులు పంపితే ఇవ్వకపోతే ఇలాగని చంద్రబాబు ఆ లేఖ ద్వారా తేల్చారని ఉండవల్లి చెప్పారు. కోర్టుకి వెళ్తామని చెప్పిన చంద్రబాబు, కేంద్రంపై వెళ్లడంలేదని అనడం వింతగా ఉందన్నారు. అయితే సుప్రీం కోర్టుకు వెళ్తానంటున్న చంద్రబాబు ముందు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారో చెప్పాలన్నారు. కేంద్రాన్ని,తెలంగాణను పార్టీలుగా చేర్చాలన్నారు. పోలవరం పనులు పాతధరలకే ట్రాన్స్ ట్రాయ్ చేయాలి తప్ప,టెండర్లు పిలవరాదని గడ్గరి చెప్పారని, దాన్ని నిజం చేసేవిధంగా నవయుగ కు అప్పగించామనే వార్తలు వచ్చాయన్నారు. పాతధరలకు చేయడం కుదరదని చెప్పక , నవయుగ ఎలా ముందుకొస్తుందని ఆయన వాపోయారు. పేరుకు నవయుగ ముందుకు వచ్చినట్లు చెప్పడంలో కూడా అర్ధం లేదన్నారు. నాణ్యత పాటిస్తే పేరువస్తుందే తప్ప, తక్కువ ధరకు చేస్తే రాదన్నారు. అయినా కాంట్రాక్ట్ మార్చాలంటే నిబంధనలు ప్రకారం టెండర్లు పిలవాలేగాని, ఇలా ఎలా చేస్తారో అర్ధం కావడం లేదన్నారు.
- Tags
- ఉండవల్లి

