అభిశంసన ఆచరణసాధ్యమేనా?

యుద్దానికి, రాజకీయానికి నీతి, నియమాలుండవు. దొరకబుచ్చుకున్న ప్రతివాడిని చంపేయమంటుంది యుద్ధం. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడేసుకోమంటుంది రాజకీయం. ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే రెండింటా ఏకైక సూత్రం. అత్యున్నత న్యాయవ్యవస్థలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కి రాజకీయ నేతలకు ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని అందించాయి. వేలు దూరే సందు దొరికితే తల దూర్చాలని ప్రయత్నిస్తుంది రాజకీయం. మాకు గొడవలున్నాయి. మా ప్రధాన న్యాయమూర్తి పనితీరు బాగాలేదంటూ సహచర న్యాయమూర్తులు ఆరోపిస్తే రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటారా? అందులోనూ అధికారంలో ఉన్న పార్టీపై వేలెత్తి చూపే విధంగా ఆరోపణలను దుయ్యబట్టే అవకాశాన్ని చేజార్చుకుంటారా? కచ్చితంగా వదులుకోరు. ఇప్పుడదే జరుగుతోంది. క్రమేపీ దేశ రాజకీయ యవనికపై తమ ప్రాముఖ్యాన్ని , ప్రాధాన్యాన్ని కోల్పోతున్న వామపక్షాలు దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఆగర్భశత్రువుగా భావించే బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇంతకు మించిన మంచి తరుణం దొరకదని భావిస్తున్నాయి. మిగిలిన రాజకీయ పార్టీలు కొంత సంయమనం పాటిస్తున్నప్పటికీ మార్క్సిస్టు పార్టీ మాత్రం అత్యుత్సాహం కనబరుస్తూ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిపై తొలగింపు తీర్మానం ద్వారా అభిశంసించే ఎత్తుగడలు వేస్తోంది.
కమలం పై కక్ష .....
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై వామపక్ష పార్టీలకు ప్రత్యేకంగా శతృత్వం లేదు. ఆయన పనితీరుతో వాటికి సంబంధం కూడా లేదు. అయితే న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన తర్వాత సీజేఐ అధికారపార్టీకి అనుకూలమవుతున్నారేమోనన్న అనుమానాలు దేశవ్యాప్తంగా తలెత్తాయి. సుప్రీం స్వతంత్రతకు ఇది భంగకరం. నిజానికి కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సీజేఐతో టచ్ లో ఉంటుంది. భారత అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్, రెండో స్థానంలో ఉండే సొలిసిటర్ జనరల్ వివిధాంశాలపై సీజేఐ తోనూ, బెంచీల న్యాయమూర్తులతోనూ మంతనాలు జరుపుతూ ఉంటారు. అధికారికంగా, అనధికారికంగా సర్కారుకు ఇబ్బంది కలిగే వివిధాంశాలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకువస్తుంటారు. అన్ని విషయాలు కోర్టులో మాత్రమే ప్రస్తావనకు రావు. ముఖ్యంగా చట్టాలు చేసేటప్పుడు రాజ్యాంగపరంగా న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో భాగంగా ముందస్తుగా సుప్రీం దృష్టిలో పెట్టడం కూడా సాగుతూ ఉంటుంది. విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలనే సూచనతో న్యాయవ్యవస్థకు కేంద్రం కొన్ని అభ్యర్థనలు అనధికారికంగా చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చేసినప్పుడు తీవ్రమైన అభ్యంతరాలతో కేసులు వేసినప్పటికీ సుప్రీం సంయమనం పాటించింది. ఎటువంటి స్టేలు జారీ చేయలేదు. ఈరకమైన సహకారాన్నే కేంద్రం కోరుకుంటూ ఉంటుంది. ఇది అన్ని పార్టీలకు తెలిసిన వ్యవహారమే. అయినప్పటికీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మార్క్సిస్టు పార్టీ పెద్ద ఇష్యూ చేయాలని భావిస్తోంది. రాజకీయ ప్రయోజనాలను నొల్లుకోవాలని చూస్తోంది.
న్యాయవ్యవస్థకు శిక్ష ....
మార్క్సిస్టు పార్టీ ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పటికే కాంగ్రెసు పార్టీ, సమాజ్ వాదీ వంటి ప్రధాన పార్టీలను సీజేఐను తొలగించేందుకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ముందుకు రావాలని అభ్యర్థించారు. అయితే రెండు పార్టీలు సానుకూలత చూపలేదని తెలుస్తోంది. అయితే సీతారాం మాత్రం తన ప్రయత్నాలను విరమించుకోకుండా బీజేపీపై తీవ్ర వైముఖ్యం ప్రదర్శించే చిన్నాచితక పార్టీలను కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. తీర్మానం నెగ్గి రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ తొలగింపు జరిగే అవకాశాలు అంతంతమాత్రమే. ఈ విషయం మార్క్కిస్టు పార్టీకి కూడా తెలుసు. అయినప్పటికీ తీర్మానం సందర్బంగా చర్చలో బీజేపీని దుయ్యబట్టేందుకు మంచి అవకాశం దక్కుతుందనే ఆశతోనే సీపీఎం ఈ ప్రయత్నాలు చేస్తోంది. న్యాయమూర్తి తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. ఆతర్వాత విచారణ చేయాల్సి ఉంటుంది. సుదీర్ఘమైన ప్రాసెస్ తో ఉభయసభలు మెజార్టీతో ఆమోదించి రాష్ట్రపతి అంగీకరించిన తర్వాతనే తొలగింపునకు మార్గం సుగమమవుతుంది. అక్టోబర్ లో పదవీ విరమణ చేయనున్న దీపక్ మిశ్రా విషయంలో ఇంత తతంగం పూర్తయ్యేందుకు సమయం సరిపోదు. ప్రొసీడింగ్సు మొదలయ్యే నాటికే ఆయన పదవీ విరమణ చేయాల్సి రావచ్చు. తీర్మానానికి అవసరమైన బలాన్ని కూడగట్టి చర్చ పెట్టి కేంద్రాన్ని రచ్చ చేయడమే మార్క్కిస్టు పార్టీ లక్ష్యం. కానీ భారత న్యాయవ్యవస్థ చరిత్రలో సుప్రీం చీఫ్ జస్టిస్ ను పార్లమెంటుకు పిలిచి విచారించిన ఘట్టం ఇంతవరకూ చోటు చేసుకోలేదు. అదే జరిగితే న్యాయవ్యవస్థ గౌరవానికి కూడా భంగం వాటిల్లుతుంది.
రాజకీయ మచ్చ...
నిత్యం ప్రజాక్షేత్రంలో పనిచేసే రాజకీయ పార్టీలు తరచూ కోర్టు తీర్పుల ద్వారా మొట్టికాయలు తింటున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చీవాట్లు తప్పడం లేదు. రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటాయి కోర్టులు. ఇంతవరకూ ఎన్నివివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంచెలంచెల వ్యవస్థలో ఒకచోట తప్పు జరిగినా మరో అంచెలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంటూ వస్తోంది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఒక నిందితునిగా పార్లమెంటు ముందు నిలవాల్సిన పరిస్థితి వస్తే రాజకీయ మచ్చ సుప్రీంకు చుట్టుకుంటుంది. డెబ్భై ఏళ్ల స్వతంత్రభారత ప్రజాస్వామ్యంలో అత్యంత అరుదుగా మాత్రమే న్యాయమూర్తులు పార్లమెంటు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. రామస్వామి, సౌమిత్ర సేన్ వంటి వారి ప్రవర్తన, వారిపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటు దృష్టి సారించిన ఘట్టాలున్నాయి. అప్పట్లోనే వారి ఉదంతాలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. కేసులను అప్పగించడంలో సీనియర్ న్యాయమూర్తుల బెంచీలను నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యమైన కేసులను జూనియర్ న్యాయమూర్తుల బెంచీలకు కేటాయిస్తున్నారనేది సీజేఐ పై వచ్చిన ప్రధాన అభియోగం. అంతర్గత విచారణ ద్వారా అది నిజమో , కాదో తేల్చుకోవచ్చు. పరిష్కారమార్గాలు కూడా అన్వేషించి అంతర్గత ఏర్పాట్లతో దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్ప సైద్ధాంతిక రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధింపునకు న్యాయమూర్తి ఉదంతాన్ని పావుగా వాడుకోవాలని చూస్తే అంతకుమించిన దురదృష్టం మరొకటి ఉండదు.
-ఎడిటోరియల్ డెస్క్

