ఆ కార్డుతోనే కొడతారటగా
వైసీపీ తాజా ఎన్నికల గెలుపు చారిత్రాత్మకం. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నదే. దానికి తోడు అన్నట్లుగా టీడీపీ వెనక ఉన్న బీసీలను కూడా [more]
వైసీపీ తాజా ఎన్నికల గెలుపు చారిత్రాత్మకం. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నదే. దానికి తోడు అన్నట్లుగా టీడీపీ వెనక ఉన్న బీసీలను కూడా [more]

వైసీపీ తాజా ఎన్నికల గెలుపు చారిత్రాత్మకం. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నదే. దానికి తోడు అన్నట్లుగా టీడీపీ వెనక ఉన్న బీసీలను కూడా లాగేసుకుని బంపర్ విక్టరీని 2019 ఎన్నికల్లో నమోదు చేసింది. ఇక కాపుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించి తన వైపునకు వైసీపీ తిప్పుకుంది. ఇలా దాదాపుగా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా దరి చేర్చుకోవడం వల్లనే వైసీపీకి భారీ విజయం సాధ్యమైందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని వైసీపీ నేతలు అనుసరించబోతున్నారట. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ కార్డ్ ని ప్రయోగించి మొత్తానికి మొత్తం సీట్లు కొల్లగొట్టాలని వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన చోట మేయర్ సీటుని పట్టేయాలన్న వైసీపీ ఎత్తుగడలకు బీసీ కార్డ్ ఎంతగనో ఉపయోగపడుతుందని అంటున్నారు.
బీసీలకే టికెట్లు….
విశాఖ మహా నగరంలో అన్ని వర్గాల ప్రజానీకం ఉన్నారు. అయితే ఎక్కువగా బీసీ ఓటు బ్యాంక్ ఉంది. యాదవులు, గవరలు, వెలమలు, మత్స్యకారులు జీవీఎంసీ పరిధిలో ఎక్కువగా ఉన్నారు. అలాగే బీసీ కాపులు కూడా ఇక్కడ అధిక శాతం ఉన్నారు. వీరి ఓటు బ్యాంక్ గట్టిగా పట్టుకుంటే మహా విశాఖపై జెండా ఎగరవేయడం కష్టం కాదు. గతంలో మేయర్లుగా గెల్చిన వారంతా బీసీ నేతలే కావడం విశేషం. ఇలాంటి గణాంకాలను దగ్గర పెట్టుకున్న వైసీపీ బీసీ నినాదంతో ముందుకు సాగాలనుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ విజయసారధి,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించారు. బీసీలకే పెద్ద పీట వేస్తామని, ఎక్కువ టికెట్లు వారికే ఇస్తామని ఆయన చెప్పడంతో వైసీపీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.
అక్టోబర్లో ఎన్నికలట….
ఇదిలా ఉండగా మహా విశాఖ ఎన్నికలు అక్టోబర్ 15 తరువాత ఎపుడైనా నిర్వహించవచ్చునని విజయసాయిరెడ్డి ప్రకటించడం విశేషం. ఇప్పటినుంచే పార్టీ కోసం పనిచేయాలని, టికెట్లు మీ చేతుల్లోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీని ద్వారా పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలన్నది ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది. మరో వైపు వైసీపీని పటిష్టం చేయాలని ఆయన నాయకులకు సూచించారు. అందరికీ సముచితమైన ప్రాధాన్యత ఉంటుందని, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్నది అసలు ఉండదని విజయసాయిరెడ్డి చెప్పడం ద్వారా వైసీపీలో వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని నేతలకు సూచించినట్లైంది. ఇక ప్రజల కోసం పార్టీ అన్నట్లుగా ఉండాలని, అపుడే గుర్తింపు ఉంటుందని విజయిసాయి అన్న మాటలు గమనిస్తే జగన్ చేతిలో పనిమంతుల జాబితా సిధ్ధంగా ఉందని అర్ధమవుతోంది. దాంతో పని దొంగలెవరో కూడా తేలిపోతుందని అంటున్నారు. మొత్తానికి విజయసాయి మాత్రం విశాఖ కోట కొట్టాలని కసి మీద ఉన్నారు. మేయర్ టికెట్ బీసీల్లో ఎవరికి దక్కుతుందన్నది మాత్రం టెన్షన్ గా ఉంది. ఓసీల నుంచి కొంత మంది ప్రయత్నాలు చేసుకుంటున్నా విజయసాయి తాజా ప్రకటనతో వైసీపీ నేతల్లో కొందరు పూర్తిగా డీలా పడిపోయారనే చెప్పాలి.

