ప్రెషర్ పెరుగుతోందా?
వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడి మూడునెలలు గడిచిపోయింది. రాష్ట్రంలో పాలన ఎలా ఉందన్నది కాసేపు పక్కన పెడితే పార్టీ అధికారంలోకి బంపర్ మెజారిటీతో రావడానికి కారణమైన క్యాడర్ [more]
వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడి మూడునెలలు గడిచిపోయింది. రాష్ట్రంలో పాలన ఎలా ఉందన్నది కాసేపు పక్కన పెడితే పార్టీ అధికారంలోకి బంపర్ మెజారిటీతో రావడానికి కారణమైన క్యాడర్ [more]

వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడి మూడునెలలు గడిచిపోయింది. రాష్ట్రంలో పాలన ఎలా ఉందన్నది కాసేపు పక్కన పెడితే పార్టీ అధికారంలోకి బంపర్ మెజారిటీతో రావడానికి కారణమైన క్యాడర్ లో మాత్రం నైరాశ్యం అలుముకుందనే చెప్పాలి. వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెడుతున్నారు. అధికారులను మార్చారు. జిల్లా స్థాయిలో సమస్యలను ఆకళింపు చేసుకుంటున్నారు. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
పాలన పై దృష్టి పెట్టి…..
మరోవైపు ఏపీలో నిధుల కొరత వెంటాడుతోంది. ఏ పనిచేద్దామన్నా ఖాళీ ఖజానా వెక్కిరిస్తుంది. అందుకే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో అవినీతికి చోటు లేదని అన్ని కార్యక్రమాల్లో చెబుతున్నారు. దీంతో పాటుగా మద్యం షాపులను దశలవారీగా తొలగిస్తున్నారు. వాటిని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపేందుకు సిద్ధమయింది. ఇక పంచాయతీరాజ్ లో అనేక పనులను రద్దు చేసిన ప్రభుత్వం ఇంకా టెండర్లను పిలవలేదు.
మద్యం షాపుల దగ్గర నుంచి…
మరోవైపు నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో జగన్ రిజర్వేషన్ కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు యాభై శాతం నామినేషన్ పనులు ఇవ్వాలని ఏకంగా చట్టం తెచ్చారు. ఇక వివిధ కులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకూ ఆ ప్రయత్నాన్ని ప్రారంభించ లేదు. దీంతో తమ ప్రభుత్వం వస్తే పనులన్నీ తమకే దక్కుతాయని ఆశించిన క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది.
ఎమ్మెల్యేల్లో భయం….
ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ బాధ ఎక్కువగా కన్పిస్తుంది. కాంట్రాక్టులు, మద్యం షాపులు తమకు దక్కకుంటే ఎలా సంపాదించుకుంటామని సూటిగా ఎమ్మెల్యేలను ప్రశ్నించే వరకూ వచ్చింది. రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. అలాగే కోస్తా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వద్దకు ద్వితీయ శ్రేణి నేతలు రావడమే మానేశారట. దీంతో ఎమ్మెల్యేలు చాలామంది దీనిపై పార్టీ నేత విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండంతో వారిని మంచి చేసుకోవాల్సి ఉందని ఆయనకు కొందరు ఎమ్మెల్యేలు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద జగన్ నిర్ణయాలను వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ మాత్రం పెదవి విరుస్తున్నారు.

