జగన్ కు మోదీ మోత తప్పేట్లు లేదుగా?
నరేంద్ర మోదీకి, ఆయన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎంత ఇమేజ్ ఉంటుందో తెలియదు కాని, ఇలాగే కొనసాగితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం వ్యతిరేకత కొనితెచ్చుకోక [more]
నరేంద్ర మోదీకి, ఆయన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎంత ఇమేజ్ ఉంటుందో తెలియదు కాని, ఇలాగే కొనసాగితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం వ్యతిరేకత కొనితెచ్చుకోక [more]

నరేంద్ర మోదీకి, ఆయన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎంత ఇమేజ్ ఉంటుందో తెలియదు కాని, ఇలాగే కొనసాగితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం వ్యతిరేకత కొనితెచ్చుకోక తప్పదు. ఇప్పటికే బీజేపీతో అంటకాగుతున్నారన్న ముద్ర జగన్ పార్టీపై పడిపోయింది. తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక హదాను సాధిస్తానని చెప్పిన జగన్, ముఖ్యమంత్రి కాగానే ఆ మాటను మరచిపోయారు. పైగా కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించాలనే నిర్ణయించుకున్నట్లుంది.
కేంద్రంతో సఖ్యతగా…..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితేనే జగన్ కు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి తటస్థులు జగన్ వైఖరిని బీజేపీ విషయంలో తప్పుపడుతున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ నాన్చుడు ధోరణిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం….
ఏ బిల్లులకైనా బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చినా జగన్ ను పెద్దగా పట్టించుకోరు. కానీ రాష్ట్ర అంశాలకు సంబంధించి మాత్రం రాజీ పడితే మాత్రం ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పోలవరం నిధుల విషయంలో చేస్తున్న విన్యాసాలను జగన్ అడ్డుకోలేకపోతున్నారంటున్నారు. కనీసం కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. దీనికి తెలుగుదేశం పార్టీ జగన్ కేసులను ముడిపెడుతూ ఆరోపణలు చేస్తుంది.
పోలవరం విషయంలో…..
మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్న ఏపీలో మోదీ ప్రభావం ఏమాత్రం లేదన్నది గత ఎన్నికల ఫలితాలే స్పష్టంగా చెప్పాయి. చంద్రబాబు మోదీని వ్యతిరేకించినా ఆయనను ప్రజలు ఆదరించకపోవడానికి అప్పట్లో జగన్ పై ఉన్న సానుభూతి, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అనుకోవడమే. ఈసారి అలాంటి అవకాశాలుండవు. మోదీని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ గొంతెత్తితేనే ఆయనకు గాని, పార్టీకి గాని రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. మోదీ మోతను జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో మోయాల్సి వస్తుంది. మొత్తం మీద ఇలాగేకొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మోదీ జగన్ కు బరువుగా మారనున్నారు.

