ఆ కోపం జగన్ మీదకు టర్న్ అవుతుందా..?
ఏపీ జనాల చెవిలో ఎంచక్కా రెండవ ఏడాది బడ్జెట్ లో కూడా కమలం పువ్వు పెట్టేశారు కేంద్ర పెద్దలు. మీ పాట్లు మీరు పడండి అంటూ తమ [more]
ఏపీ జనాల చెవిలో ఎంచక్కా రెండవ ఏడాది బడ్జెట్ లో కూడా కమలం పువ్వు పెట్టేశారు కేంద్ర పెద్దలు. మీ పాట్లు మీరు పడండి అంటూ తమ [more]

ఏపీ జనాల చెవిలో ఎంచక్కా రెండవ ఏడాది బడ్జెట్ లో కూడా కమలం పువ్వు పెట్టేశారు కేంద్ర పెద్దలు. మీ పాట్లు మీరు పడండి అంటూ తమ ప్రాధాన్యతలలో ఏపీ లేదని తేల్చేశారు. ఏపీ జనం కేంద్ర బడ్జెట్ ని చూసి మండుతున్నారు. అయితే వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం లేదు. ఇక సెంచరీకి చేరుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను చూసి గుస్సా అవుతున్నారు. దానికి కూడా రచ్చ చేయడంలేదు. కానీ సరైన సమయం చూసి కర్రు కాల్చి వాత పెట్టడానికి జనాలు రెడీగా ఉన్నారు. కానీ వారికి ఏపీలో బీజేపీ చిక్కాలిగా.
ఏముందని..ఏంచేయాలని …?
ఏపీలో బీజేపీ చూస్తే నోటాతోనే పోటీ పడుతోంది తప్ప పట్టుమని పది శాతం ఓట్లు సొంతంగా ఎపుడూ సంపాదించలేకపోతోంది. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లోనూ ఏపీ మీద ఏమాత్రం ఆశలు లేవు అని క్లారిటీగా తెలుస్తోంది. కనీసం ఏపీని ఆకట్టుకుందామన్న ధ్యాస కూడా బీజేపీ పెద్దలకు లేదని బడ్జెట్ పద్దులను చూస్తే అర్ధమవుతుంది. అందువల్ల ఏపీ జనాలు కోపం వచ్చి తన జుట్టు పీక్కోవాల్సిందే తప్ప బీజేపీని ఏపీలో చేయడానికి కూడా ఏమీ లేదు. మరి బీజేపీ మీద కోపం తీర్చుకోవడానికి ఒక పాపాల భైరవుడు దొరకాలిగా.
అక్కడే బాబు చిత్తు ….
ఏపీలో చంద్రబాబు అయిదేళ్ల పాలన మీద జనాలకు ఎంత వ్యతిరేకత ఉందో ఏమో కానీ కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్ల పాటు అంటకాగి ఏపీకి ఏమీ తేలేకపోయాడన్న జనాగ్రహమే 2019 ఎన్నికల్లో బాబుని ఆయన పార్టీని చిత్తు చేసింది. అదే సమయంలో ప్రత్యేక హోదా సహా అనేక హామీలన్నీ కేంద్రం నుంచి సాధించుకుని వస్తానని జగన్ చెప్పడంతో ఆయనకు పట్టం కట్టారు. గత రెండు బడ్జెట్లు చూస్తే కేంద్రం వద్ద జగన్ పలుకుబడి బాబు కంటే కనాకష్టంగా ఉందని ఈపాటికే తెలుస్తోంది. రెండు బడ్జెట్లు వెళ్లిపోయినా పైసా కూడా ఏపీకి రాలేదు. దాంతో జనాల కోపం ఇపుడు జగన్ మీదకు మెల్లగా మళ్ళుతోందన్నది ఒక విశ్లేషణ.
ఇదే కరెక్ట్ టైమ్ ….
నిజానికి బాబుకు జగన్ కి ఇక్కడో తేడా ఉంది. జగన్ కేంద్ర ప్రభుత్వంలో చేరలేదు. అంతవరకూ సేఫ్ జోన్ లో ఉన్నారు. అయినా సరే కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడంలేదు. పైగా బేషరతుగా కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ పార్లమెంట్ లో జగన్ మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీకి ఠంచనుగా నెలకు ఒకసారి వెళ్లి ఏకాంత చర్చలు జరిపివస్తున్నారు. వాటి వల్ల ఏపీకి దక్కింది సున్నా అని అందరికీ తెలుసు. మరి జగన్ దేనికి వెళ్తున్నాడు అంటే ఆయన కేసుల నుంచి రక్షించుకోవడానికే అని తెలుగుదేశం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో కనుక జగన్ మేలుకోకపోతే మాత్రం జనం బీజేపీ మీద ఉన్న కోపాన్ని జగన్ మీదకు మళ్ళించడం ఖాయమని అంటున్నారు. జగన్ ఈ రోజు వరకూ కేంద్రాన్ని ఏ విషయంలోనూ గట్టిగా డిమాండ్ చేయలేదన్న చర్చ అయితే ఉంది. ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడు అయినా ఫలనాది కేంద్ర పెద్దలను కోరాను అని మీడియా ముందు చెబితే అదొక పద్ధతి. కానీ ఎపుడూ జగన్ అలా చేయలేదు. ఇక ఇపుడు కేంద్ర బడ్జెట్ మీద జనం మండిపోతూంటే జగన్ కనీసం కేంద్రాన్ని విమర్శిస్తూ ఒక ప్రకటన అయినా చేయకపోవడం ద్వారా బాబు మాదిరిగా పాపాలభైరవుడు కాదలచుకున్నారా అన్నదే ప్రశ్న. మొత్తానికి ఏపీలో సేమ్ సీన్ ని బీజేపీ రిపీట్ చేస్తోంది.

