అటు నుంచి నరుక్కు వస్తున్నారా?
వైఎస్ జగన్ కి అనుభవం ఏ మాత్రం లేదని, ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదని టీడీపీ తరచూ అనే మాట. అయితే వైఎస్ జగన్ విధానాలు, పాలనాపరమైన [more]
వైఎస్ జగన్ కి అనుభవం ఏ మాత్రం లేదని, ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదని టీడీపీ తరచూ అనే మాట. అయితే వైఎస్ జగన్ విధానాలు, పాలనాపరమైన [more]

వైఎస్ జగన్ కి అనుభవం ఏ మాత్రం లేదని, ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదని టీడీపీ తరచూ అనే మాట. అయితే వైఎస్ జగన్ విధానాలు, పాలనాపరమైన దూకుడు చూస్తూంటే మాత్రం ఆయనకు ఆంధ్రప్రదేశ్ విషయంలో పరిపూర్ణమైన అవగాహన ఉందని అర్ధమవుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృధ్ధి చేయాలన్న అజెండా వైఎస్ జగన్ మెదడులోనే ఉన్నట్లుగా అర్ధమవుతుంది. అందుకే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధులు ఎలా వస్తాయన్న విషయం పక్కనపెడితే తన కమిట్మెంట్ ని వైఎస్ జగన్ బాగానే రుజువు చేసుకుంటున్నారు. మాట ఇస్తే తప్పనన్న ఆయన వైఖరికి కూడా ఇది అద్దంపడుతోంది. ఇదిలా ఉండగా అమరావతి రాజధాని తన వల్ల కాదన్న సత్యాన్ని గ్రహించడంలో వైఎస్ జగన్ చంద్రబాబు కన్నా తెలివైన నేతగానే చెప్పాలి. తలకు మించి భారం పెట్టుకుని తెల్లారి లేస్తే అమరావతి కధలు చెప్పిన చంద్రబాబుతో పోలిస్తే వాస్తవ పరిస్థితులపైన వైఎస్ జగన్ కి అవగాహన బాగానే ఉందని చెప్పాలి.
నిపుణులతో కమిటీ…..
ఇక అమరావతి రాజధానిని ఉన్నఫళంగా కాదంటే వచ్చే ఇబ్బందులు బాధలు వైఎస్ జగన్ కి తెలియనివి కావు, పైగా అక్కడ తిష్టవేసిన బలమైన సామాజికవర్గం, దానికి దన్నుగా ఉన్న రాజకీయ నాయకత్వం సృష్టించే ఇబ్బందులు వైఎస్ జగన్ కి బాగా తెలుసు. అందుకే ఆయన ఇంతవరకూ అమరావతి మీద పెదవి విప్పలేదు. అంతే కాదు. తన అభిప్రాయం ఏంటో చెప్పకుండానే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా తన భావాలను ప్రజలలోకి పంపించి ఫీడ్ బ్యాక్ బాగానే సేకరించారు. అమరావతి రాజధాని కాదు అంటే రెండు జిల్లాల జనమే వ్యతిరేకిస్తారు, అందునా పూర్తిగా కాదు, కొన్ని ప్రాంతాలకే ఆ వ్యతిరేకత ఉంటుంది, ఇదీ వైఎస్ జగన్ కి ఉన్న ఫీడ్ బ్యాక్. అయితే అమరావతిని తాను వ్యతిరేకించినట్లుగా నోటితో చెప్పకుండా వైఎస్ జగన్ మరో విధంగా ఆలోచన చేస్తున్నారు. పట్టణాభివృధ్ధిలో నిపుణులు, నిష్ణాతులతో ఓ కమిటీని ఆయన తాజాగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఒక్క అమరావతి రాజధాని మాత్రమే కాకుండా ఏపీ సమగ్ర అభివృధ్ధిపై అధ్యయనం చేసే బాధ్యతను వైఎస్ జగన్ అప్పగించారు. అమరావతిలో వరదల నిర్వహణ, అక్కడ పర్యావరణ పరిస్థితులపైన కూడా ఈ కమిటీ లోతైన అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ ఆరువారాల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
అలా ముందుకు పోతారా…?
ఈ కమిటీ నివేదిక రాగానే వైఎస్ జగన్ సర్కార్ యాక్షన్ ప్లాన్ కి దిగుతుందన్న మాట. కమిటీ ఇచ్చిన నివేదిక కాబట్టి ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టడానికి లేదు. పైగా ఆయా రంగల్లో నిపుణులు ఇచ్చిన నివేదిక కాబట్టి రాజకీయ రంగుని కూడా పులమాల్సిన పని లేదు. వారు ఉన్నది ఉన్నట్లుగా అమరావతి లో అభివ్రుధ్ధి చేయవచ్చా, చేస్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, వరదల సంగతేంటి వంటివి పూర్తిగా వివరిస్తారు. దాన్ని ఆధారం చేసుకుని ముందుకు పోవడం వైఎస్ జగన్ సర్కార్ కి చాలా సులువైన మార్గం. ఇక ఈ కమిటీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పైన కూడా నివేదిక ఇస్తుంది కాబట్టి ఆయా ప్రాంతాలను అభివృధ్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నపుడు మిగిలిన ప్రాంతాలు సర్కార్ కి సహకరిస్తాయి కూడా. మొత్తానికి మంచి ఎత్తుగడతోనే వైఎస్ జగన్ కమిటీని వేశారని అంటున్నారు. కాగల కార్యం కమిటీ తీరుస్తుందని అంటున్నారు.

