మరో జయలలితగా జగన్… ?
విపరీతమైన ప్రజాకర్షణ కలిగిన నేతలతో వచ్చిన చిక్కే ఇది. వారి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. రాజ ప్రాసాదాలలో వారు ఉంటారు. తమ వెంట మొత్తం జనం ఉన్నారు, [more]
విపరీతమైన ప్రజాకర్షణ కలిగిన నేతలతో వచ్చిన చిక్కే ఇది. వారి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. రాజ ప్రాసాదాలలో వారు ఉంటారు. తమ వెంట మొత్తం జనం ఉన్నారు, [more]

విపరీతమైన ప్రజాకర్షణ కలిగిన నేతలతో వచ్చిన చిక్కే ఇది. వారి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. రాజ ప్రాసాదాలలో వారు ఉంటారు. తమ వెంట మొత్తం జనం ఉన్నారు, మిగిలిన వాటితో సంబంధం ఏంటి అని కూడా ఆలోచిస్తారు. తమిళనాడు లో జయలలిత మొదటి సారి 1991 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఆమె రాజకీయ దురంధరుడు కరుణానిధిని ఓడించారు. అదే సమయంలో అన్నాడీఎంకే మీద పూర్తి ఆధిపత్యం చూపించారు. ఆ రెండు సంతోషాలూ ఆమెను నేల మీద నిలువనీయలేదు. దాంతో ఒక్కసారిగా తలుపులు వేసేసుకున్నారు. మీడియాను దూరం పెట్టేశారు. విపక్షాలకు తాను జవాబు చెప్పే సీన్ లేదని కూడా తలపోసారు. ఫలితంగా జనాలతో అతి పెద్ద అంతరం ఏర్పడి 1996 ఎన్నికల వేళ ఆమె ఓడారు.
సేమ్ టూ సేమ్….
ఏపీలో చూస్తే ఇపుడు జయలలిత మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారు అంటారు ఆయన రాజకీయ పోకడలను చూసిన వారు. ఆయన ఏనాడూ ప్రతిపక్షానికి నోరు విప్పి జవాబు చెప్పరు. మీడియా ముందుకు అసలు రారు. తనకంటూ గిరి గీసుకుని పనిచేసుకుంటూ పోతున్నారు. తనకు జనాల మనసేంటో తెలుసు. వారితోనే తనకు కనెక్టివిటీ అని కూడా జగన్ భావిస్తున్నారు. అది నిజమే కావచ్చు కానీ ఆ అనుసంధానం చేసే తీగను కట్ చేస్తే ఎలా లింక్ కుదురుతుంది అన్నదే వైసీపీలో సాగుతున్న చర్చ. పైగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వెనక బలమైన మీడియా ఉంది. ఎన్టీయార్ లాంటి మహాబలుడిని ఉన్నఫళంగా దించేసి బాబుని ఎక్కించిన చరిత్ర కూడా దానికి ఉంది.
టెస్టింగ్ టైమ్ ….?
ఇంతకాలం జగన్ మీడియా ముందు రాకపోయినా ప్రభుత్వ వాదన బలంగా లేకపోయినా వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే అధికార పక్షం మీద టీడీపీ చేసినవన్నీ రాజకీయ విమర్శలు. వాటితో జనాలకు అసలు సంబంధంలేదు. దాంతో వాటిని మొదటి పేజీలలో బ్యానర్ ఐటెమ్స్ గా టీడీపీ అనుకూల మీడియా అచ్చేసినా జనం నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. కానీ ఇపుడు కరోనా రెండవ దశ వేళ మాత్రం జనాల్లోకి విపక్షం చేస్తున్న విమర్శలు బలంగా వెళ్ళిపోతున్నాయి. ఇది జనంతో కనెక్ట్ అయి ఉన్న ఇష్యూ. పైగా ప్రతీ ఇంట్లో ప్రతీ వంట్లో కరోనా భయం ఉంది. దాంతో ప్రభుత్వం ఏమీ చేయడంలేదు అంటూ టీడీపీ ఇంటి పై కప్పు ఎక్కి చేస్తున్న యాగీతో అధికార పార్టీ ఎక్కడికక్కడ బదనాం అయిపోతోంది. ఒక విధంగా ఇది వైసీపీకి పరీక్షా సమయం అని కూడా చెప్పాలేమో.
గొంతు పెంచాల్సిందే…?
ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో తాను చేస్తున్నది చెప్పుకోవాలి. అలాగే కేంద్రం చేస్తున్న తప్పిదాలు కూడా జనం ముందు పెట్టాలి. తమ వంతుగా జనాలకు గట్టి భరోసా ఇవ్వాలి. అవసరం అయితే ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పినా జనాలకు కొండంత ధైర్యం వస్తుంది. లేకపోతే అదిగో పులి ఇదిగో తోక అంటూ వస్తున్న ప్రచారాన్నే ప్రజలు నమ్ముతారు. ఇక పాతిక మంది మంత్రులూ కూడా ఇప్పటికైనా గొంతు విప్పాలి. ఎక్కడికక్కడ విపక్షాల విమర్శలకు తగిన జవాబు చెబుతూనే తమ యాక్షన్ ప్లాన్ ని కూడా ప్రకటించాలి. ఇదే సమయంలో మీడియా కవరేజ్ విషయంలో కూడా అధికార పార్టీ దూకుడుగా ఉండాలి. లేకపోతే వైసీపీకి డేంజర్ బెల్స్ మోగినట్లే. ఏమీ చేయలేని సర్కార్ అన్న విపక్షం మాటలను జనం నమ్ముతారు అంటే అది వారి తప్పు కాదేమో.

