జగన్ మడమ తిప్పినట్లేనా?
ఏపీలో జగన్ పాలన ప్రారంభించి ఏడాదిన్నర పూర్తయింది. ఈ క్రమంలో ఆయన ఆదిలో చూపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. తాను తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా [more]
ఏపీలో జగన్ పాలన ప్రారంభించి ఏడాదిన్నర పూర్తయింది. ఈ క్రమంలో ఆయన ఆదిలో చూపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. తాను తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా [more]

ఏపీలో జగన్ పాలన ప్రారంభించి ఏడాదిన్నర పూర్తయింది. ఈ క్రమంలో ఆయన ఆదిలో చూపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. తాను తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా వెనక్కి తీసుకునే అవకాశం లేదని.. తాను ఒక నిర్ణయం తీసుకున్నానంటే.. అది ప్రజాకోణంలోనే ఉంటుంది తప్ప.. తిరిగి పునరాలోచించుకునే పరిస్థితి ఉండదని, మేనిఫెస్టోలో పెట్టిందే ఫైనల్ అని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అదేవిధంగా జగన్ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కొన్ని విషయాల్లో మార్పులు లేకుండా ముందుకు సాగుతున్నారు. కానీ, న్యాయ వ్యవస్థ నుంచి ఎదురైన ఆదేశాల కారణంగా ప్రభుత్వ కార్యాలయాల రంగుల విషయంలో రాజీ పడ్డారు.
కీలక అంశాల్లో….
సరే..! ఇలాంటి విషయంలో ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. జగన్ మడమ వెనక్కి తిప్పారు.. అని కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఎవరూ కోరుకోకుండానే.. ఏ న్యాయ స్థానంలోనూ కేసులు పడకుండానే జగన్ కొన్ని కీలక విషయాల్లో తన నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకటి.. మద్యం విధానం. తన సర్కారు సమయం అయ్యే నాటికి అంటే ఐదేళ్ల పాలనాకాలం ముగిసే నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు.ఈ క్రమంలోనే ఏడాదికి పాతికి శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గించి.. మద్యం ధరలను భారీగా పెంచుతామన్నారు.
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను….
తొలి ఏడాది పాలనలో ఇలానే చేశారు. 25 శాతం దుకాణాలు తగ్గించారు. ధరలను 200 శాతం పెంచారు. కానీ, రెండో ఏడాది ప్రారంభంలోకి వచ్చేసరికి మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గారు. మద్యం దుకాణాల ను 25 శాతం బదులు 13 శాతం తగ్గించారు. అవి కూడా జనసమ్మర్థ ప్రాంతాల్లో కాకుండా జనం లేని చోట తగ్గించారు. ఇక, మద్యం ధరలను పెంచినట్టే పెంచి.. అక్రమ మద్యం పెరుగుతోందనే కారణంగా.. ఇప్పుడు ధరలను మళ్లీ తగ్గించేశారు. అంటే.. ఈ విషయంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను జగన్ గ్రహించారనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఏడాదిలోనే మరో విధానం….
ఇక, రెండో కీలక విషయం. ఇసుక విధానం. ఆదిలో సర్కారు అడుగు పెట్టడంతోనే ఉచిత ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయంటూ.. దానిని నిలిపేశారు. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం నాలుగు నెలల పాటు గగ్గోలు పెట్టినా.. జగన్ స్పందించలేదు. ఈ క్రమంలోనే కొత్త విధానం అంటూ.. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. ఇంటికి వచ్చే విధానం తీసుకువచ్చారు. అయితే, ఇదీ అట్టర్ ఫ్లాప్ అయి.. అవినీతి, అక్రమాలకు పెద్ద ఎత్తున చోటు పెట్టేలా చేసింది. దీంతో ఈ విధానాన్ని కూడా జగన్ తిరిగి నిలిపి వేశారు. ఇప్పుడు మళ్లీ ఏడాదిన్నరలోనే కొత్త విధానం తీసుకువచ్చారు.
ప్రజాగ్రహం మేరకే….
అది కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాకే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తే.. అటు మద్యం, ఇటు ఇసుక విషయాల్లో జగన్ ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని అంచనా వేసుకున్నారనే భావన వినిపిస్తోంది. అదే సమయంలో తాను దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రజలకు నచ్చడం లేదని అర్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి మార్పు మంచిదే అయినా.. జగన్ పెట్టుకున్న మడమ తిప్పను అనే కాన్సెప్ట్ ఎక్కడో దెబ్బతింటోందనే భావన వ్యక్తమవుతుండడం గమనార్హం.
