కష్టమే అయినా?
రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న అవినీతి కరప్షన్ అన్న పదానికి పర్యాయపదంగా, పెద్దన్నగా మారిపోయింది. అధికారంలో ఉన్నవారికి పెద్దవాటా. ప్రతిపక్షంలో ఉన్నవారికి చిన్నకోటా . ఇది చాలాకాలంగా [more]
రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న అవినీతి కరప్షన్ అన్న పదానికి పర్యాయపదంగా, పెద్దన్నగా మారిపోయింది. అధికారంలో ఉన్నవారికి పెద్దవాటా. ప్రతిపక్షంలో ఉన్నవారికి చిన్నకోటా . ఇది చాలాకాలంగా [more]

రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న అవినీతి కరప్షన్ అన్న పదానికి పర్యాయపదంగా, పెద్దన్నగా మారిపోయింది. అధికారంలో ఉన్నవారికి పెద్దవాటా. ప్రతిపక్షంలో ఉన్నవారికి చిన్నకోటా . ఇది చాలాకాలంగా సాగుతున్న పరిణామమే. ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించిన కాంట్రాక్టు సంస్థలు ఈ విధానాన్ని పద్దతిగా పాటిస్తున్నాయి. అయితే సేవారంగం, పారిశ్రామిక అనుమతులు, లీజు ఒప్పందాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాల్లో సాగే అవినీతి మాత్రం ప్రభుత్వ పెద్దల కాతాలోనే పడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇది సాధారణ తంతుగానే సాగిపోతోంది. అందుకే ఎన్నికల వంటి సందర్బాల్లో అధికార పార్టీ వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలుగుతోంది. ప్రతిపక్షం కూడా చాలావరకూ పోటీ పడుతున్నప్పటికీ ఖర్చులో కొంత వెనకబడుతోంది. ఇదంతా అవినీతి నుంచి ఆర్జించిన సొమ్మే. గత తెలుగుదేశం ప్రభుత్వ రాజకీయ అవినీతిపై ఏకమొత్తంగా దర్యాప్తు చేసేందుకు తాజాగా వైసీపీ సర్కారు పూనిక వహించడం చర్చనీయమవుతోంది. ఆ రెండు పార్టీలు రోడ్డెక్కి రచ్చ చేసుకునేందుకు ఇదో కొత్త అంశంగా మారింది.
నేర పరిశోధన…
రాజకీయాల్లో అవినీతి బయటకు వచ్చేది చాలా తక్కువ. పరస్పర ప్రయోజనం ముడిపడి ఉండటంతో ఇచ్చేవారు, తీసుకునేవారు ఇద్దరూ చెప్పరు. అందువల్ల నాయకులు, కాంట్రాక్టుల నెక్సస్ లో అన్నీ సక్రమంగానే చెలామణి అయిపోతుంటాయి. మధ్యలో అధికారుల వాటా ఎలాగూ ఉంటుంది. భారీ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నిటినీ వారి ప్రాధాన్యాన్ని అనుసరించి సంతృప్తి పరుస్తున్నారు. ఈ కొత్త తరహా అవినీతి అమల్లోకి రావడంతోనే ఏ రాజకీయ పక్షం నోరూ పెద్దగా పైకి లేవడం లేదు. రాజకీయంగా భారీ ప్రయోజనం ఉంటుందని భావించిన సందర్బాల్లో మినహా కాంట్రాక్టు సంస్థల వైపు వేళ్లు చూపించేందుకు పార్టీలు ప్రయత్నించడం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలోనూ, తాజాగా వైసీపీ పాలనలోనూ దాదాపు అవే కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కించుకోవడంలో మతలబు అదే. అయితే ఇప్పుడు పాత ప్రభుత్వం మొత్తం తీసుకున్న నిర్ణయాలన్నిటినీ తిరగదోడే విధంగా గంపగుత్తగా ప్రత్యేక దర్యాప్తు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అసాధ్యమైన విషయాన్నే తలకెత్తుకుంటున్నట్లుగా భావించాలి. అమరావతి రాజధాని భూముల వంటి విషయాల్లో కొంతమేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని బలమైన వాదన ఉంది. అందుకు ప్రభుత్వం వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ చట్టపరంగా నిరూపించడం సాధ్యం కాదు. అందుకే ముందడుగు పడటం లేదు.
నేతలు సురక్షితం..
ఆధారాలున్న కేసుల విషయంలోనే గడచిన తొమ్మిదినెలలుగా పెద్దగా పురోగతి లేదు. మొత్తం పరిపాలననే తవ్వి తీయడమంటే మాటలు కాదు. పైపెచ్చు ఇదొక వృథా ప్రయాసగా, ప్రహసనంగా మిగిలిపోతుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయంగా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే అంశాన్ని తాజాగా ఉంచడానికి ఉపకరిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా నియమితమైన సిట్ బృందం ఏవో కొన్ని వివరాలను బయటపెడుతుంటుంది. దానిపై వైసీపీ,టీడీపీలు పరస్పర ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తుంటాయి. దీనివల్ల నాయకులకు పెద్దగా నష్టం వాటిల్లుతుందని ఎవరూ భావించడం లేదు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలతో ముడిపడిన 2 జీ స్కాం లు, హెలికాప్టర్ కుంభకోణాల వంటి వాటికే అతీగతీ లేదు. ఇక స్థానికంగా రాజకీయ ప్రేరేపిత విచారణలకు, పరిశోధనలకు పెద్దగా ప్రయోజనం ఉంటుందనుకోవడం అత్యాశే. అయితే ఈ తాజా ఉదంతాలు అధికార యంత్రాంగానికి చెడు సంకేతాలు పంపే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వంలోని రాజకీయ నాయకత్వం పట్ల బ్యూరోక్రసీలో విధేయత ఉండాలి. దాని స్థానంలో చులకన భావం చోటు చేసుకుంటే రాజకీయ పక్షాలను చిన్నచూపు చూడటం మొదలవుతుంది. అది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది.
అడకత్తెరలో అధికారులు..
విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వాలు, మంత్రులు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేసేది అధికారులే. నిబంధనలు పాటించకపోతే ముందుగా బలయ్యేది వారే. రాజకీయ కార్యనిర్వాహక వర్గంలోని మంత్రులు చేసే సిఫార్సులు, సూచనలు చాలావరకూ మౌఖికంగా ఉంటాయి. దీనిని పరిశీలించండి తరహాలో ఉంటాయి. లిఖితపూర్వకంగా నేరం దొరికేట్లు ఉండదు. తమ శాఖ మంత్రి మనసెరిగి ప్రవర్తించే అధికారులే ఉల్లంఘనలకు సంబంధించిన నిర్ణయాలకు రాతపూర్వకంగా బాధ్యులవుతూ ఉంటారు. అందువల్ల వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంటుంది. తాము ఏరకమైన నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం తిరగదోడుతుందన్న అపనమ్మకం ఏర్పడితే అధికారులు ప్రతి విషయానికి కొర్రీలు వేయడం మొదలు పెడతారు. కోడిగుడ్డుపై తామే వెంట్రుకలు వెదుకుతారు. ఇది పాలనకు ఆటంకంగా మారుతుంది. అందువల్ల ఏ విచారణ అయినా నిర్దిష్టమైన ఆధారాలు, ఆరోపణల ప్రాతిపదికపైనే సాగాలనేది సీనియర్ అధికారుల అభిమతం. బ్రుందం కూర్పును అనుసరించి చూస్తే దాదాపు పోలీసు విచారణ తరహాలో కనిపిస్తోంది. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలు, పరిపాలన వ్యవహారాల్లో నైపుణ్యం ఉండే సీనియర్ బ్యూరోక్రాట్లను ఇందులో భాగస్వాములను చేసి ఉంటే బాగుండేదనే విమర్శ ఇప్పటికే వినవస్తోంది. అందువల్లనే కొండను తవ్వే ప్రయత్నంలో మిగిలిన శాఖల ఉన్నతాధికారులు ఎంతమేరకు సహకరిస్తారనేది కొంతమేరకు అనుమానమే.
-ఎడిటోరియల్ డెస్క్

