గుట్టు మొత్తం విప్పుతారా?
విశాఖ జిల్లాల్లో భూ దందా జరిగి సరిగ్గా మూడేళ్ళు పూర్తి కావస్తోంది. అంతకు ముందు హుద్ హుద్ తుపాను వచ్చింది. మొత్తం విశాఖ అతలాకుతలం అయింది. అదే [more]
విశాఖ జిల్లాల్లో భూ దందా జరిగి సరిగ్గా మూడేళ్ళు పూర్తి కావస్తోంది. అంతకు ముందు హుద్ హుద్ తుపాను వచ్చింది. మొత్తం విశాఖ అతలాకుతలం అయింది. అదే [more]

విశాఖ జిల్లాల్లో భూ దందా జరిగి సరిగ్గా మూడేళ్ళు పూర్తి కావస్తోంది. అంతకు ముందు హుద్ హుద్ తుపాను వచ్చింది. మొత్తం విశాఖ అతలాకుతలం అయింది. అదే హుద్ హుద్ ప్రజలను భయభ్రాంతులను చేస్తే భూకబ్జాదారులకు హుద్ హుద్ వరమైంది. రెవిన్యూ రికార్డులు మొత్తం గల్లంతు అయ్యాయని సాకు చూపించి అప్పటి అధికార పార్టీ అండదండలతో భూదందారాయుళ్ళు మొత్తం విశాఖను దోచేశారు. అంగుళం స్థలం కూడా మిగలకుండా కబ్జా చేసేశారు. అది ప్రభుత్వ స్థలమా, ప్రైవేట్ స్థలమా అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ కబ్జాలు చేసుకుంటూ పోయారు. అపుడు ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి దర్జా సాగిపోయింది. అయితే అప్పటికీ విపక్షాలు మొత్తం ఒక్కటై గొంతెత్తాయి. భూ కబ్జాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. చివరికి చంద్రబాబు సర్కార్ సిట్ విచారణను జరిపించింది.
ఫలితం శూన్యం…
ఆరు నెలల పాటు సిట్ సాగించిన విచారణ మొత్తానికి తూతూమంత్రంగానే ముగిసింది. బడా బాబులు, మంత్రుల స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ భూదందాలో ఉన్నారని ప్రచారం జరిగినా ఏ ఒక్కరి ప్రమేయం లేదని నాటి టీడీపీ సర్కార్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. మొత్తానికి సిట్ నివేదికను మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు. మరి దాని మీద ఎన్నో పోరాటాలు చేసిన వైసీపీ ఇపుడు అధికారంలో ఉంది. మరి వైసీపీ సైతం తాము వచ్చాక కొత్త సిట్ ని నియమిస్తామని చెప్పుకొచ్చింది. దాని ప్రకారం తాజాగా సిట్ ని ఏర్పాటు చేశారు. మూడు నెలల కాలపరిమితిలోగా సిట్ విచారణ పూర్తి చేయాలని కూడా గడువు విధించారు. అయితే ఈ మూడు నెలల సమయం సరిపోతుందా? అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. భూ దందా దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా జరిగిందని అంటున్నారు. ఇందులో బడా బాబుల పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.
టార్గెట్ ఎవరో….?
ఇదిలా ఉండగా తాము ప్రజలకు మాట ఇచ్చినట్లుగా సిట్ విచారణకు ఆదేశించామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇందులో టీడీపీకి చెందిన పెద్ద నాయకులు ఉన్నారని ఆయన మరోసారి ఆరోపించారు. వారందరి గుట్టు బయటకు వస్తుందని ఆయన చెప్పడం విశేషం. మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం సిట్ విచారణను స్వాగతించడం ఇక్కడ గమనార్హం. తాము మళ్ళీ సిట్ విచారణ కావాలని ఎప్పటినుంచో కోరుతున్నామని మాజీ మంత్రి గారు అనడం విశేషం. అసలు దోషులు ముందుకు రావాలని గంటా కూడా అనడంతో అసలు సిట్ విచారణ పరమార్ధం ఏంటి, ఎవరు తెర వెనక ఉన్నారు. ఎవరి మీద గురి ఉందన్నది పెద్ద చర్చగా ఉంది. ఏది ఏమైనా కూడా సిట్ విచారణ మరోసారి జరపడం మాత్రం విశాఖ జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. మరి ఇంతలా మధించిన తరువాత ఏది బయటకు వస్తుందో చూడాలి.

