అక్కడ మొహం చెల్లకే..?
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీజేపీకి ఏమాత్రం బలం లేదన్నది అందరికీ తెలిసిందే. ఉన్నది ఏదైనా విశాఖ సిటీలో మాత్రమే కనిపిస్తుంది. గతంలో విశాఖ కార్పోరేషన్ గెలవడం వల్ల కొంత [more]
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీజేపీకి ఏమాత్రం బలం లేదన్నది అందరికీ తెలిసిందే. ఉన్నది ఏదైనా విశాఖ సిటీలో మాత్రమే కనిపిస్తుంది. గతంలో విశాఖ కార్పోరేషన్ గెలవడం వల్ల కొంత [more]

ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీజేపీకి ఏమాత్రం బలం లేదన్నది అందరికీ తెలిసిందే. ఉన్నది ఏదైనా విశాఖ సిటీలో మాత్రమే కనిపిస్తుంది. గతంలో విశాఖ కార్పోరేషన్ గెలవడం వల్ల కొంత పునాది పార్టీకి ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా హరిబాబు గెలిచారు. అంతకు ముందు 1999 ఎన్నికల్లో కూడా హరిబాబు అప్పటి విశాఖ ఒకటవ నియోజకవర్గంలో విజయం సాధించారు. దాంతో బీజేపీకి పట్టు కొంత సిటీలో ఉందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తారు. అయితే ఇపుడు ఉత్తరాంధ్రాలో బలపడడానికి బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. బలమైన నాయకులను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా పార్టీ పరిధిని పెంచుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ పుట్టాక విశాఖ జిల్లాలో తప్ప మరెక్కడా ఆ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. అయినా నేతలను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ నేతలు వరస పర్యటనలు చేస్తున్నారు.
వైసీపీలోకి రమ్మన్నా కూడా…..
విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని ఎన్నికల ముందు వైసీపీలోకి రమ్మని పిలిచారు. ఆయన్ని అనకాపల్లి ఎంపీగా పంపాలని కూడా ఆలోచన చేశారు. అయితే పంచకర్ల మొదట్లో ఊగిసలాడినా తరువాత ఎందుకో వెనకేశారు. దాంతో అవంతి శ్రీనివాసరావు మాత్రమే వైసీపీలో చేరారు. ఆయన తెలివైన నిర్ణయం వల్ల మంత్రిగా కూడా ఇపుడు అధికారం అనుభవిస్తున్నారు. అదే పంచకర్ల నాడే వైసీపీలోకి వస్తే ఇపుడు ఎంపీగా కీలకంగా జిల్లా రాజకీయాల్లో ఉండేవారని అంటారు. అయితే ఆయన టీడీపీలో ఉండి విశాఖ ఉత్తరం సీటు ఆశించారు. చివరికి అది దక్కకపోవడంతో ఎలమంచిలి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు మాటలు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. నేడో రేపో కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా బీజేపీలోకి పంచకర్ల వెళ్ళి ఏం చేస్తారన్న సందేహాలను ఆయన అనుచరులే వ్యక్తం చేస్తున్నారు. అదే వైసీపీలో చేరితే అధికారం ఉండేదని కూడా అంటున్నారు.
ఈయన కధ అంతేగా…?
ఇక ఇదే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో మాజీ మంత్రి కొండ్రు మురళి ఉన్నారు. ఆయన సైతం మొదట వైసీపీలోకే రావాల్సింది. అయితే రాజాం వైసీపీ సిట్తింగ్ సీటుని ఆయన కోరుకున్నారు. జగన్ మాత్రం ఇవ్వలేమని, పార్టీలోకి వస్తే న్యాయం చేస్తమని అప్పట్లో చెప్పారు. పంతానికి పోయిన మురళి టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఓడిన తరువాత ఆయన మళ్లీ వైసీపీ వైపు వెళ్లడానికి ముఖం చెల్లక అలా కొన్నాళ్ళుగా మధన పడుతున్నారు. ఇపుడు బీజేపీ నుంచి ఆయనకు కూడా ఆహ్వానాలు వస్తున్నాయట. తొందరలోనే కాషాయ జెండా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. ఆయన అనుచరులు సైతం ఇపుడు దిగులు పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తమ నేతకు వైసీపీ సరైన పార్టీ అని, ఇపుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినా ఎంతవరకూ విజయం సాధిస్తామో అర్ధం కావడం లెదని క్యాడర్ అంటోందంటేనే అర్ధం చేసుకోవాలి. ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది, వారికీ అవసరం లేదు, అడగడానికి వీరికి మొహమాటం. ఇలా చాలా మందికి బీజేపీ ఓ వేదిక అవుతోందని అంటున్నారు.

